ఆంథోనీ ఫౌచీపై కన్నెర్రజేసిన ట్రంప్..!

ABN , First Publish Date - 2020-10-20T18:10:33+05:30 IST

అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంథోనీ ఫౌచీపై అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. అతడ్ని ఇడియట్‌గా అభిర్ణించారు. ఎన్నికల దృష్ట్యా ఫౌచీపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

ఆంథోనీ ఫౌచీపై కన్నెర్రజేసిన ట్రంప్..!

వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంథోనీ ఫౌచీపై అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. అతడ్ని ఇడియట్‌గా అభిర్ణించారు. ఎన్నికల దృష్ట్యా ఫౌచీపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ‘‘ఏమైనా జరగనీయండి.. ఇక మమల్ని వదిలేయండి’ అని ప్రజలు అంటున్నారు. వాళ్లు విసిగిపోయారు. ఫౌచీ సహా ఇతర ఇడియట్స్ మాటలను వినడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా ‘ఫౌచీ.. ఇంకా నువ్వు చెప్పే మాటలను మేము వింటే.. అమెరికాలో 7 నుంచి 8 లక్షల మరణాలు సంభవించడం ఖాయం. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటం వల్లే నీపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నాను’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. 


కాగా.. ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్‌లో ముఖ్య సభ్యుడైన ఆంథోనీ ఫౌచీపై ట్రంప్ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఓ పెద్ద కారణమే ఉంది. అదేటంటే.. కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ డెమొక్రటిక్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని భావించిన ట్రంప్ బృందం ఓ స్కెచ్ వేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కరోనాను కట్టడి చేసినట్లు.. ఆయన తీసుకున్న చర్యలపట్ల ఆంథోనీ ఫౌచీ కూడా సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసలు కురిపించినట్లు ఓ వీడియోను రూపొందించారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను ఎన్నికల ప్రచారంలో ప్లే చేశారు. 


దీనిపై ఆంథోనీ ఫౌచీ స్పందించి.. రిపబ్లికన్ నేతల తీరును తప్పుబట్టారు. గతంలో తాను చెప్పిన మాటలను.. రిపబ్లికన్ నేతలు తమ ప్రచార వీడియోలో ఉపయోగించారని తెలిపారు. తన ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ తరఫున మాట్లాడలేదని వివరించారు. వీడియోలోంచి తన మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ మాటలు ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో ఆంథోనీ ఫౌచీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-10-20T18:10:33+05:30 IST