ఓపిక నశిస్తే మోదీ సహా ఎవరినీ వదిలిపెట్టం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-10-28T20:38:16+05:30 IST

రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో

ఓపిక నశిస్తే మోదీ సహా ఎవరినీ వదిలిపెట్టం: కేటీఆర్

హైదరాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్‌ కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. ఉన్నది లేనట్టు చూపెట్టడం బీజేపీకి అలవాటేనన్నారు. సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పారు. మా ఓపిక నశిస్తే ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టం.. మాకు మాటలు వచ్చునని హెచ్చరించారు. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలను కిషన్‌ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని సూచించారు. హరీష్‌రావు సవాల్‌కు బీజేపీ ఎందుకు రాలేదని నిలదీశారు.


రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ..

అత్యధికంగా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ కొనియాడారు. ఇప్పటివరకు రూ. 27 వేల కోట్లకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని వెల్లడించారు. రైతుల పట్ల ప్రభుత్వం, మా పార్టీకి ఉన్న కమిట్‌మెంట్‌కు ఇది నిదర్శనమని వివరించారు. రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 56 వేల కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం డబుల్‌ అయ్యిందని చిట్‌చాట్‌లో కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.


నా దృష్టిలో రేవంత్ రెడ్డి లీడరే కాదు: కేటీఆర్‌

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపోమాపో బీజేపీలోకి పోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2020-10-28T20:38:16+05:30 IST