రెండు ప్రపంచాలు - రెండు పుస్తకాలు

ABN , First Publish Date - 2020-07-13T06:04:10+05:30 IST

అనుకోకుండా ఈ మధ్య జీనీ థాంప్సన్‌ అనే ఓ అమెరికన్‌ కవయిత్రి రాసిన ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ చదవటం తటస్థించింది. చదివాక మన తెలుగు కవి డా. రవూఫ్‌ రాసిన ‘నది, కాలం, అతడు’ గుర్తుకొచ్చింది....

రెండు ప్రపంచాలు - రెండు పుస్తకాలు

యాదృచ్ఛికంగా - ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’, ‘నది, కాలం, అతడు’ల రచనా కాలం ఒకటే! ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ 2016లో పుస్తకంగా విడుదల ఐతే ‘నది, కాలం, అతడు’ ముందుమాటల కారణంగా కొంత ఆలస్యమై డిశంబర్‌ 2017లో ప్రెస్‌ నుండి బైటికొచ్చింది. పుస్తకాల పేర్లలోనూ పోలిక  ఉండటం ఒక విశేషం! నదినీ, నీటినీ వేరు చేసి చూడలేము. ఒకే విధమైన ఆలోచన భిన్న ప్రపంచాలలో జీవించే ఇద్దరు వ్యక్తు లలో జనించటం, ఆ ఆలోచన పుస్తకాలుగా ఆకృతి దాల్చటం... అద్భుతం కాక ఇంకేమిటి?


అనుకోకుండా ఈ మధ్య జీనీ థాంప్సన్‌ అనే ఓ అమెరికన్‌ కవయిత్రి రాసిన ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ చదవటం తటస్థించింది. చదివాక మన తెలుగు కవి డా. రవూఫ్‌ రాసిన ‘నది, కాలం, అతడు’ గుర్తుకొచ్చింది. రెంటిలోనూ ఒక కవి లేదా రచయిత జీవితంలోని ముఖ్య సంఘటనలూ, రచనలే ఇతివృత్తం. ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ కవితా సంపుటికి అమెరికా లోని అలబామాలో జీవించిన సుప్రసిద్ధ రచయిత్రీ, సంఘ సేవకురాలైన ‘హెలెన్‌ కెల్లర్‌’ (1880-1968) జీవితమే భూమిక! ఈ కవితా సంపుటిని రచించింది అలబామాకే చెందిన కవయిత్రి జీనీ థాంప్సన్‌. ఆమె తన రచనకు పూర్తిగా ‘హెలెన్‌ కెల్లర్‌’ ఆత్మ కథ ‘ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌’పై ఆధారపడింది. కానీ ‘నది, కాలం, అతడు’ అలా కాదు. ఆధునిక తెలుగు కవిత్వానికి ఒక మూల స్తంభంగా నిలబడిన మహాకవి ఇస్మాయిల్‌ గురించి ఆయనకు అత్యంత సన్నిహితుడైన యువ కవి మిత్రుడు రవూఫ్‌ రాసిన జీవిత కథ ఇది! 


యాదృచ్ఛికంగా ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’, ‘నది, కాలం, అతడు’ల రచనా కాలం ఒకటే! ‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ 2016లో పుస్తకంగా విడుదలైతే ‘నది, కాలం, అతడు’ ముందు మాటల కారణంగా కొంత ఆలస్యమై డిశంబర్‌ 2017లో ప్రెస్‌ నుండి బైటికొచ్చింది.  పుస్తకాల పేర్లలోనూ పోలిక ఉండటం ఒక విశేషం! నదినీ, నీటినీ వేరుచేసి చూడలేము. ఒకే విధమైన ఆలోచన భిన్న ప్రపంచాల్లో జీవించే ఇద్దరు వ్యక్తుల్లో జనించటం, ఆ ఆలోచన పుస్తకాలుగా ఆకృతి దాల్చటం... అద్భుతం కాక ఇంకేమిటి?


ఇంతకీ హెలెన్‌ కెల్లర్‌ ఎవరు? ఏమిటీ ఆమె గొప్పతనం? అంటే- ఆమెకి చూపు లేదు. కానీ ఈ ప్రపంచాన్ని చాలా గొప్పగా దర్శిం చింది. 37 దేశాలూ, 4 ఖండాలు తిరిగింది. జీనీ థాంప్సన్‌ పుస్తకంలో హెలెన్‌ కెల్లర్‌ దేశదేశాల్ని సందర్శిం చిన వైనం, ఆ సందర్భాలూ, సంఘట నలూ అన్నీ ‘కవితలు’గా రికార్డ్‌ అయ్యాయి. మచ్చుకి కొన్ని: 


‘ప్రాక్టీసింగ్‌ స్పీచ్‌’ అనే కవిత జపాన్‌ దేశాన్ని సందర్శించిన సందర్భాన్ని తెలియ చెప్తుంది: ‘‘నేను నా ముఖాన్ని/ పైకెత్తాను/ ఓ సందేశాన్ని విన్పించేందుకు!/ నా సందేశం చాలా సరళం;/ ఈ లోకాన్ని కుదిపి వేసేది మటుకు కాదు/ ఇంకా పుట్టని పిల్లల చూపుకోసం/ నేను పడే ఆశ!’’- హిరోషిమా, నాగసాకి లపై అమెరికా అణుబాంబు దాడుల నేపథ్యంలో రాసిన కవిత ఇది. ‘రీప్రోచ్‌’ అనే ఇంకో కవితలో- ‘‘నేను స్పృశించిన ముఖాలు/ నా అడుగుల కింద రాళ్ళ తునకలకి మల్లే ఉన్నాయి./ నేను కుదురుగా నిలబడలేకున్నాను./ నా దేశమే కదా ఇది చేసింది./ నేనో అంధ సైనికుడిని తాకాను/ అతని తెగిన కాలు నా చేతికి తగిలింది/ నా దేశమే కదా ఇది చేసింది./ నేనీ నేలపైన నిలబడలేకున్నాను’’. హెలెన్‌ కెల్లర్‌ అంతరంగాన్నీ, ఆమె జీవితంలోని మానవీయ కోణాన్నీ ఆవిష్కరించే పద్యాలివి! 


జీనీ థాంప్సన్‌ తన కవితల్ని హెలెన్‌ కెల్లరే మనతో సంభాషిస్తు న్నట్టు - ‘ఉత్తమ పురుష’లో చెప్తూ పోయింది. రవూఫ్‌ మాత్రం తానొక సాక్షీభూతుడిగా నిలబడి ఇస్మాయిల్‌ హృదయాన్ని ఆవిష్కరించాడు. ఇస్మాయిల్‌ గురించి చెప్తూ ఒక కవితలో రవూఫ్‌ ఇలా అంటాడు: ‘‘రాళ్ళు కూడా పుష్పిస్తాయనీ/ శిల్పాలై విచ్చుకుంటాయనీ/ ఇస్మాయిల్‌కి బాగా తెలుసు/ బాధని వ్యక్తపరచడు/ చిరునవ్వులే చిందిస్తాడు’’.


హెలెన్‌ కెల్లర్‌ విఫల ప్రేమ గురించి జీనీ థాంప్సన్‌ ‘దిస్‌ డే’ అనే కవితలో ప్రస్తావిస్తుంది. హెలెన్‌ కెల్లర్‌ తన కంటే చిన్న వాడైన ‘పీటర్‌ ఫాగన్‌’ని ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటారు కానీ కారణాంతరాలతో విడిపోతారు. ఆ వియోగ దుఃఖం నించి హెలెన్‌ కెల్లర్‌ తేరుకునే సందర్భాన్ని ఈ కవిత తెలియజేస్తుంది: ‘‘నా చేతిలో/ నక్షత్రాలు కాంతిని ఒలక బోశాయి/ నేన్నిన్ను ఎరుగుదును/ కనుకనే నీ గురించిన ఆలోచన నాకు./ ఉదయపు కిక్కిరిసిన రోడ్డు సందోహంలో నీ వాగ్దానాలు వెలిసిపోతున్నాయి./ వీధి రణగొణల మధ్య నువ్వు లేవన్న నిజంలాగే/ నీ పరోక్షంలో పగిలిన మట్టిపాత్రని/ నిరుపయుక్తంగా ఉన్నాను నేను./ నేను ప్రేమించిన నువ్వు నాతో లేకున్నావు కానీ/ నాకు మటుకు ఒకింత స్వేచ్ఛని ప్రసాదించావు’’.


ఇస్మాయిల్‌ జీవితంలోనూ ఒక స్త్రీమూర్తి ఉంది. ‘కవి - గాయని’ కవితలో వాళ్ల ప్రేమ గురించి రవూఫ్‌ ఇలా అంటాడు: ‘‘ఆమె గొంతు ముడి విప్పి పాడుతోంటే -/ ఆ గళ మాధుర్యంలోపడి/ కొట్టుకుపోతూ/ అతను అస్తిత్వం కోల్పోతాడు’’.


‘ది మిత్‌ ఆఫ్‌ వాటర్‌’ కవితా సంపుటిలో హెలెన్‌ కెల్లర్‌ జీవితంలోని అత్యంత ఆప్తులైన వ్యక్తులు తారసపడతారు. ఉదాహరణకి ఆమె ఉపాధ్యాయిని సల్లివాన్‌, ఆమె ప్రేమించిన పీటర్‌ ఫాగన్‌లతోపాటు జాన్‌ హిట్జ్‌, జో డేవిడ్‌సన్‌లు ఇంకా అనేకుల ప్రస్తావన ఉంటుంది. అలాగే - ‘నది, కాలం, అతడు’ కవితాసంపుటిలోనూ ఇస్మాయిల్‌కి అత్యంత ఆప్తులూ, ఇష్టులైన వ్యక్తుల్ని చిరపరిచితం చేశాడు రవూఫ్‌! దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఉమర్‌ అలీషా, వజీర్‌ రహ్మాన్‌, చలం, పంతులు, స్మైల్‌, పరు చూరి రాజారామ్‌లు వివిధ సందర్భాలలో మనతో కరచాలనం చేస్తారు. హృదయానికి హత్తుకుంటారు.


‘రిటర్నింగ్స్‌’ అనే పద్యంలో జీనీ థాంప్సన్‌ ఇలా అంటుంది - కెల్లర్‌ గురించి: ‘‘ఓ కుర్చీనీ, ఆమె పుస్తకాల్నీ, ఈ గదినీ/ నా కోసం తెరిచి ఉంచినట్టున్నారు ఎవరో?/ క్షీణిస్తున్న కాంతికి అభిముఖంగా/ ఆమె చేరువ కావటాన్ని నేను అనుభూతిస్తున్నాను’’

‘వలస ‘పాకనాటి’ ఒంటరి పక్షి ఒకటి’ అనే పద్యంలో ఇస్మా యిల్‌ గురించి రవూఫ్‌ కూడా: ‘‘హృదయంలోని శూన్యాన్నో/ మస్తిష్కాన్నావరించిన/ ఒకలాంటి దిగుల్నో నిరాశనో/ వెన్నాడు తోన్న ఏకాకితనాన్నో/ మోస్తూ..../ అల్లంత దూరాన ఉన్న/ ఆనంద తీరాల్ని వెతుకులాడుతూ/ ఎగురుతూనే ఉంది/ వలస పాకనాటి ఒంటరి పక్షి ఒకటి’’ అని! 


విదేశాల్లో మహాకవుల జ్ఞాపకాల్ని పదిలపరుస్తారు. అమెరికా లోని అలబామాలో హెలెన్‌ కెల్లర్‌ పుట్టిన ఇంటిని ఆమె జ్ఞాప కార్థం మ్యూజియంగా రూపుదిద్దారు. మన దేశంలో మాత్రం మహాకవుల ఇళ్ళని కూల్చేసి వాళ్ళ జ్ఞాపకాల్ని తుడిచేస్తున్నారు. ఈ విషాదం గురించి రవూఫ్‌ వాపోతాడు: ‘‘చిలుకలు వాలిన చెట్టు/ హటాత్తుగా నేలకూలిపోయింది./ ఆ ‘చెట్టు’కి ఆవాసమై నిల్చిన/ బెంగుళూరు పెంకుల పాత ఇల్లూ అదృశ్యమైంది/ ఇప్పుడా ఇల్లూ లేదు/ చెట్టూ లేదు/ ఏ ఒక్క ఆనవాలూ మిగల్లేదు’’.

ఒక కవీ, రచయితా జీవితమే ఇతివృత్తంగా ఒక కవితా సంపుటి వెలువడటం ప్రపంచ భాషలలో ఇదే మొదటిసారి! ఆంగ్లంలో జీని థాంప్సన్‌ రాస్తే తెలుగు లో రవూఫ్‌ రాశాడు. వేటికవే విలువైన కవితా సంపుటాలు. ఒక దానితో ఒకటి పోలిక లేనివీ, పోల్చదగినవి కూడా! 


ఈ కవితా సంపుటాల ఇతివృత్తా లతో పాటు ఇతివృత్తంగా నిలిచిన వ్యక్తుల జీవితాల నడుమ కూడా పోలికల్ని గుర్తించవచ్చు! హెలెన్‌ కెల్లర్‌ కి చూపులేదు. వినికిడి శక్తి కూడా లేదు. ఇస్మాయిల్‌ జీవన గతిలో తన గళాన్ని కోల్పోయాడు. నిశ్శబ్దాన్ని వరించాడు. పలకని స్వరంలోనే గమకాలెన్నింటినో మౌనంతో పలికించాడు: 

‘‘ఎరుపెక్కే

ఇవాళ్టి సంధ్య కానీ

నలుపెక్కి వచ్చే నిరాశాంధం కానీ

నా మనస్సులో ఆనందపు తెరచాపలెత్తి

అనవరతం సాగిపోయే

ఈ కాంతి పడవల్ని ఆర్పలేవనుకుంటాను’’ అన్నాడు. హెలెన్‌ కెల్లర్‌ కూడా ఇలాంటి వాక్యాల్నే రాసింది ఒక చోట - ‘‘నువ్వు వెలుతురుకి ఎంతో అలవాటు పడ్డావు నేన్నిన్ను చీకటితో కూడిన నా నిశ్శబ్ద మైదానంలోకి తోడ్కొనిపోతే నువ్వు తొట్రుపడతావేమో నని భయం నాకు’’ అంది. వీళ్ళ జీవన గాథలు సదా స్ఫూర్తిదాయకం! 

జి. వెంకటేష్‌

98496 14113


Updated Date - 2020-07-13T06:04:10+05:30 IST