డీపీఆర్‌లు వెంటనే ఇవ్వండి
ABN , First Publish Date - 2021-01-17T08:55:42+05:30 IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే సమర్పించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర
కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు తెలపండి..
తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ
జల వివాదాల పరిష్కారం కోసం తప్పనిసరి..
జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే సమర్పించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కోరారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెల 11న తనతో భేటీ అయ్యారని, గత నెల 16న ఏపీ సీఎం జగన్ తనను కలిశారని, ఆయా సందర్భాల్లో రెండు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదీ జలాల ఆధారంగా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించామని తెలిపారు. అయితే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక నివేదిక (డీపీఆర్)ల విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని షెకావత్ తన లేఖల్లో గుర్తు చేశారు. డీపీఆర్‌లతోపాటు ఇతర సాంకేతిక సమస్యల వివరాలు కూడా సమర్పిస్తే అంతర్ రాష్ట్ర జల వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించుకోవడం అనివార్యమని తెలిపారు.
ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని వీటికి డీపీఆర్‌లను త్వరితగతిన పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 19 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఇవ్వాలని, వీటిలో కృష్ణానదిపై 15, గోదావరి నదిపై నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించారు. పురుషోత్తమపట్నం మినహా ఇతర ఏ ప్రాజెక్టులకూ డీపీఆర్‌లు సమర్పించలేదని షెకావత్ గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై నిబంధనలకు లోబడి డీపీఆర్‌లు సమర్పించాలని పేర్కొన్నారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్ సమర్పించాలన్నారు. ఇక తెలంగాణలో మొత్తం 15 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉందని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో తెలిపారు. వీటిలో కృష్ణానదిపై 8, గోదావరి నదిపై 7 ప్రాజెక్టులు ఉన్నాయిన, ఈ ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ అండర్ మిషన్ భగీరథ
తుమ్మిళ్ల ఇరిగేషన్ స్కీం
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్
తెలంగాణలోని గోదావరి బేసిన్ ప్రాజెక్టులు
గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్-3
సీతారామ ఎత్తిపోతల పథకం
పీవీఎన్ రావు కంతానపల్లి సుజల స్రవంతి తుపాలకులగూడెం
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టుపై మూడు బ్యారేజీలు
వరంగల్ జిల్లాలోని ఇంటర్-బేసిన్ వాటర్ ట్రాన్స్‌ఫర్ ఫ్రం రామప్ప లేక్(గోదావరి బేసిన్) టు పాకాల లేక్(క ృష్ణా బేసిన్)
కాళేశ్వరం ప్రాజెక్టు(మూడో టీఎంసీ)