Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనిషిని అపవిత్రం చేసేది...

ఒక సందర్భంలో, ఏసు ప్రభువు తన శిష్యులతో కలిసి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి ముందు... పూర్వులు ఆదేశించిన విధంగా వారు చేతులు కడుక్కోలేదని పరిసయ్యులు కొందరు ఆక్షేపించారు. ఏసు ఆ మాటలు విని... ‘‘నోట్లోకి వెళ్లేది మనిషిని అపవిత్రం చేయదు. నోటి నుండి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది’’ అని బదులిచ్చాడు. ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ... అవి పాటించనివారిని దైవ ద్రోహులుగా పరిగణించే వారిని ఆయన ఎండగట్టాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏది ఆలోచిస్తున్నాం, మన ఆలోచనల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి... దైవం పరిగణనలోకి తీసుకొనే విషయాలు ఇవే. ఆత్మశుద్ధికి దోహదపడే విషయాల గురించి ఆలోచించకుండా, తెలిసినా పాటించకుండా ఎన్ని ఆచారాలను అనుసరించినా వ్యర్థం. లోకుల ఎదుట ఎంత నటించినప్పటికీ... మనం ఏ దారిన జీవితాన్ని సాగిస్తున్నామో, మన అంతర్గతమైన ఆలోచనలు ఏమిటో మన మాటలు బయటపెడతాయి. అందుకే... చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తిన్నంత మాత్రాన మనిషి అపవిత్రం కాడనీ, కానీ నోటి నుంచి వచ్చే మాటలు మనిషి ఎలాంటివాడనేది చెబుతాయనీ, చెడ్డ మాటలు, చెడు భావాలూ మనిషిని అపవిత్రం చేస్తాయనీ ఏసు స్పష్టం చేశాడు. దేవుని మార్గంలో సాగే జీవనం, కల్మషం లేని ఆలోచనలు... ఇవే మనిషిని పవిత్రుడిగా నిలుపుతాయి. మానవలోకంలో న్యాయం తరచుగా మన చర్యల ఆధారంగా నిర్ణయం అవుతూ ఉంటుంది. దేవుడు తీర్పు చెప్పే విధానం వేరేగా ఉంటుంది. మన చర్యలు ఎటువంటివనేది నిర్ధారించడానికి ముందు, వాటి వెనుక ఉండే ఉద్దేశం ఏమిటనేది ఆయన పరిశీలిస్తాడు. మానవుల హృదయాల్లో పాపచింతన, ద్రోహ బుద్ధి లేనట్టయితే... వారి పనుల్లో తప్పులు ఉన్నప్పటికీ ఆయన కరుణ చూపిస్తాడు. క్షమాపణ ప్రసాదిస్తాడు.

Advertisement
Advertisement