విమానంలో మహిళతో వ్యక్తి అసభ్య ప్రవర్తన.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ABN , First Publish Date - 2021-05-22T16:44:12+05:30 IST
విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అమెరికాలోని మిన్నియాపోలీస్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి మొదట ముఖానికి మాస్కు ధరించేందుకు నిరాకరించాడు.
మిన్నియాపోలీస్: విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అమెరికాలోని మిన్నియాపోలీస్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి మొదట ముఖానికి మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. మాస్కు విషయమై విమాన సిబ్బంది అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పక్కన కూర్చున్న ప్రయాణికురాలిని కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ముక్కు వద్ద ఏదో తెల్లటి పదార్థం కూడా కనిపించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మిన్నియాపోలీస్‌లోని సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అనంతరం సదరు వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి పేరు మార్క్ ఆంథోనీ స్కెర్బో(40)గా తెలిసింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న జెట్‌బ్లూ విమానం 915లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం విషయం బయటకు వచ్చింది.