అన్న చోరీ చేస్తాడు.. తమ్ముడు అమ్మేస్తాడు.. 25 ఏళ్లకే 53 చోరీలు

ABN , First Publish Date - 2021-04-04T14:51:30+05:30 IST

బోడుప్పల్‌కు చెందిన ఎండీ సద్దాం అలీ అలియాస్‌ ఇమ్రాన్‌ అలీ (25) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు...

అన్న చోరీ చేస్తాడు.. తమ్ముడు అమ్మేస్తాడు.. 25 ఏళ్లకే 53 చోరీలు

  • ఆట కట్టించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
  • రూ. 32 లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలు చేస్తున్న వ్యక్తితోపాటు చోరీసొత్తు విక్రయిస్తూ సహకరిస్తున్న అతడి తమ్ముడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, సిద్దిపేట పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. వారిద్దరి నుంచి 8 చోరీ కేసులకు సంబంధించి రూ.32 లక్షల విలువైన బంగారు, వెండినగలు స్వాధీనం చేసుకున్నారు. ఆరేళ్లలో 53 చోరీలకు పాల్పడిన ఘరానా నిందితుడి వివరాలను శనివారం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. బోడుప్పల్‌కు చెందిన ఎండీ సద్దాం అలీ అలియాస్‌ ఇమ్రాన్‌ అలీ (25) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. మల్కాజిగిరికి చెందిన పోతరాజు అలియాస్‌ రాజుతో జట్టుకట్టాడు. మల్కాజిగిరి పోలీస్టేషన్‌ పరిధిలో చోరీలు చేయడం ప్రారంభించాడు. చిలకలగూడ పోలీసులు 2015లో వీరిద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా పంథా మార్చుకోకుండా తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఓ చోరీ కేసులో ఇమ్రాన్‌అలీని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం 2018లో అతడిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.


నగరం నుంచి దూరంగా.. 

పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్‌అలీ.. చోరీ చేసే పంథాను గుర్తించిన నగర పోలీసులు అతడు చోరీ చేసిన వెంటనే గుర్తించి అరెస్ట్‌ చేసేవారు. జైలు నుంచి అక్టోబర్‌ 2020లో విడుదలైన అతడు... నగరంలో చోరీ చేస్తే దొరికిపోతామనే భయంతో వరంగల్‌, సిద్దిపేట్‌, గుంటూరు ప్రాంతాలకు వెళ్లి అక్కడ చోరీలు చేయడం ప్రారంభించాడు. జైలు నుంచి విడుదలైన 6 నెలల్లో సిద్దిపేటలో నాలు గు చోరీలు, వరంగల్‌లో 3 చోరీలు, గుంటూరు పట్టాభిపురంలోని ఓ ఇంట్లో మొత్తం 8 చోరీలు చేశాడు. తాళం వేసిన ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసేవాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు అతడి తమ్ముడు ఎండీ అన్వర్‌ అలీ(25) సహకరించేవాడు.


ఆయా కేసుల్లో విచారణ ప్రారంభించిన సిద్దిపేట, వరంగల్‌ పోలీసులు చోరీ ప్రాంతంలోని ఫుటేజ్‌లను నగర పోలీసులతోకు చూపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల్లో ఉన్న ఇమ్రాన్‌ అలీని గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, సిద్దిపేట పోలీసులతో కలిసి శనివారం ఇమ్రాన్‌ అలీ, అతడి సోదరుడు అన్వర్‌ అలీలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 32లక్షల విలువచేసే 61.70 తులాల బంగారు నగలు, 1.10 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, సిద్దిపేట పోలీసుల సమన్వయంతో కేసును ఛేదించామని... ప్రతి ఒక్క రూ తమ ఇంట్లో, వీధిలో, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. తదుపరి విచారణ కోసం నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని సిద్దిపేట పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-04-04T14:51:30+05:30 IST