నీటి లభ్యతపై తేల్చకుండా ముందుకెళ్లొద్దు

ABN , First Publish Date - 2022-01-20T07:15:15+05:30 IST

గోదావ రిలో నీటి లభ్యత తేల్చకుండా నదుల అనుసంధానంలో ముందుకు వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రక్రియలో ముందుకెళ్లడానికి ముందు ..

నీటి లభ్యతపై తేల్చకుండా ముందుకెళ్లొద్దు

నదుల అనుసంధానంపై తెలంగాణ స్పష్టీకరణ.. సమగ్ర అధ్యయనం జరగాలి: ఆంధ్రప్రదేశ్‌

 గోదావరి-కావేరి అనుసంధానానికి 

 ముందు మహానది-గోదావరి 

 అనుసంధానం చేపట్టాలి: ఛత్తీ్‌సగఢ్‌

 ఎన్‌డబ్ల్యూడీఏ పాలక 

 మండలి భేటీలో రాష్ట్రాలు


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గోదావ రిలో నీటి లభ్యత తేల్చకుండా నదుల అనుసంధానంలో ముందుకు వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రక్రియలో ముందుకెళ్లడానికి ముందు గోదావరిలో ఏ మేర నీటి లభ్యత ఉందో అధ్యయనం చేసి, తేల్చాలని స్పష్టం చేసింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (నేషనల్‌ వాటర్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ-ఎన్‌డబ్ల్యూడీఏ) 69వ పాలక మండలి సమావేశం ఏజెన్సీ చైర్మన్‌, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఏప్రిల్‌లో గోదావరి-కావేరి అనుసంధానం డీపీఆర్‌ను పంపించామని, ఏ నిర్ణయం తీసుకున్నారని తెలుగు రాష్ట్రాలను కోరగా  తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు స్పందిస్తూ గోదావ రిలో నీటి లభ్యతపై తేల్చాలని స్పష్టం చేశారు. లేదంటే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల ఆయకట్టుపై ప్రభావం పడుతుందని, తాగు, సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. గోదావరి-కావేరి అనుసంధానం డీపీఆర్‌పై ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేశామని, వాటికే కట్టుబడి ఉన్నామని గుర్తుచేశారు. దిగువ రాష్ట్రంగా ఉన్నందువల్ల తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి లభ్యతపై ఒక్కో అధ్యయనం ఒక్కో నివేదిక ఇస్తుందని, ఏ అధ్యయనంలోనూ సారూప్యత లేదని, దీనివల్ల సమస్యలున్నాయని, నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరగాలని   కోరారు. గోదావరి-కావేరి అనుసంధానం డీపీఆర్‌పై అభిప్రాయం త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.  ఛత్తీ్‌సగఢ్‌ స్పందిస్తూ గోదావరిలో నీళ్లు లేవని, గోదావరి-కావేరి అనుసంధానం చేసే ముందు మహానది-గోదావరి అనుసంధానం చేపట్టి, ఏ మేర జలాలు తరలిస్తున్నారో ఆ మేరకు నీటిని తరలిస్తే అభ్యంతరం లేదని పేర్కొంది.  అనుసంధానంపై 2019లో ఒక డీపీఆర్‌ను, 2021లో మరో డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రాలకు అందించింది.  తెలంగాణ ఇప్పటికే అనుమానాలు/అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. త్వరలోనే అనుమానాల నివృత్తికి సమావేశం నిర్వహిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది.  


సానుకూల స్పందన: కేంద్రం

నదుల అనుసంధానంపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరగా.. రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయని, వివిధ ప్రాజెక్టులపై పూర్తి సహకారం అందిస్తాయని హామీ ఇచ్చాయని కేంద్ర జలశక్తి  శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సందేహాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాయని వెల్లడించింది.

Updated Date - 2022-01-20T07:15:15+05:30 IST