ఉద్యోగుల విభజన షురూ

ABN , First Publish Date - 2021-12-09T05:52:55+05:30 IST

ఉద్యోగుల విభజన షురూ

ఉద్యోగుల విభజన షురూ

సీనియారిటీ జాబితాల క్రోడీకరణ పూర్తి 

జిల్లా కేడర్‌లకు నేడు ఆప్షన్ల స్వీకరణ 

15న ఉద్యోగులకు కేటాయింపుల ప్రొసీడింగ్స్‌

ఆ తర్వాతే బదిలీల ప్రక్రియ జరిగే అవకాశం

ప్రభుత్వ శాఖల్లో ఎటుచూసినా కేడర్‌ ముచ్చట్లే


హనుమకొండ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విభజనపై ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. బుధవారం జిల్లా స్థాయి కేడర్‌ పోస్టులను తేల్చారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సీనియారిటీ జాబితాల క్రోడీకరణ కూడా పూర్తిచేశారు. ఉద్యోగుల ఐచ్ఛికాలను (ఆప్షన్స్‌) స్వీకరించడం కూడా  మొదలైంది. వీటిని గురువారం సాయంత్రం వరకు స్వీకరిస్తారు. ఐచ్ఛికాలతో పాటు, ఉద్యోగులు ప్రత్యేక కేటగిరీ కింద పేర్కొన్న క్లైములన్నిటినీ పరిగణలోకి తీసుకొని సీనియారిటీ జాబితాలను ఈనెల 10వ తేదీన అప్‌డేట్‌ చేస్తారు. జిల్లా కేడర్‌కి సంబంధించిన కేటాయింపుల కమిటీ ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు సమావేశమై కేటాయింపులను ఖరారు చేస్తుంది. ఈ నెల 15వ తేదీన ఉద్యోగులకు కేటాయింపుల ప్రొసీడింగ్‌లు జారీ అవుతాయి. ప్రొసీడింగ్స్‌ అందుకున్న వారం రోజుల్లో ఉద్యోగులు వారికి కేటాయించిన చోట విధుల్లో చేరాల్సి ఉంటుంది. 


కలెక్టరేట్‌లో సందడి

విభజన ప్రక్రియ కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌ హోదాలో ఉన్న హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం అన్ని శాఖల అధిపతులతో సమావేశమయ్యారు. 12 అంశాలతో ఉద్యోగుల వివరాలను పొందుపరచాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశం మేరకు ఆయా శాఖల అధిపతులు ఉద్యోగుల జాబితాను అదనపు కలెక్టర్‌కు సమర్పించారు. జిల్లా పోస్టుల విభజనతో పాటు జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల వివరాలను కూడా సిద్ధం చేసే పనిలో హెచ్‌వోడీలు తలమునలై ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయం ఉద్యోగుల విభజన కసరత్తుతో సందడిగా మారింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులంతా విభజన ప్రక్రియపై చర్చించుకోవడం కనిపిస్తోంది.  బుధవారం సాయంత్రం నుంచి ఉద్యోగులు తమ హెచ్‌వోడీలకు ఐచ్ఛికాలు అందించడం ప్రారంభించారు. గురువారం సాయంత్రంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావలసి ఉంది. అయితే 12  అంశాల ఫార్మాట్‌కు మరో రెండు అంశాలు ఈ సందర్భంగా చేర్చనున్నారు. ఉద్యోగి బదిలీ కోరుకుంటున్న జిల్లాతో పాటు వైకల్యం, ఇతర ప్రత్యేక పరిస్థితుల వివరాలను ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. 


ఇప్పట్లో బదిలీలు లేనట్టేనా?

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపులు పూర్తయిన తర్వాత ప్రోసీడింగ్స్‌ అందుకున్న వారం రోజుల్లో ఉద్యోగులు తమకు కేటాయించిన చోట విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ బదిలీలు ఇప్పటికిప్పుడు ఉండక పోవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాల కేటాయింపులు మాత్రమే జరుగనున్నట్టు తెలుస్తోంది. కేడర్‌ స్ట్రెంత్‌, కేటాయింపులు, ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీ ఉండవచ్చునని తెలుస్తోంది. ఆగమేఘాల మీద బదిలీలు చేస్తే పొరపాట్లు దొర్లే అవకాశం ఉందనీ, ఆ మేరకు సవరించి మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి పెద్ద తతంగమే చేయాల్సి ఉంటుంది కనుక బదిలీలపై తొందరపడరాదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.  


కేటాయింపులు

ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పనిచేసే జిల్లా స్థాయి ఉద్యోగులంతా తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ కావచ్చు. సీనియారిటీ, ఆప్షన్స్‌ ఆధారంగానే కేటాయింపుల ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా స్థాయి కేడర్‌ కిందకు అటెండర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులు రానున్నారు. జోనల్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌, డీటీలు వస్తారు. తహసీల్దారు, ఆర్డీవో స్థాయి అధికారులను మల్టీ జోన్లోకి చేర్చుతూ ప్రభుత్వం ఇదివరకే మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త జోనల్‌ వ్యవస్థపై 2018 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఈ ఏడాది ఆగస్టు 4న కేడర్లు నిర్ణయించారు. దీన్ని అనుసరించి జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ కేడర్ల సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాల్సి ఉంది. ముందుగా జిల్లా స్థాయి ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది అయ్యాక ఉద్యోగులు ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలి. ఈ ఆ తర్వాత జిల్లాల వారీగా ప్రభుత్వం నిర్ణయించిన కేడర్‌ స్ట్రెంత్‌ను అనుస రించి బదిలీలు చేపట్టను న్నారు.


జోనల్‌ ఉద్యోగుల్లో అయోమయం

హనుమకొండ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జోనల్‌ పరిధిలోని ఉద్యోగుల ఆప్షన్స్‌  విషయంలో అయోమయం నెలకొంది. బుధవారం జిల్లా కేడర్‌ పోస్టులకు సంబంధించి విభజన ప్రక్రియ మొదలు కాగా, జోనల్‌ కేడర్‌కు సంబంధించి అస్పష్టత నెలకొంది. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను జోనల్‌ పరిధిలోకి తీసుకురావడంతో కొన్ని శాఖల్లో అధికారులు ఆప్షన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గైడ్‌లైన్స్‌ విషయంలో స్పష్టత లేకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్లు అయోమయం చెందుతున్నారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో  కాళేశ్వరం జోన్‌ పరిధిలోకి జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు,  రాజన్న జోన్‌  పరిధిలోకి సిద్ధిపేట (పూర్వపు వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు) భద్రాద్రి జోన్‌ పరిధిలోకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలు, యాదాద్రి జోన్‌ పరిధిలోకి జనగామ జిల్లా వచ్చాయి. అయితే ఉద్యోగులు తమ ఆప్షన్స్‌ను జోన్‌ల వారీగా ఇవ్వాలా... జిల్లాల వారీగా ఇవ్వాలా.. అనే విషయమై గందరగోళానికి గురవుతున్నారు. భద్రాద్రి జోన్‌ పరిఽధిలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు, కాళేశ్వరం జోన్‌ పరిధిలో అసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. అలాగే యాదాద్రి, రాజన్న జోన్‌ల పరిధిలో కూడా పొరుగు జిల్లాలు ఉన్నాయి. అయితే ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ఆయా జోన్‌లలోని అన్ని జిల్లాల ఉద్యోగులను కలుపుకొని రూపొందిస్తారా..? పాత జోన్‌ల ప్రకారం  రూపొందిస్తారా.. అనే విషయంలోనూ గందరగోళం నెలకొంది. కొత్తజోన్‌ల పేరుతో తమను ఇతర జిల్లాల వారితో కలిపి సీనియారిటీ జాబితా తయారుచేస్తే నష్టం జరుగుతుందని ఉద్యోగులు అంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పోస్టులు అదే జిల్లా వారికి దక్కేలా చూడాలని వారు కోరుతున్నారు.  ఇదిలావుండగా, జోనల్‌ పోస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15వరకు జిల్లా కేడర్‌ పోస్టుల విభజన పూర్తవుతుందని, ఆ తర్వాతే జోనల్‌ పోస్టుల ప్రక్రియ మొదలువుతుందని వారు చెబుతున్నారు. మరోవైపు ఆయా  జిల్లాల్లో జోనల్‌ పోస్టుల కేడర్‌ స్ర్టెంత్‌ను ప్రకటించిన తర్వాతే ఆప్షన్స్‌ తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-09T05:52:55+05:30 IST