నా జేబులో ఎప్పుడూ ఆ వివరాలు ఉంటాయి: బైడెన్

ABN , First Publish Date - 2021-03-12T17:22:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు యూఎస్‌లోనే నమోదయ్యాయి.

నా జేబులో ఎప్పుడూ ఆ వివరాలు ఉంటాయి: బైడెన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు యూఎస్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటికీ అక్కడ కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇక ఈ మార్చి నెలతో దేశంలో కొవిడ్-19 ప్రభావం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్ నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు బైడెన్ మొదట నివాళలర్పించారు. దేశం సమిష్టి త్యాగానికి సాక్ష్యంగా నిలిచిందని చెప్పిన బైడెన్.. వైరస్‌ను ఓడించడం ద్వారా అగ్రరాజ్యం కష్టతరమైన, చీకటిమయమైన రోజులను కూడా అధిగమించిందన్నారు. ఇప్పటి వరకు మహమ్మారి దేశవ్యాప్తంగా 2.9కోట్ల మందికి సోకగా.. ఐదు లక్షలకు పైగా మందిని పొట్టబెట్టుకుందని తెలిపారు.


'ఏడాది క్రితం చలిచప్పుడు లేకుండా ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. దాని ప్రభావాన్ని గుర్తించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోజులు, వారాలు, నెలల వరకు తిష్టవేయడంతో భారీగా ప్రాణాలు బలిగొంది. చాలా మందిని తీవ్ర ఒత్తిడి, ఒంటరితనంలోకి నెట్టేసింది. ప్రతిఒక్కరు ఏదో ఒకటి కోల్పోయారు. దీంతో దేశం ఇవాళ సమిష్టి త్యాగానికి సాక్ష్యంగా మారింది.' అని అన్నారు. "చీకటిలో కూడా వెలుగును కనిపెట్టడం ప్రతి అమెరికన్ చేసే పని, వాస్తవానికి మేము కూడా అదే చేసాం." అని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కరోనాను కట్టడిచేయడంలో పాటించిన నిబంధనలను ఉద్దేశించి అధ్యక్షుడు అన్నారు. 


ఇక తన జేబులో ఎల్లప్పుడు  వైరస్‌తో మరణించిన అమెరికన్ల సంఖ్యతో కూడిన కార్డు ఒకటి ఉంటుందన్నారు. 'నాకు తెలుసు ఇది ఎంతో బాధాకరం. కానీ, తప్పదు. ఎంత మంది కరోనాకు బలవుతున్నారో ఎప్పటికప్పడు ఈ కార్డులో చేరుస్తున్నాను. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇవాళ్టి తేదీ వరకు 5,27,726 మంది అమెరికన్లను మహమ్మారి కబళించింది. ఇది వరల్డ్ వార్-1, వరల్డ్ వార్-2, వియత్నాం వార్, 9/11 దాడిలో చనిపోయిన వారి కంటే కూడా అధికం.' అని బైడెన్ తెలిపారు. మే 1 కల్లా అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్రాలను కోరారు. ఇది జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవ హాలీడే నాటికి దేశంలో సాధారణ స్థితిని సృష్టించేలా మహమ్మారిని అంతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. 


అంతకుముందు బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుపై సంతకం చేశారు. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆర్థికంగా ఆదుకునేందుకు అధ్యక్షుడు సత్వరమే ఈ బిల్లును అమలు చేయబోతున్నారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్ కూడా పాల్గొన్నారు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా గడవకముందే బైడెన్ ఈ భారీ ఉపశమన బిల్లును ఉభయ సభల్లో గెలిపించుకోవడం ఆయనకు దక్కిన భారీ విజయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2021-03-12T17:22:12+05:30 IST