వెలిగొండను తక్షణమే గెజిట్‌లో చేర్చాలి

ABN , First Publish Date - 2021-09-01T08:14:30+05:30 IST

రాష్ట్ర విభజన చట్టానికి కట్టుబడి.. ప్రకాశం జిల్లా జీవనాడి వెలిగొండ

వెలిగొండను తక్షణమే గెజిట్‌లో చేర్చాలి

  • దానికి అన్ని అనుమతులూ ఉన్నాయి
  • 3 జిల్లాలు ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డాయి
  • ఉపరాష్ట్రపతి, జలశక్తి మంత్రికి  టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వినతి
  • షెకావత్‌తో ఫోన్లో మాట్లాడిన వెంకయ్య
  •  ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలని సూచన!
  • సానుకూలంగా స్పందించిన మంత్రి


న్యూఢిల్లీ/ఒంగోలు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టానికి కట్టుబడి.. ప్రకాశం జిల్లా జీవనాడి వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వారంతా మంగళవారమిక్కడ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై.. వినతి పత్రం సమర్పించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ భేటీ అయ్యారు. వెలిగొండ సమస్యను ఆయనకు వివరించగా.. ఆయన వెంటనే షెకావత్‌తో ఫోన్లో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో పొందుపరచాలని కోరారు. అందుకు జలశక్తి మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు.. షెకావత్‌ను కలిసినప్పుడు.. ఈ ప్రాజెక్టుపై ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఆధారపడి ఉన్నారని.. వారికి సాగు, తాగునీటి  ప్రయోజనాలు కలుగుతాయని టీడీపీ నేతలు వివరించారు


. గెజిట్‌లోని 24వ పేజీలో అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొన్నారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం సాకుగా తీసుకుని.. అడ్డంకులు సృష్టిస్తోందని తెలిపారు.  మంత్రిని, ఉపరాష్ట్రపతిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి), ఏలూరి సాంబశివరావు (పరుచూరు) తదితరులు ఉన్నారు. 


సీఎం మొద్దునిద్ర వీడాలి: టీడీపీ నేతలు

వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్పించే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మొద్దునిద్ర వీడాలని.. ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చొరవ చూపించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. వారు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ఆటంకం కలిగితే ప్రకాశం జిల్లా కరవు కాటకాలతో అలమటిస్తుందని.. తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని వీరాంజనేయస్వామి అన్నారు. ప్రాజెక్టు లేక తమ ప్రాంతం నిర్వీర్యమైపోతే.. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు ఎక్కువ వాటా నీటిని వాడుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.


ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాన్ని, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టాలన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రావలసిన రూ.1,200 కోట్ల బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.60 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి లభిస్తుందని, 15 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కలుగుతుందని సాంబశివరావు చెప్పారు.  వెలిగొండ విషయంలో ముఖ్యమంత్రి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని బొల్లినేని రామారావు ధ్వజమెత్తారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రయోజనాలను పరగణనలోకి తీసుకుని వెలిగొండను గెజిట్‌లో చేర్చడానికి ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-09-01T08:14:30+05:30 IST