నవోమిదే యూఎస్‌ ఓపెన్

ABN , First Publish Date - 2020-09-14T09:40:43+05:30 IST

స్టార్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ నవోమి ఒసాక యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒసాక 1-6, 6-3, 6-3తో మాజీ నెంబర్‌వన్‌ విక్టోరియా

నవోమిదే యూఎస్‌ ఓపెన్

  • ఫైనల్లో అజరెంకాపై విజయం 
  • మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో  రికార్డు


జపాన్‌ టెన్నిస్‌ తార నవోమి ఒసాక సంచలనం సృష్టించింది. విక్టోరియా అజరెంకాతో జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని రెండోసారి యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా ఆవిర్భవించింది. కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌తో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణిగా నిలిచింది. 


న్యూయార్క్‌: స్టార్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ నవోమి ఒసాక యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒసాక 1-6, 6-3, 6-3తో మాజీ నెంబర్‌వన్‌ విక్టోరియా (బెలార్‌స)ను ఓడించింది. విజేతగా నిలిచిన ఒసాకకు రూ.22 కోట్ల ప్రైజ్‌మనీ, రన్నర్‌ప అజరెంకాకు రూ.11 కోట్లు దక్కాయి. ఒసాక కెరీర్‌లో ఇది రెండో యూఎస్‌ ఓపెన్‌ కాగా ఓవరాల్‌గా ఆమెకిది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 22ఏళ్ల ఒసాక గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన ప్రతిసారీ విజేతగా నిలవడం విశేషం. 2018లో ఇక్కడే తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న ఒసాక.. గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. 


తొలిసెట్‌లో పోటీ ఎదురైనా..

గంటా 53 నిమిషాలపాటు సాగిన ఫైనల్లో తొలి సెట్‌లో ఒసాక ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. 31 ఏళ్ల అజరెంకా కేవలం 26 నిమిషాల్లోనే 6-1తో ఈ సెట్‌ను ముగించింది. అటు ఒసాక 13 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెట్‌లోనూ అజరెంకా దూకుడు కొనసాగిస్తూ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నెమ్మదిగా పుంజుకున్న ఒసాక ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేస్తూ 4-3తో పట్టు సాధించింది. ఇక్కడి నుంచి పూర్తిగా ఒసాక హవా సాగింది. మరో బ్రేక్‌ పాయింట్‌తో రెండోసెట్‌ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లింది. చివరి సెట్‌ నాలుగో గేమ్‌లో అజరెంకా సర్వీ్‌సను నిలువరిస్తూ 3-1తో ఆధిక్యంలో కెళ్లింది. ఈ క్రమంలో తనకు లభించిన మూడు బ్రేక్‌ పాయింట్లను అజరెంకా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో 0-40 నుంచి కోలుకున్న ఒసాక 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఆరో గేమ్‌లో అజరెంకా సర్వీ్‌సను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఒసాక రెండో మ్యాచ్‌ పాయింట్‌ను అజరెంకా నెట్‌కు కొట్టడంతో పోరు ముగిసింది.


1

పురుషుల, మహిళల విభాగాల్లో మూడు గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచిన ఏకైక ఆసియా ప్లేయర్‌ ఒసాక. అలాగే 1994 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయి విజేతగా నిలిచిన  తొలి క్రీడాకారిణి ఒసాక. 


5

ఓపెన్‌ శకం ఆరంభమయ్యాక ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్స్‌ ఫైనల్స్‌లోనూ నెగ్గిన ఐదో క్రీడాకారిణి ఒసాక. గతంలో లిండ్సే డావెన్‌పోర్ట్‌, కాప్రియాటి, వర్జీనియా వేడ్‌, మోనికా సెలెస్‌ ఉన్నారు.

Updated Date - 2020-09-14T09:40:43+05:30 IST