హెచ్‌-1బీ వీసాదారుల‌కు ట్రంప్ మ‌రో షాక్ !

ABN , First Publish Date - 2020-08-04T19:23:36+05:30 IST

హెచ్‌-1బీ వీసాదారుల‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా మ‌రో షాకిచ్చారు. ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు విదేశీకార్మికుల‌ను, ప్ర‌ధానంగా హెచ్‌-1బీ వీసాలో ఉన్న‌వారిని నియ‌మించ‌కుండా ఉండేందుకు కార్యనిర్వాహ‌క ఉత్త‌ర్వుల‌పై ఆయ‌న సోమ‌వారం సంత‌కం చేశారు.

హెచ్‌-1బీ వీసాదారుల‌కు ట్రంప్ మ‌రో షాక్ !

వాషింగ్ట‌న్ డీసీ: హెచ్‌-1బీ వీసాదారుల‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా మ‌రో షాకిచ్చారు. ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు విదేశీకార్మికుల‌ను, ప్ర‌ధానంగా హెచ్‌-1బీ వీసాలో ఉన్న‌వారిని నియ‌మించ‌కుండా ఉండేందుకు కార్యనిర్వాహ‌క ఉత్త‌ర్వుల‌పై ఆయ‌న సోమ‌వారం సంత‌కం చేశారు. క‌రోనా దెబ్బ‌తో అతలాకుత‌లం అవుతున్న అమెరికాలో నిరుద్యోగిత భారీగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ట్రంప్ స‌ర్కార్ నిరుద్యోగాన్ని త‌రిమికొట్టే అన్ని మార్గాల‌ను అన్వేషించే ప‌నిలో ఉంది. దీనిలో భాగంగానే ట్రంప్ హెచ్‌-1బీ వంటి వ‌ర్క్ వీసాదారుల‌పై దృష్టిసారించారు. 


ఈ నేప‌థ్యంలోనే అమెరిక‌న్ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు హెచ్‌-1బీ వీసాల‌తో పాటు ఇత‌ర విదేశీ వీసాల‌ను సైతం ర‌ద్దు చేస్తూ జూన్‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు విదేశీకార్మికుల‌ను నియ‌మించుకోకుండా నిరోధించే ఉత్త‌ర్వులు జారీ చేశారు. చౌక‌గా ప‌నిచేసే విదేశీ కార్మికుల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే అమెరిక‌న్ల‌ను తొల‌గించే నిర్ణ‌యాల‌ను తాను స‌హించబోయేది లేద‌ని ఈ సంద‌ర్భంగా ట్రంప్‌ స్ప‌ష్టం చేశారు. అంతేగాక ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం అమెరిక‌న్ల‌ను మాత్ర‌మే నియ‌మించుకొనేలా ఒక కార్య‌నిర్వాహ‌క ఉత్త‌ర్వుల‌పై సంత‌కం చేస్తున్నాన‌ని సోమ‌వారం వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో అన్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు ఫెడ‌ర‌ల్ కాంట్రాక్టుల్లో క‌చ్చితంగా అమెరిక‌న్లు ఉండాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, ట్రంప్ తాజా ఉత్త‌ర్వులు భార‌త ఐటీ నిపుణుల‌కు భారీ దెబ్బ అనే చెప్పాలి.    

Updated Date - 2020-08-04T19:23:36+05:30 IST