కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై బైడెన్ కీలక ప్రకటన !

ABN , First Publish Date - 2020-12-04T17:46:12+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్విటర్ వేదికగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై గురువారం కీలక ప్రకటన చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై బైడెన్ కీలక ప్రకటన !

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్: బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్విటర్ వేదికగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై గురువారం కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు ఆమోదం లభించిన తర్వాత దేశ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. తాను, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ ప్రజలకు వ్యాక్సిన్‌ను సమానమైన, సమర్థవంతమైన పద్ధతిలో పంపిణీ జరిగేలా చూస్తామని బైడెన్ ట్వీట్ చేశారు. "వ్యాక్సిన్‌ ఆమోదం పొందిన తర్వాత కమలా హ్యారిస్, నేను ప్రతి అమెరికన్‌కు టీకాను పూర్తి ఉచితంగా సమానమైన, సమర్థవంతమైన పద్ధతిలో పంపిణీ జరిగేలా చూస్తాం." అని బైడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో గురువారం 2.10 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. దేశంలో కొవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం అని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1.41 కోట్లు దాటిపోయింది. అలాగే నిన్న ఒకేరోజు 2,907 మంది వైరస్‌కు బలైనట్టు తెలిపింది. దీంతో మొత్తం మరణాలు 2.75 లక్షలు దాటిపోయాయి. న్యూయార్క్‌తో పాటు ఇతర కొన్ని నగరాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, అమెరికా అభివృద్ధి చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వైరస్‌పై ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు తేలడంతో పాటు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడం ఆ దేశ ప్రజలకు ఊరటనిచ్చే విషయం. 



Updated Date - 2020-12-04T17:46:12+05:30 IST