ఎన్నాళ్లీ సాగదీత?

ABN , First Publish Date - 2021-06-23T05:15:01+05:30 IST

జిల్లాస్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.

ఎన్నాళ్లీ సాగదీత?

నత్తనడకన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌  నిర్మాణం

రెండేళ్లయినా పూర్తికాని పనులు

ఖమ్మం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాస్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ల  నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పనులు మొదలై రెండేళ్లవుతున్నా ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వి.వెంకటాయపాలెం సమీపంలోని 20ఎకరాల్లో రూ.35కోట్లతో ఆరు బ్లాకులతో కలెక్టరేట్‌ నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు బ్లాకులు జీప్లస్‌ -2 వరకు, రెండుబ్లాక్‌లు గ్రౌండ్‌ఫోర్లు, ఒకబ్లాక్‌ జీప్లస్‌-1 వరకు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇప్పటికి రూ12కోట్లు ఖర్చుచేశారు. వాస్తవానికి ఈ భననాల నిర్మాణం రెండేళ్లలో పూర్తికావాల్సి ఉండగా నిధుల కొరత తదితర సమస్యలతో నిర్మాణం చాలాకాలం నిలిచిపోయింది. పనులు ప్రారంభించడం కొద్దిరోజుల తరువాత నిలిపేయడం పారిపాటిగా మారింది. 

ఆది నుంచీ అడ్డంకులే..

అప్పటి రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని వెంకటాయపాలెం సమీపంలో రైతుల భూములు కొనుగోలు చేసి అక్కడ సమీకృత కలెక్టరేట్‌ మంజూరుచేయించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు మొదట్లో ఆలస్యం కాగా ఆ తర్వాత న్యాయపరంగా చిక్కులు తొలగడంతో ఆర్‌అండ్‌బీ శాఖ పనులు ప్రారంభించింది. మొదట్లో పనులు చురుగ్గాసాగినా, తర్వాత కరోనా, నిధుల సమస్యలతో కలెక్టరేట్‌ పనులు ఆగిపోయాయి. కొత్తకలెక్టరేట్‌ పనులు పూర్తయి పరిపాలన ప్రారంభమైతే ఖమ్మం నగరం వెంకటాయపాలెం వరకు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం నుంచి వెంకటాయపాలెం వరకు నాలుగులైన్ల రహదారి కూడా మంజూరైంది ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అయితే కొత్త కలెక్టరేట్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రస్తుత రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్‌కు నిధుల సమస్య కారణంగా పనులు ప్రారంభం కావడంలేదని తెలిసింది. పనులు మొదలుపెట్టినా మళ్లీ ఏదో ఒక కారణంతో నిలిపేయడంతో జాప్యం జరుగుతోంది. ఈ కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయితే అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ప్రజలకు   వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

ఏడాదిలో పూర్తి చేస్తాం .. శ్యాంప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ

ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తిచేస్తామని ఖమ్మం ఆర్‌అండ్‌బీఈఈ శ్యాంప్రసాద్‌ తెలిపారు. కరోనా కారణంగా పనివారు రావడంలేదని, అందువల్లనే పనులు మందుకు సాగడం లేదన్నారు. ఆగిపోయిన పనులను ప్రస్తుతం ప్రారంభించామని తెలిపారు. పనులు వేగంగా కొనసాగించి ఏడాదిలోగా ప్రారంభించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.  

నిధుల చెల్లింపులో జాప్యం 

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లాలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం నిధులు చెల్లింపులో తీవ్రజాప్యం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2018లో రూ.45కోట్లతో కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్య కేఎస్‌ఎం ఇంజనిరింగ్‌ కళాశాల సమీపంలో ఈ భవన నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణం చేపట్టినప్పటినుంచి భవన నిర్మాణం నత్తనడకనే సాగుతోంది. మొదట్లో స్థల సేకరణలో జాప్యం కారణంగా ఏడాది ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. తర్వాత పనుల్లో వేగం పుంజుకుంది. కానీ ఆ తర్వాత ఇసుక కొరత కారణంగా గత ఏడాది పనులు మందకొడిగా సాగాయి. చేసిన పనులకు బిలులు చెల్లించకపోవడంతో గత ఏడాది నుంచి పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు రూ.26.50 కోట్ల పనులు జరిగాయి. బిల్లులు మాత్ర రూ.22.50 కోట్లు మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. చేసిన పనులకు బిల్లులు రావడంలేదనే కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. వాస్తవంగా పలుమార్లు గడువు పొడిగించగా తాగా గడువు ప్రకారం మార్చి 2021కి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి కేవలం 65 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 35 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. కలెక్టరేట్‌ భవనంలో విద్యుత్‌ పనులు, సీలింగ్‌, డోర్స్‌,  ప్లంబింగ్‌ పనులతో పాటు, ముందు భాగంలో ప్రహారి నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక జిల్లాస్థాయి అధికారులకు ఎనిమిది నివాస సముదాయాలను నిర్మించాల్సి ఉండగా వాటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జరిగిన పనులకు బిల్లులు ఇచ్చినా పనులు పూర్తి కావడానికి ఇంకా నాలుగు నెలలు పట్టేలా ఉంది.

Updated Date - 2021-06-23T05:15:01+05:30 IST