తగ్గిపోయిన టీకా కేంద్రాలు

ABN , First Publish Date - 2021-08-04T09:05:31+05:30 IST

ఎక్కడికక్కడే వ్యాక్సిన్‌ కేంద్రాలు కుదించుకుపోతున్నాయి. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలలో టీకాలు వేసుకుందామంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

తగ్గిపోయిన టీకా కేంద్రాలు

హైదరాబాద్‌లోని మెజార్టీ యూపీహెచ్‌సీల్లో నో టీకా

కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, స్కూళ్లకే వ్యాక్సిన్‌ కేంద్రాలు పరిమితం

అక్కడక్కడా ఏరియా ఆస్పత్రుల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎక్కడికక్కడే వ్యాక్సిన్‌ కేంద్రాలు కుదించుకుపోతున్నాయి. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలలో టీకాలు వేసుకుందామంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా టీకా కేంద్రాలను మూసేశారు. హైదరాబాద్‌లోని సింహభాగం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ జరగడం లేదు. ఇప్పుడు కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని పలు కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, ప్రభుత్వ స్కూళ్లు, కొన్ని ఏ రియా ఆస్పత్రుల్లోని కేంద్రాల్లో మాత్రమే టీకాలిస్తున్నారు. మొదట్లో దాదా పు 90 యూపీహెచ్‌సీలు, పది ఆస్పత్రులలో వ్యాక్సిన్‌లు ఇచ్చారు. దీంతో ప్రజలు సులువుగా టీకాలు తీసుకోగలిగారు. అయితే గత నెల రోజులుగా యూపీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని తగ్గించేశారు. దీంతో జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 


అధికారులకే ఆలస్యంగా సమాచారం.. 

హైదరాబాద్‌ పరిధిలో గతంలో 100 దాకా వ్యాక్సిన్‌ కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 54 మాత్రమే. ఇవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలో వైద్యఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌ టీకా కేంద్రాలే. వీటితో పాటు కిం గ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి, నాంపల్లి, మలక్‌పేట ప్రాంతాల్లోని ఏరియా ఆస్పత్రులలోనూ వ్యాక్సిన్లు వేస్తున్నారు. గతంలో ఫీవర్‌ ఆస్పత్రిలో టీకాలు వేయగా, ఇప్పుడు అక్కడ నిలిపివేశారు. టీకా కేంద్రాలు సగానికి సగం తగ్గిపోవడంతో వాటికి జనం రద్దీ పెరిగిపోతోంది.  ఒక్కో కేంద్రంలో రోజూ 150 నుంచి 200 మందికే వ్యాక్సిన్లు వేస్తున్నారు. అది కూడా ముందుగా బుక్‌ చేసుకున్న వారికే. రిజిస్టర్‌ చేసుకోకుండా నేరుగా వచ్చే వారికి, జనం తాకిడి తక్కువగా ఉన్న సందర్భాల్లో టీకాలిస్తున్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాలకు సంబంధించిన సమాచారం సాక్షాత్తూ వైద్య అధికారులకే ఆలస్యంగా అర్ధరాత్రికో, ఉదయానికో అందుతోంది. దీంతో ఆ వివరాలను ముందస్తుగా మీడియా ద్వారా ప్రకటించే అవకాశం కూడా ఉండటం లేదు. ఈనేపథ్యంలో ప్రతిరోజు ప్రజలు ఆయా కేంద్రాలు, యూపీహెచ్‌సీలకు వెళ్లి టీకా వేస్తున్నారా ? లేదా ? అని వాకబు చేయాల్సి వస్తోంది. ఇక కొవాగ్జిన్‌ టీకా దొరకడం గగనమైంది. దీని మొదటి డోసు అందించడాన్ని పూర్తిగా బంద్‌ చేశారు. కేవలం రెండో డోసు కొవాగ్జిన్‌ మాత్రమే వేస్తున్నారు. వారంలో అయిదు రోజులే వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. 

Updated Date - 2021-08-04T09:05:31+05:30 IST