విజయ్ సైకిల్, అజిత్ మాస్క్.. డీఎంకేకు మద్దతుగానేనా?

ABN , First Publish Date - 2021-04-07T00:09:55+05:30 IST

ఇంతటితో ఆగకుండా విజయ్ ఉపయోగించిన సైకిల్ రంగులను బట్టి ఏ పార్టీకి ఓటేయాలో కూడా సూటిగానే చెప్పారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక మరో అగ్ర హీరో అజిత్ ధరించిన మాస్క్‌పై కూడా ఇలాంటి చర్చే కొనసాగుతోంది

విజయ్ సైకిల్, అజిత్ మాస్క్.. డీఎంకేకు మద్దతుగానేనా?

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా కోలీవుడ్ అగ్రహీరోలు పోలింగ్ బూత్‌కి వచ్చిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరో విజయ్.. సైకిల్‌పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశంలో తీవ్రంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా విజయ్ అలా సైకిల్‌పై వచ్చాడని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారంటూ నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.


ఇంతటితో ఆగకుండా విజయ్ ఉపయోగించిన సైకిల్ రంగులను బట్టి ఏ పార్టీకి ఓటేయాలో కూడా సూటిగానే చెప్పారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక మరో అగ్ర హీరో అజిత్ ధరించిన మాస్క్‌పై కూడా ఇలాంటి చర్చే కొనసాగుతోంది. విజయ్ ఉపయోగించిన సైకిల్, అజిత్ పెట్టుకున్న మాస్క్.. ఒకే రంగుల్లో ఉండడం దీనికి ప్రధాన కారణం. ఈ రెండూ నలుపు, ఎరుపు రంగుల్లో ఉన్నాయి. అందుకని వీరిద్దరూ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి ఓటేయమని సంకేతాలు ఇస్తున్నారని కొందరి వాదన. డీఎంకే నేతలైతే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.


హీరో విజయ్ తన ఇంటి నుంచి సైకిల్‌పై వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అధికార పార్టీపై వ్యతిరేకతను సూటిగానే ప్రదర్శించారని అంటున్నారు. ఇక అజిత్ ధరించిన మాస్క్ నలుపు రంగులో ఉంది. ఆ మాస్క్‌కు ఉన్న దారాలు ఎరుపు రంగులో ఉన్నాయి. విజయ్ సైకిల్ నలుపు, ఎరుపు రంగుల్లో ఉంది. డీఎంకే పార్టీకి మద్దతుగానే వీరిద్దరూ ఆ పార్టీ రంగుల్లో ఉన్న సైకిల్, మాస్క్ ఉపయోగించారని చర్చ జరుగుతోంది. అజిత్ మాస్క్ అంశం పెద్దగా చర్చకు రాకపోయినప్పటికీ విజయ్ సైకిల్ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయమై ట్విట్టర్‌లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయంటే విజయ్ సైకిల్ ప్రయాణం ఎంతలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.


అయితే దీనికి విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది. పోలింగ్ బూత్ తన ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల సైకిల్‌పై వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారని ఆయన టీం తెలిపింది. అంతే కాకుండా చెన్నైలోని ఇరుకు వీధుల కారణంగా కారులో వెళ్లడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని, దీని వెనుక మరే ఇతర కారణం లేదని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-07T00:09:55+05:30 IST