TTD జంబో బోర్డు నియామకంలో స్కామ్... కిషన్‌రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2021-09-18T22:29:29+05:30 IST
టీటీడీ జంబో బోర్డు నియామకంలో స్కామ్‌లు బయటపడుతున్నాయి. కేంద్రమంత్రులకు తెలియకుండా
అమరావతి: టీటీడీ జంబో బోర్డు నియామకంలో స్కామ్‌లు బయటపడుతున్నాయి. కేంద్రమంత్రులకు తెలియకుండా వారి పేర్లతో బోర్డులో పదవుల పందేరం జరిగినట్లు తేలింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు ఉపయోగించి ఓ వ్యక్తికి బోర్డులో పదవి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయం కిషన్‌రెడ్డి దాక వెళ్లింది. ఈ వ్యవహారంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం జగన్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తన పేరును దుర్వినియోగం చేయడాన్ని ఆయన లేఖలో ఖండించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్‌కు సూచించారు. మొత్తంగా టీటీడీ పాలకమండలి నియామకాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వైసీపీతో పాటు ఏపీ బీజేపీ నేతల పాత్ర కూడా ఉన్నట్లు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు. వైసీపీ వచ్చీ రాగానే దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల కథ మరీ ‘ప్రత్యేకం’. వీరికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. మరి వీరేం చేస్తారంటే... ఏమీ చేయరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసిన జంబో బోర్డును తక్షణం రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఒక లేఖ రాశారు. ‘‘ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అయిన తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం. టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు. భక్తి భావం, సేవా స్పూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన ఆలయ ధర్మకర్తల మండలిలో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరగాళ్లు, కళంకితులకు చోటు కల్పించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హనీయం’’ అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.