బైక్‌ కొనివ్వలేదని యువకుడు బలవన్మరణం

ABN , First Publish Date - 2020-12-26T13:24:39+05:30 IST

వేర్వేరు కారణాలతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య

బైక్‌ కొనివ్వలేదని యువకుడు బలవన్మరణం

హైదరాబాద్ : వేర్వేరు కారణాలతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు దర్యాప్తులో ఉన్నాయి. బాలానగర్‌ రాజుకాలనీకి చెందిన డింగ్రే చంద్రకాంత్‌, డింగ్రే శ్రీకాంత్‌ అన్నదమ్ములు. చంద్రకాంత్‌ ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటే శ్రీకాంత్‌(28) బాలానగర్‌లోని ఓ మెటల్‌షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం చంద్రకాంత్‌ శ్రీకాంత్‌కు చెప్పి డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా శ్రీకాంత్‌ ఎత్తకపోవడంతో చంద్రకాంత్‌ పొరుగింటి వారిని ఇంటికి పంపాడు. వారు వెళ్లి చూసే సరికి శ్రీకాంత్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్‌కు కోపం, ఆవేశం ఎక్కువని తరచూ తలను గోడకు బాదుకునేవాడని, మానసికస్థితి బాలేదని అందుకే ఉరేసుకుని ఉండవచ్చని చంద్రకాంత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


బైక్‌ కొనివ్వలేదని..

జీడిమెట్ల.. రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముండే చక్రాల కృష్ణ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌(24) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న రాత్రి 8గంటలకు కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాత్రి 9.15గంటలకు వచ్చే సరికి ప్రవీణ్‌ కుమార్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు అతడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు రోజుల క్రితం బైక్‌ ఇప్పించమని అడగగా లాక్‌డౌన్‌ కారణంగా అప్పులు ఉన్నాయని సముదాయించామని ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-12-26T13:24:39+05:30 IST