18 ఏళ్లు నిండిన ఇంటర్‌ విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-12-07T17:17:25+05:30 IST

ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం..

18 ఏళ్లు నిండిన ఇంటర్‌ విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌

55 వేల మందిని గుర్తించిన అధికారులు

కాలేజీల్లో ప్రత్యేక  టీకా శిబిరాలు


హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేకంగా చర్యలు తీసుకోనుంది. విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి కాలేజీల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ చదువుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండినవారు సుమారు 55,250 మంది ఉన్నట్టు తేల్చారు. జిల్లాల వారీగా ఈ సమాచారాన్ని సేకరించారు. 


వీరందరికీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్లను ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఇంటర్‌ బోర్డు అధికారులు సంప్రదింపులను పూర్తి చేశారు. అలాగే ఇంటర్మీడియట్‌ బోర్డులో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న వారిని కూడా గుర్తించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో సుమారు 38 వేల మంది వరకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉంటారని అంచనా. అయితే వీరిలో సుమారు 20 వేల మంది ఇప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నట్టు గుర్తించారు. వీరిని మినహాయించి ఇప్పటివరకు అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారికి, ఒక్క డోసు మాత్రమే వేయించుకున్నవారికి వ్యాకిన్లు ఇవ్వనున్నారు.

Updated Date - 2021-12-07T17:17:25+05:30 IST