భారత్​లో తయారైన వయాగ్రా డ్రగ్స్ యూఎస్‌లో సీజ్!​

ABN , First Publish Date - 2021-07-31T17:32:15+05:30 IST

అమెరికా కస్టమ్స్ అధికారులు శుక్రవారం సుమారు రూ. 5.30 కోట్లు విలువ చేసే 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ పిల్స్‌ను సీజ్ చేశారు.

భారత్​లో తయారైన వయాగ్రా డ్రగ్స్ యూఎస్‌లో సీజ్!​
ప్రతీకాత్మక చిత్రం..

వాషింగ్టన్: అమెరికా కస్టమ్స్ అధికారులు శుక్రవారం సుమారు రూ. 5.30 కోట్లు విలువ చేసే 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ పిల్స్‌ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను ప్రధానంగా వయాగ్రా ట్యాబ్లెట్ల తయారీలో వినియోగిస్తారు. కాగా, సీజ్ చేసిన పిల్స్ భారత్​లో తయారైనట్లు అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ 712,756 డాలర్లు(భారత కరెన్సీలో రూ. 5,30,14,292) ఉంటుందని అధికారులు తెలిపారు. సుమారు 20 కిలోల బరువైన మాత్రలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


భారత్​ నుంచి వచ్చిన ఈ పిల్స్‌ను జార్జియాలోని డెకాటర్​లో ఉన్న ఓ అపార్ట్​మెంట్​కు తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసి సిన్సిన్సాటీకి తరలించినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు తెలిపారు. కాగా, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్​ దిగుమతిపై అగ్రరాజ్యంలో ఆంక్షలు ఉంటాయి. ఎఫ్‌డీఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) నిబంధనలకు అనుగుణంగా వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజాగా పట్టుబడిన డ్రగ్స్ అక్రమ మార్గంలో అమెరికా వచ్చాయని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-31T17:32:15+05:30 IST