ఉగ్ర గోదావరి..వరద కృష్ణ

ABN , First Publish Date - 2021-07-25T07:11:08+05:30 IST

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద శనివారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి నీటిమట్టం 48.10 అడుగులకు చేరింది

ఉగ్ర గోదావరి..వరద కృష్ణ

భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక

ఉభయ గోదావరి ఏజెన్సీ గ్రామాలు మునక 

భయం గుప్పిట కోనసీమ

తుంగభద్రకు మొదటి ప్రమాద హెచ్చరిక


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద శనివారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి నీటిమట్టం 48.10 అడుగులకు చేరింది. పోలవరం కాఫర్‌డ్యామ్‌ వద్ద శనివారం సాయంత్రం 31.9 మీటర్లు (104.6 అడుగులు) నీటిమట్టం నమోదైంది. అర్ధరాత్రికే 33 మీటర్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని స్పిల్‌వే  మీదుగా దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,61,337 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీరంతా కోనసీమ లంకలను ముంచుతూ సముద్రంలోకి పోతోంది. అర్ధరాత్రికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్టు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. పోలవరం కాఫర్‌డ్యామ్‌ లేకపోతే ఈపాటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఏర్పడేది.  కాఫర్‌డ్యామ్‌ వల్ల భద్రాచలం నుంచి వచ్చే నీరు ధవళేశ్వరం బ్యారేజీకి వెళ్లడానికి ఆలస్యమవుతోంది.  పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద 31.9 మీటర్ల నీటిమట్టం నమోదు కావడంతో ఏజెన్సీ గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. తూర్పుగోదావరిలో దేవీపట్నం మండలంలోని గ్రామాలన్నీ ఇప్పటికే మునిగిపోయాయి. అక్కడి ప్రజలందరినీ ముందే తరలించారు.


ఈ మండలంలోని చాలా గ్రామాలకు ఇంకా పునరావాస కాలనీలు నిర్మించకపోవడంతో రంపచోడవరం, గోకవరం, రాజమహేంద్రవరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. విలీన మండలాల్లోని వీఆర్‌పురం, కూనవరం గ్రామాల పరిస్థితీ అలాగే ఉంది. గిరిజనులు   మెరక ప్రాంతాలకు వెళ్లి, కర్రలతో గుడిసెలు వేసుకుంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి వదిలేస్తున్నారు. నీరు కోనసీమ గుండా సముద్రంలోకి పోతుండటంతో కోనసీమలోని లంకలన్నీ మునిగిపోతున్నాయి.


19 గ్రామాలకు రాకపోకలు బంద్‌..

ఇక పశ్చిమగోదావరిలో పోలవరం ఎగువన ఉన్న 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోండ్రుకోట, కొత్తూరు, వాడపల్లి గ్రామాల్లోకి వరద నీరు  చేరడంతో స్థానికులు సమీప కొండగట్లపై తల దాచుకుంటున్నారు. కోండ్రుకోట గ్రామంలో అధికారులు నాలుగు జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇక కుక్కునూరు, దాచారం మార్గంలో గుండేటి వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బెస్తగూడెం నుంచి 50 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. లచ్చిగూడెంలో నీరు చేరడంతో స్థానికులంతా సమీపాన ఉన్న గుట్టలపైకి చేరారు. వేలేరుపాడు మండలంలో స్థానికులను శివకాశీపురంలోని ఆశ్రం పాఠశాలకు తరలిస్తున్నారు. 


శ్రీశైలంలోకి భారీగా వరద

కృష్ణానదిలోనూ ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాల వల్ల ఆల్మట్టి నుంచి 3.5 లక్షలు, నారాయణపూర్‌ నుంచి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 1048 అడుగులకు గాను ప్రస్తుతం 1039 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 3.33 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 3,78,676 క్యూసెక్కులను శ్రీశైలంకు వదిలేస్తున్నారు. అలాగే, విద్యుదుత్పత్తి ద్వారా 18,360 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 856.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 96.5 టీఎంసీల నిల్వ ఉంది.  శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 24,082 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సాగర్‌ నుంచి దిగువకు 4,840 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం 537 అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి పులిచింతలకు 26,550 క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల నుంచి 41,115 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. 


తుంగభద్ర డ్యామ్‌ వద్ద శనివారం తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుంగభద్రలో గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులకుగాను, ప్రస్తుతం 1625.14 అడుగుల వరకు నీరు చేరింది. 1.2లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రకాశం బ్యారేజీకి  ఎగువ నుంచి  1,14,569 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల నుంచి 35,315, పాలేరు నుంచి 10,590, కీసర నుంచి 68,664 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజ్‌ పది గేట్లను ఒక అడుగు ఎత్తుకు, 60 గేట్లను రెండు అడుగులు ఎత్తి 93,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 1561 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు.

Updated Date - 2021-07-25T07:11:08+05:30 IST