రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది

ABN , First Publish Date - 2020-07-08T09:30:46+05:30 IST

‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది

జీహెచ్‌ఎంసీ పాలనను మీ చేతుల్లోకి తీసుకోండి..

గవర్నర్‌ను కోరిన ఉత్తమ్‌

మూఢనమ్మకం పేరిట సచివాలయం కూల్చివేత

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక

హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పాలనను మీ చేతుల్లోకి తీసుకోండి. విభజన చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం.. తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేక అధికారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుకోవాలి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ అంశంపై గవర్నర్‌కు లేఖ కూడా రాస్తున్నట్లు తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంగళవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. కరోనా పరిస్థితులపై సమీక్ష కోసం గవర్నర్‌ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిస్తే.. ఆయన వెళ్లకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై సీఎ్‌సపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సీఎస్‌.. సీఎం కేసీఆర్‌కు తొత్తుగా పనిచేస్తారే తప్ప.. ఉద్యోగ వర్గానికి అధిపతిగా కాదని ధ్వజమెత్తారు.


సీఎం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఆరోపించారు. కరోనా కేసులు, మరణాల లెక్కలను సర్కారు తప్పుగా చూపిస్తోందని ఆరోపించారు. ‘‘కరోనా కట్టడికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అద్భుతంగా పనిచేస్తుంటే..  కేసీఆర్‌కు ఏమైంది?. అక్కడ 10 లక్షల కరోనా పరీక్షలు చేస్తే.. తెలంగాణలో లక్ష పరీక్షలే చేశారు’’ అని విమర్శించారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే ప్రైవేటు ఆస్పత్రులు పదింతలు వసూలు చేస్తున్నాయని, అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కరోనాతో చనిపోయిన పేద కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణ చరిత్రలో ఇది బ్లాక్‌డే

వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే ప్రస్తుత సచివాలయ భవనాలను మూఢనమ్మకం పేరిట కూల్చివేస్తున్నారని, రూ. వేల కోట్లతో కొత్త భవనాలను నిర్మించాలనుకోవడం దుర్మార్గమని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్రలో దీన్ని బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పిచ్చితుగ్లక్‌ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. 

కేసీఆర్‌కు వాస్తు పిచ్చి: జీవన్‌రెడ్డి

ప్రజలంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్‌ సచివాలయం కూల్చివేతపై దృష్టి పెట్టారని, వాస్తు పిచ్చితో ఆయన పాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో బుధవారం కాంగ్రెస్‌ తరఫున పిటిషన్‌ వేయాలని  నిర్ణయించామని, ఈ విషయం తెలిసి భవనాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.


లక్ష వెంటిలేటర్లు కావాలి: జగ్గారెడ్డి

కనీస చికిత్స అందకపోవడం వల్లే సంగారెడ్డి మునిసిపల్‌ కౌన్సిలర్‌ చనిపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేగా తాను కౌన్సిలర్‌ను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లిన రోగులకు చికిత్స అందించేందుకు 10 గంటల సమయం పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అర్ధరాత్రి కూల్చివేతలా?: శ్రీధర్‌బాబు

అర్ధరాత్రి సచివాలయాన్ని ఎందుకు కూల్చారో సీఎం కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఒక్క ఏడాదిలోనే సచివాలయం నిర్మాణం జరగాలని ఆదేశించిన ఆయన.. కరోనా విషయంలో ఇలా ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. సచివాలయాన్ని కూల్చడం పిచ్చి తుగ్లక్‌ చర్య అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు మతి భ్రమించిందని ఒక ప్రకటనలో విమర్శించారు.


Updated Date - 2020-07-08T09:30:46+05:30 IST