పరిహారం వచ్చేనా!

ABN , First Publish Date - 2022-01-20T07:09:10+05:30 IST

ముందటి ఏడాది(2020) వానాకాలంలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలిస్తూ హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది! ఈ నెల..

పరిహారం వచ్చేనా!

2020 ఖరీఫ్‌ పంట నష్ట పరిహారానికి ముంచుకొస్తున్న గడువు

ఈనెల 28లోగా చెల్లింపులు పూర్తిచేయాలన్న హైకోర్టు

రైతుల జాబితా రూపకల్పనకు 4 నెలల క్రితమే ఆదేశం

అసలు ప్రక్రియే మొదలుపెట్టని రాష్ట్ర ప్రభుత్వం

గడువుకు మరో 8 రోజులే.. బాధిత రైతుల్లో ఆందోళన


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ముందటి ఏడాది(2020) వానాకాలంలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలిస్తూ హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది! ఈ నెల 28లోగా పరిహారం చెల్లించాలని 4 నెలల క్రితమే కోర్టు స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి కార్యాచరణ మొదలు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ సమయంలో పంటలు నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2020 వానాకాలం సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భారీగా వరదలొచ్చి వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 25 లక్షల ఎకరాల్లో రూ.8,633 కోట్ల మేర పంట నష్టం జరిగిందని ప్రఽధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. లేఖపై స్పందించిన కేంద్రం, ‘నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌’ కింద రూ. 977 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, అందులో నుంచి తక్షణసాయంగా 185 కోట్లు వినియోగించుకోవాలని రాష్ట్రానికి లేఖ పంపింది. కానీ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కొవిడ్‌- 19 అవసరాలకు ప్రభుత్వం దారిమళ్లించింది.


దీంతో ప్రకృతి విపత్తుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వంకూడా ఎలాంటి అధికారిక సర్వే నిర్వహించలేదు. రైతులకు నయాపైసా నష్టపరిహారం ఇవ్వలేదు.  2021 వానాకాలం సీజన్‌లో జూన్‌, జూలై నెలల్లో కురిసిన భారీవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు మొదటివారంలో కురిసిన వర్షాలకు 6.20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అదేనెల చివరలో గులాబ్‌ తుపాను దెబ్బకు 2.10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంతాకలిపి 2021 వానాకాలంలో 12.8 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. నిరుడు రూ. 3,840 కోట్ల విలువైన పంటనష్టం జరిగినట్లు అంచనా వేశారు. కానీ రైతులవారీగా పంటనష్టం లెక్కలు తీయలేదు. రైతులకు నష్టపరిహారం ఏమాత్రం పంపిణీచేయలేదు. ఈనేపథ్యంలో నిరుడు సెప్టెంబరు నెలలో ‘రైతు స్వరాజ్య వేదిక’ ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్‌, కన్నెగంటి రవి, ఎస్‌. ఆశాలతలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీంతో 2021 సెప్టెంబరు 28 న హైకోర్టు తీర్పు వెలువరించింది.


మూడు నెలల్లో.. అంటే 2021 డిసెంబరు 28 నాటికి 2020 వానాకాలం పంటలు నష్టపోయిన రైతుల జాబితా రూపొందించాలని, 2022 జనవరి 28 నాటికి సదరు రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీచేయాలని హైకోర్టు అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎమ్మెస్‌ రాంచంద్రారావు, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. కౌలురైతులతో సహా పంటనష్టపోయిన రైతులందరికీ పరిహారం అందజేయాలని సూచించింది. అదేక్రమంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో చేరడాన్ని రాష్ట్రాల నిర్ణయానికి కేంద్రం వదిలేయటంతో... తెలంగాణ ప్రభుత్వం ఆ పథకంలో చేరలేదని, ఫలితంగా బీమా రక్షణ లేకపోవటంతో సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అప్పట్లో హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది.


సర్వే లేదు... గ్రామసభలు లేవు

2020 వానాకాలంలో జరిగిన పంటనష్టానికి సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎలాంటి గ్రామసభలు నిర్వహించలేదు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించలేదు. ఏఈవోలను ఎలాంటి సర్వేకు పురమాయించలేదు. మూడు నెలల్లో పూర్తిచేయాల్సిన పంటనష్టం సర్వేను అస్సలు పట్టించుకోనేలేదు. గత డిసెంబరు నెల 28 తేదీ నాటికే సర్వే గడువు పూర్తికాగా ఈనెల 28 తేదీ నాటికి నష్టపరిహారం పంపిణీ కూడా పూర్తికావాల్సి ఉంది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తటంలేదు.


ఇస్తారా? ఇయ్యరా?

 2021 పంట నష్టపరిహారం అటుంచితే... హైకోర్టు ఆదేశించిన 2020 పరిహారమైనా రైతులకు పంపిణీ చేస్తారా? లేదా? అనే స్పష్టతలేదు. హైకోర్టు ఇచ్చిన డెడ్‌లైన్‌ లోపు ప్రభుత్వం స్పందించకపోతే... కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పైగా నిర్ణీత గడువులోగా ఈ నాలుగు నెలల్లో జరిగిన పురోగతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. మరో 8 రోజుల్లో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? పరిహారం ఇస్తుందా? ఇవ్వదా? హైకోర్టుకు ఏం చెబుతుంది? అనేది తేలే అవకాశాలున్నాయి.  


పరిహారం చెల్లించాలి... 

పంటల బీమా అమలుచేయాలి

- విస్సా కిరణ్‌కుమార్‌, రైతు స్వరాజ్య వేదిక

పంటనష్టం సమస్య కేవలం వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంత రైతులది మాత్రమే కాదు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రులు గానీ... ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పర్యటన చేసినంత మాత్రాన సమస్య పరిష్కారంకాదు. 2020, 2021 సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల జరిగిన పంటనష్టంపై ప్రభుత్వం స్పందించాలి. ప్రకృతి విపత్తులతో పంటనష్టం జరగ్గానే వ్యవసాయశాఖ అధికారులతో సర్వే నిర్వహించి, తక్షణమే రైతులకు నష్ట పరిహారం అందించే వ్యవస్థను ఏర్పాటుచేయాలి. హైకోర్టు ఆదేశాలమేరకు 2020 లో జరిగిన పంట నష్టపరిహారంతోపాటు, 2021 వానాకాలంలో, ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన పంటనష్టానికి సంబంధించిన పరిహారాన్ని రైతులకు పంపిణీచేయాలి. అదేక్రమంలో రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలుచేసి రైతులకు భరోసా కల్పించాలి. ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకంలో తెలంగాణ రాష్ట్రం వెంటనేచేరి రైతులకు మేలుచేయాలి. 

Updated Date - 2022-01-20T07:09:10+05:30 IST