అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి
ABN , First Publish Date - 2021-07-28T16:25:41+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి దక్కింది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి దక్కింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఏఐడీ) మిషన్ డైరెక్టర్‌గా వీనా రెడ్డి తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని యూఎస్ఏఐడీ తన ట్విటర్ పేజీ ద్వారా అధికారికంగా వెల్లడించింది. దీంతో యూఎస్ఏఐడీ మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్‌గా వీనా రెడ్డి రికార్డుకెక్కారు. ఈ సందర్భంగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందూ, భారత్‌లో అమెరికా రాయబారి అతుల్ కేషప్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రైవేట్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన ఏడేళ్లలోనే వీనా యూఎస్ఏఐడీలో చేరడం విశేషం.
ఇన్నాళ్లు ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. రిజినల్ సీనియర్ అడ్వైజర్‌గా మూడేళ్లు, పాకిస్థాన్‌కు సీనియర్ లీగ్ అడ్వైజర్‌గా ఒక ఏడాది పనిచేశారు. 2012లో అసిస్టెంట్ జనరల్ కాన్సుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను హైతీకి డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వీనా రెడ్డి చికాగో యూనివర్శిటీలో పబ్లిక్ పాలసీ అండ్ సోషల్ సైన్స్ చదివారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ పొందారు. ఆమెకు న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో సభ్యత్వం ఉంది.