ఏం మాటలవి?

ABN , First Publish Date - 2021-01-09T06:04:56+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో గత ఆదివారం నాడు ఒక దేవాలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య దేశప్రజలను తీవ్రంగా కలవరపరచింది. సామూహిక అత్యాచారాలు, హత్యలు దేశంలో తరచు జరుగుతూనే ఉన్నాయి...

ఏం మాటలవి?

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో గత ఆదివారం నాడు ఒక దేవాలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య దేశప్రజలను తీవ్రంగా కలవరపరచింది. సామూహిక అత్యాచారాలు, హత్యలు దేశంలో తరచు జరుగుతూనే ఉన్నాయి, ప్రతి చోటా ఏదో ఒక బాధితురాలిని మరో నిర్భయ అని సంబోధించవలసే వస్తున్నది. అయినప్పటికీ, ఉత్తరప్రదేశ్ సంఘటన దిగ్ర్భాంతికరం ఎందుకంటే, అది ఒక దేవాలయ ప్రాంగణంలో జరిగింది కనుక, నిందితులలో పూజారి కూడా ఉన్నాడు కనుక. ఇటీవలి కాలంలో అణగారినవారిపైన, ఆడవారిపైనా అత్యాచారాలు, హత్యలు జరగడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందుంటున్నది కనుక. 


గ్రామంలో అంగన్ వాడి ఉద్యోగిగా పనిచేస్తున్న యాభై సంవత్సరాల మహిళను దేవాలయ ప్రాంగణానికి ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత రప్పించి, పూజారి, మరో ఇద్దరు అత్యాచారం జరిపారని, గాయపడి, స్పృహతప్పి ఉన్న ఆమెను కారులో ఇంటికి చేర్చి హడావుడిగా నిష్క్రమించారని బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించారు. ఈ సంఘటన విషయంలోనూ కేసు నమోదు చేయడంలో పోలీసులు బాగా ఆలస్యం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె జననాంగం వద్ద తీవ్రంగా గాయాలయ్యాయని, శరీరం మీద ఒత్తిడికి ఆమె ఛాతీ ఎముకలు విరిగిపోయాయని పోస్ట్ మార్టమ్ నివేదిక చెబుతోంది. వెనువెంటనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న పూజారిని కూడా ఎట్టకేలకు గురువారం రాత్రి పట్టుకున్నారు. జాతీయ భద్రతా చట్టం వంటి కఠిన చట్టాల కింద నిందితులను నిర్బంధిస్తామని, శీఘ్రగతిన విచారించే న్యాయస్థానం ద్వారా విచారణ జరిపి త్వరగా శిక్షిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ, అది ఎంత వరకు జరుగుతుందో అనుమానమే. 


దైవస్థలంలో అత్యాచారం అంటే జమ్మూలో జరిగిన ఆసిఫా ఉదంతం గుర్తుకు వస్తుంది. ఆ పసిపిల్లకు న్యాయం అందించడానికి ఎన్ని శక్తులు అడ్డుపడ్డాయో తెలిసిందే. ఇక యుపిలోనే హథ్రాస్ సంఘటన ఇంకా దేశప్రజల జ్ఞాపకం నుంచి మరుగు కాలేదు. అక్కడ కేసు ఇంకా విచారణ దశకు చేరుకోలేదు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి, మీడియా ద్వారా ప్రపంచానికి వివరాలు వెల్లడిద్దామని ప్రయత్నించినవారిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్బంధించి, ‘ఊపా’ వంటి కఠినచట్టాలను నమోదు చేసింది. దళితులపై అగ్రకుల దాష్టీకాన్ని తమ ప్రభుత్వం సహించబోదన్న సందేశం ఇవ్వడానికి యోగి ప్రభుత్వం ఏమంత ఉత్సాహపడడం లేదు, కానీ, తమ రాష్ట్రంలో జరిగే నేరాలపై ఇతర రాష్ట్రాల ప్రజాకార్యకర్తలు ఆసక్తి చూపితే తాము ఊరుకోబోమన్న హెచ్చరికను మాత్రం జారీచేసింది. 


బాధితులనే తప్పు పట్టడం, న్యాయం కోసం ప్రయత్నించేవారిపై కేసులు పెట్టడం, సహాయం చేసేవారినే వేధించడం- దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ, ఉత్తరప్రదేశ్ అందులో ఆరితేరింది. కఫీల్ ఖాన్ ఉదంతం అందుకు ఉదాహరణ. పైగా, అక్కడి ముఖ్యమంత్రితో సహా, రాజకీయ నేతలు, పార్టీ నాయకులు సాహసోపేతమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. సాధారణంగా సభ్యసమాజంలో అటువంటి భావాలను వ్యక్తం చేయడానికి సంకోచిస్తుంటారు, అక్కడ అదేమీ కనిపించదు. భారతీయ జనతాపార్టీలోనూ, అందరూ కాదు కొందరు, తీవ్ర, సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడానికి పెట్టింది పేరు. పాలకుల అభిరుచిని బట్టే నియామకాలు ఉంటాయి కాబట్టి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలొకరు బదౌన్‌ సంఘటనపై చేసిన వ్యాఖ్య కూడా మనకు ఆశ్చర్యం కలిగించదు. సంఘటన జరిగిన వెంటనే కమిషన్ స్పందన బాగున్నది, కఠిన చర్యలు తీసుకోవాలన్నది, తమ సభ్యురాలిని ఒకరిని బాధితురాలిని కలవడానికి పంపుతామన్నది. కానీ, చైర్ పర్సన్ రేఖాశర్మ పనుపున యుపిని సందర్శించిన చంద్రముఖి దేవి మాత్రం కమిషన్ ప్రతిష్ఠను, ప్రభుత్వం పరువును ప్రమాదంలో పెట్టారు. బాధితురాలు అంత రాత్రివేళ ఒంటరిగా వెళ్లకుంటే బాగుండేది, ఇదంతా జరగకపోయేది- అని దేవి చేసిన వ్యాఖ్యపై తీవ్రమైన దుమారం చెలరేగుతున్నది.


సమాజంలో స్త్రీలకు ప్రమాదకరమైన పరిస్థితులున్నాయి కాబట్టి, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలకు హితవు ఇవ్వడం వేరు, అత్యాచారాలకు మహిళల సంచారమే కారణమని నిర్ధారించడం వేరు. స్వాతంత్ర్యానికి కొలమానం స్త్రీలు రాత్రివేళ సంచరించగలగడమేనని సాక్షాత్తూ గాంధీజీయే అన్నారు. మహిళలకు భద్రత, వారు ఇళ్లలో ఉండిపోవడంలోనో, ముసుగులు కప్పుకోవడంలోనో, కుంచించుకుపోయి జీవించడంలోనో లేదు. ప్రభుత్వాలు, స్త్రీల హక్కుల కోసం పనిచేసే వ్యవస్థలు చేయవలసింది, నేరస్థులు లేకుండా వీధులను ఇళ్లను శుభ్రీకరించడం. అంతేతప్ప, రహదారులను మృగాలకు వదిలిపెట్టి, మనుషులను బోనుల్లో పెట్టడంలో లేదు. ఇట్లా మాట్లాడుతుంటే, ఆ కమిషన్ చైర్ పర్సన్, తోటి సభ్యులు గట్టిగా మందలించవద్దా? 


అయినా, సంఘవ్యతిరేక శక్తులను కఠినంగా అణచివేస్తామని చెప్పి వేలాది అరెస్టులు, వందలాది ఎన్‌కౌంటర్లు చేసిన యోగి ప్రభుత్వం, స్త్రీల విషయంలో నేరాలు చేసేవారిపై ఎందుకు దృఢంగా వ్యవహరించలేకపోతున్నది? మతాంతర వివాహాలను, మతమార్పిడులను నిరోధించాలని పట్టుదల ఉన్న నాయకుడికి, దళితులపై రాజపుత్రుల దాష్టీకం, స్త్రీలపై అసాంఘిక పురుషాహంకారుల అత్యాచారాలు ఎందుకు తీవ్రంగా స్పందించవలసిన నేరాలుగా కనిపించడం లేదు? దేశమంతా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దారుణమైన రీతిలో కూడా జరుగుతున్నాయి. కానీ, అక్కడి వ్యవస్థలు ఏదో రీతిలో స్పందిస్తున్నాయి. చర్యలు తీసుకుంటున్నా నేరాలు జరుగుతుంటే, వాటి నివారణకు మరింత లోతైన చర్చ, అధ్యయనం అవసరం. కానీ, అసలు స్పందనే అంతంత మాత్రంగా ఉంటే, పైగా పురుషాధిక్య వ్యాఖ్యలు చేస్తుంటే, ఆ ప్రభుత్వాన్ని ఏమనాలి?


Updated Date - 2021-01-09T06:04:56+05:30 IST