సకలం సమ్మెలోకి!

ABN , First Publish Date - 2022-01-24T07:58:03+05:30 IST

‘ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. దీనికి అంగీకరించేది లేదు’ అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది.

సకలం సమ్మెలోకి!

6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె

రాష్ట్రంలోని సకల ఉద్యోగులూ పాల్గొంటారు

నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌కు నోటీసు

ఈ వేతనాలతో ప్రతి ఉద్యోగికీ నష్టమే

గతంలో ఎన్నడూ లేనట్లుగా మాపై దుష్ప్రచారం

ప్రభుత్వమే ఈ పని చేయడం బాధాకరం

సుదీర్ఘంగా సాగిన స్టీరింగ్‌ కమిటీ భేటీ

పర్యవేక్షణకు మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

చర్చలకు రావాలని మంత్రుల నుంచి పిలుపు

 తిరస్కరించిన ఉద్యోగ సంఘాల నేతలు

జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు రామని స్పష్టీకరణ

మంత్రుల కమిటీ సాధికారతపైనా చర్చ

ప్రభుత్వాన్ని నమ్మినందుకు అన్యాయం: బొప్పరాజు

మంత్రుల కమిటీపై స్పష్టత లేదు: సూర్యనారాయణ

ఇంత పెద్ద ఉద్యమాన్ని చరిత్రలో చూడలేదు: బండి

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: వెంకట్రామిరెడ్డి


పీఆర్సీతోపాటు ఇతర అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనలు మొదలయ్యాయి. తొలిరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. పీఆర్సీ పోరు జోరుగా సాగించాలని... తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఈ భేటీల్లో తీర్మానించారు. ఇక... నాలుగు జేఏసీలతోపాటు ఇతర ముఖ్యమైన ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన స్టీరింగ్‌ కమిటీ భేటీ విజయవాడలో జరిగింది. 


అమరావతి/విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. దీనికి అంగీకరించేది లేదు’ అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ, ఎన్‌ఎంఆర్‌, ప్రజా రవాణాతోపాటు ఇతర అన్ని విభాగాలు, శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది. ఉద్యమంలో పెన్షనర్లూ భాగమయ్యారని ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు  ఇస్తామని స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ భేటీ సుదీర్ఘంగా జరిగింది. ఇందులో ప్రధాన జేఏసీ నేతలతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాల సంఘాల నేతలు పాల్గొన్నారు. సంప్రదింపులకు రావాలని మంత్రుల కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని  కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించింది.


పీఆర్సీ జీవోలను మొత్తం వెనక్కు తీసుకొని.. పాత వేతనాలు ఇస్తామంటేనే  మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండేలా సమ్మె నోటీసు రూపొందించేందుకు చర్యలు తీసుకున్నారు. స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, హృదయరాజు, శివారెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు, టి.ఫణిపేర్రాజు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రసాద్‌, అరవపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తం 12 మంది సభ్యులకు గాను 11 మంది హాజరయ్యారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాగా, పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను పక్కాగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. 


మంత్రుల ఆహ్వానం తిరస్కరణ..

పీఆర్సీ జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న సమయంలో పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరగటానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజుకు మంత్రి  పేర్ని నాని, సూర్యనారాయణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని కోరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి బుగ్గన , సీఎస్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మిగిలిన ముగ్గురు ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు.


అయితే, ‘ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా మా నిర్ణయం మేం తీసుకున్నాం. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వచ్చేది లేదు’ అని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పినట్లు సమాచారం. అనంతరం విజయవాడలోని రెవెన్యూభవన్‌లో స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. సమావేశం మధ్యలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి జేఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఫోన్‌చేసి ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీతో చర్చలకు రావాలని, సోమవారం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పినట్లు తెలిసింది. అయితే, ప్రభుత్వం అధికారికంగా కమిటీ వేయకుండా ఆ కమిటీతో చర్చలేమిటని ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకున్నారు. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, లేక అభెయన్స్‌లో అన్నా పెట్టాలని, ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని, జీవోలు రద్దు చేసే వరకు ఎలాంటి చర్చలకూ వచ్చేది లేదని శశిభూషణ్‌కుమార్‌కు స్పష్టం చేశారు. శశిభూషణ్‌ కుమార్‌ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఊరకనే చర్చలకు రాబోమని, చర్చలకు పిలవాలన్నా చట్టబద్ధమైన కమిటీ ఏర్పడితే తప్ప ఆలోచన చేయలేమని చెప్పారు. కమిటీ పరిధి, దాని సమగ్రత తెలియకుండా సాధ్యం కాదని తేల్చి చెప్పారు.


తర్వాత శశిభూషణ్‌ కుమార్‌ ఫోన్‌ సంభాషణలు, మంత్రుల కమిటీపైనా సుదీర్ఘంగా స్టీరింగ్‌ కమిటీ చర్చించింది. ప్రభుత్వం ప్రకటించిన మంత్రుల కమిటీకి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని.. ఆ కమిటీతో చర్చంచడం వల్ల ఉద్యోగులకు ఒనగూరే ప్రయోజనం ఏమిటనే చర్చ కూడా స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో జరిగింది. జీవోలు రద్దు చేసిన తర్వాతే ఎవ్వరితోనైనా చర్చలకు వెళ్లాలని కమిటీ తీర్మానించింది. ప్రభుత్వంతో ఘర్షణ పడాలన్న వైఖరి తమకు లేనప్పటికీ, ఘర్షణాత్మకమైన వైఖరిని తీసుకుని ప్రజలలో ఉద్యోగుల పట్ల చులకన భావన కలిగించే ప్రయత్నం చేసి, మరోవైపు చర్చలకు పిలవటంపై ఉద్యోగ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇలాంటి విధివిధానాలు, స్పష్టత లేని కమిటీల వల్ల ఉద్యోగులలో నాయకత్వాల మీద ద్వేష భావాలు రగిలే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాయి. మొదటిసారి ఇరు జేఏసీలు ఇచ్చిన ఆందోళనను చర్చల కోసం తాత్కాలికంగా వాయిదా వేసిన సందర్భంలో కింది స్థాయి ఉద్యోగులు సైతం తమను నిందించారని, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న పరుష వ్యాఖ్యలు చేస్తూ దుమ్మెత్తి పోశారని సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిల దృష్టికి బొప్పరాజు, బండి తీసుకువచ్చారు. నాలుగు జేఏసీల ఐక్య కూటమిని విచ్ఛినం చేసే కుయుక్తులు ఇప్పటికే చూసినందున.. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశ్యంతో .. నాలుగు జేఏసీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఎనిమిది సభ్యులతో మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు.


ప్రతి జిల్లా నాయకత్వం కూడా మానిటరింగ్‌ సెల్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుందని తీర్మానించారు. జిల్లా స్థాయిలో ఉద్యమ కార్యాచరణ అమలును మానిటరింగ్‌ సెల్‌ సభ్యులు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం, మంత్రుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా ప్రచారం, ఇతర పద్ధతుల్లో సాగుతున్న వ్యతిరేక ప్రచారాల గురించి తెలుసుకుని ఉద్యోగులకు వివరించటం, ఉద్యోగులు కూడా సంయమనంగా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే బాధ్యతలను మానిటరింగ్‌ సెల్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


ఆరున్నర గంటలు..సుదీర్ఘంగా..

పీఆర్సీ సాధన కమిటీ సమావేశం సుదీర్ఘంగా ఆరున్నర గంటలు జరిగింది. సీపీఎస్‌ రద్దు, సీఎం, ప్రభుత్వ హామీలు,  ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు ఇలా ప్రతి ఉద్యోగి సమస్యపైనా నేతలు చర్చించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, న్యాయబద్ధంగా అడుగుతున్నవి, ఉద్యమ కార్యాచరణ.. కలిగే అడ్డంగులు.. అధికమించాల్సిన విధానాలపైనా చర్చ జరిగింది. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లవద్దని ఉద్యోగ సంఘాల నేతలందరూ ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను స్టిరింగ్‌ కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది. కార్మిక సంఘాల నేతలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలనూ ఉద్యమంలోకి భాగస్వాములుగా ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. ఏ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించకూడదని తీర్మానించింది. నూతన పీఆర్సీ వల్ల ప్రతి ఉద్యోగికీ నష్టం జరిగిందనే అభిప్రాయం కమిటీలో వ్యక్తమైంది.


ఉద్యమాన్ని మరింత బలంగా నడపడానికి గతంలో 12 మందిగా నిర్ణయించుకున్న స్టీరింగ్‌ కమిటీ సభ్యుల సంఖ్యను 20కి పెంచాలని కమిటీ తీర్మానించింది. ఉద్యమ కార్యాచరణ పర్యవేక్షణకు, జిల్లా నేతలను మానిటరింగ్‌ చేయడం ప్రభుత్వం, పార్టీల నుంచి వచ్చే వాటిని తిప్పి కొట్టేందుకు 8 మంది సభ్యులతో మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఉద్యోగులు, నాయకులు కూడా జిల్లాల్లో ఎక్కడా వ్యక్తిగత దూషణలు, పరుషపదజాలంతో దూషణలు చేయకూడదని కమిటీ నిర్ణయించింది. హక్కుల సాధనకు శాంతియుతంగా పోరాటం చేయాలని తీర్మానించింది. 


కార్యకర్తలతో తిట్టించడం దారుణం..

వేతన సవరణ అనేది ప్రభుత్వం- ఉద్యోగులకు సంబంధించిన అంశమని ఏదైనా ఉంటే ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకోవాలే గానీ, పార్టీ కార్యకర్తలతో ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తిట్టించడం దారుణమని కమిటీ అభిప్రాయపడింది. వారి తిట్లకు దీ టుగా సమాధానం చెప్పాలనేఅభిప్రాయం స్టీరింగ్‌కమిటీ సభ్యుల్లో వ్యక్తమైంది. 


సమ్మెకే మొగ్గు..

కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు వచ్చిన నష్టం, పీఆర్సీ జీవోలపై పెద్ద ఎత్తున వస్తున్న అసంతృప్తి దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె వైపే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (7వ తేదీ) సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన కమిటీ నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పీఆర్సీ సాధన సమితి అమరావతి సచివాలయంలో సీఎ్‌సకు సమ్మె నోటీసు అందజేయనుంది. సమ్మె నోటీసు అనంతరం ఉద్యమ కార్యాచరణపై సచివాలయ ఆవరణలోనే మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 


నేతల మాట ఉద్యోగులారా జాగ్రత్త!

ఉద్యమంలో భాగంగా రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేయవద్దు.

ప్రభుత్వంతో ఘర్షణ మన ఉద్దేశం కాదు. లక్ష్య సాధనకు అవసరమైన సద్విమర్శలు మాత్రమే చేయండి.

పీఆర్సీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని సూటిగా ఎండగట్టండి.


ఇవీ కీలక డిమాండ్లు..

ఏకపక్షంగా జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి.

11వ పీఆర్సీపై అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదికను మా 

ముందుంచాలి. 

ఆ నివేదికలోని అంశాలపై మాతో చర్చించి... పరస్పర ఆమోదయోగ్యంగా, మెరుగైన పీఆర్సీని ఇవ్వాలి. 

ఈనెలకు పాత జీతాలనే ఇవ్వాలి. కొత్త పీఆర్సీతో వేతనాలు సిద్ధం చేయాలని ట్రెజరీ సిబ్బందిపై ఒత్తిడి చేయవద్దు. 


అప్పటిదాకా చర్చల్లేవ్‌..

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ ఫోన్‌ చేసి ఆహ్వానించారు. కానీ... ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటున్న కమిటీ పరిధులు, నిర్ణయాధికారాలు ఏమిటో మాకు తెలియదు. అందుకే... మేం చర్చలకు వెళ్లేది లేదు. అంతేకాదు... పీఆర్సీ జీవోలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చేదాకా ఎలాంటి చర్చలకూ వెళ్లేది లేదని తీర్మానించుకున్నాం.


సమ్మె నోటీసులో..

పీఆర్సీ, దాని అనుబంధ అంశాలు, ఫిట్‌మెంట్‌పై ప్రకటన సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు, ఉద్యోగ వర్గాలకు సంబంధించి అధికారికంగా ఇచ్చిన హామీలు... ఇలా అన్ని డిమాండ్లను కలిపి సమ్మె నోటీసు ఇస్తాం.




మాపై దుష్ప్రచారం బాధాకరం

మా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎలాంటి రాజకీయ పక్షాలను ఆహ్వానించటం లేదు. కేవలం పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, కార్మిక సంఘాలను మాత్రమే ఆహ్వానించాం. ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వం ఏదో యుద్ధం జరుగుతున్నట్టుగా భావిస్తోంది. ప్రభుత్వాన్ని నమ్మినందుకు ఉద్యోగులకు జరిగిన అన్యాయం పట్ల బాధగా ఉంది. ఇదే సందర్భంలో సోషల్‌ మీడియాలో, ఒక మీడియాలో, అధికారులతో, ఒక రాజకీయ పార్టీ పక్షాన ప్రభుత్వం ఉద్యోగుల మీద దురభిప్రాయాన్ని కల్పించేలా ప్రచారం చేయించటం మమ్మ ల్ని ఆవేదనకు, ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వంతో సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తుంటే ప్రభుత్వం యుద్ధ వాతావరణాన్ని కల్పించటం బాధాకరం. ఉద్యోగుల ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని కూడా రానివ్వటం లేదని స్పష్టం చెబుతున్నాం. సామాన్య ఉద్యోగుల నుంచి పెన్షనర్ల వరకు సోషల్‌ మీడియా, ఇతర మీడియా వేదికలుగా ఉద్యోగ సంఘాల నేతలను ఏ విధంగా తిడుతున్నారో మీ ఇంటెలిజెన్స్‌ ద్వారా తెప్పించుకుని చూడండి. ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్టు - అవుట్‌సోర్సింగ్‌ - డైలీ వేజ్‌ ఉద్యోగులు పీఆర్‌సీ సాధన సమితిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇంత పెద్ద ఉద్యమం దిశగా కదులుతుంటే పక్కదారి పట్టించేంకుందుకు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యలను నమ్మకుండా సంయమనంతో ఉద్యోగ సంఘాలు వ్యవహరించాలి. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎవరిపైనా వ్యాఖ్యలు చేయటం తగదు. మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవటం లేదు. మెరుగైన పీఆర్‌సీని కోరుకుంటున్నాం. ఉద్యోగులకు జరిగిన నష్టాలపై సద్విమర్శలు చేస్తూ ఎండగట్టేలా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మానిటరింగ్‌ కమిటీ సభ్యులు జిల్లా నాయకులకు మార్గదర్శనం చేస్తారు. ప్రభుత్వం, పార్టీలపై ఎలాంటి అనుచిత విమర్శలు చేయకుండా కూడా నియంత్రిస్తారు. మంచి పీఆర్సీ ఇవ్వలేదన్న ఆవేదన, ఆవేశంతో తెలిసీ తెలియక మాట్లాడిన అంశాలను తీసుకుని కేసులు పెట్టాలని భావిస్తున్నారు. 

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌


బలవంతంగా పీఆర్సీ అమలుకు యత్నం..

సమ్మె నోటీసుకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలు, ప్రభుత్వంతో చర్చల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించుకున్నాం. జీఏడీ హెచ్‌ఆర్‌ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాకు ఫోన్‌ చేసి మంత్రులతో చర్చలకు రమ్మన్నారు. మంత్రుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. దాని పరిధి? నిర్ణయాధికారాలపై స్పష్టత లేదు. కాబట్టి చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాం. బలవంతంగా నూతన పీఆర్‌సీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు అధికారికంగా కమిటీ ని వేయటం, జీవోలు రద్దు చేస్తే తప్ప చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాం. పీఆర్సీ, దాని అనుబంధ అంశాలు, పీఆర్సీ ప్రకటన సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు, అధికారికంగా ఇచ్చిన హామీలు, డిమాండ్లన్నింటినీ కలిపి నోటీసు ఇస్తాం. హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులపైనా చర్చించాం. పాత జీతం ఇవ్వాలని మేమే ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరాం. సీఎస్‌ మీద ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. 

-కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీజీఈఏ జేఏసీ చైర్మన్‌


మొత్తం వర్కింగ్‌ క్లాస్‌ సమ్మెలోకి..

స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించాం. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు చీఫ్‌ సెక్రటరీకి సమ్మె నోటీసు అందిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు - అవుట్‌సోర్సింగ్‌ - డైలీవేజ్‌ అనేక రకాల సంఘాలన్నీ కలిసి ఒక్కటిగా అవతరించటం చూస్తే చరిత్రలోనే ఇంత పెద్ద ఉద్యమాన్ని చూడలేదు. రికవరీ చేసే పీఆర్‌సీని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. పాత జీతాలు ఇవ్వటానికి ప్రెస్టేజీ అవసరం లేదు. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు. 7వ తేదీన మొత్తం వర్కింగ్‌ క్లాస్‌ ఆఫ్‌ ఏపీ సమ్మెలో ఉంటుంది.


- బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌ 

అన్ని జీవోలూ వెనక్కి తీసుకోవాలి

నాలుగు జేఏసీలు సమన్వయం చేసుకోకపోవటం వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని నివారించటం కోసం పీఆర్‌సీ సాధన సమితిగా ఆవిర్భవించాం. పీఆర్‌సీ అమలుకు సంబంధించి జారీ చేసిన అన్ని జీవోలు వెనక్కి తీసుకోవాలి. అశోతోష్‌ మిశ్రా ఇచ్చిన పీఆర్‌సీ ఇవ్వాలి. పీఆర్‌సీపై చర్చలు పునఃప్రారంభించాలన్న 3నిర్ణయాలు తీసుకున్నాం. నాలుగు జేఏసీల ఐక్యత చూసి అనేక సంఘాలు తమ సమస్యలను తీసుకువస్తున్నాయి. ఈ వేదిక పీఆర్‌సీ కోసం ఏర్పడింది. ప్రభుత్వంతో చర్చల సందర్భంలో సీపీఎస్‌ రద్దు, గ్రామ వార్డు సచివాలయాల రెగ్యులైజేషన్‌, కాంట్రాక్టు - అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ ఇలా అన్ని సమస్యల మీదా ప్రభుత్వంతో చర్చిస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం జీవోలు వెనక్కు తీసుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.


- వెంకట్రామిరెడ్డి, ఏపీజీఈఎఫ్‌ జేఏసీ చైర్మన్‌ 

Updated Date - 2022-01-24T07:58:03+05:30 IST