విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్ వేస్తా: రఘురామ

ABN , First Publish Date - 2021-07-30T20:42:03+05:30 IST

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్ వేస్తా: రఘురామ

ఢిల్లీ: వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జగన్‌ను ఏ1గా, విజయసాయిని ఏ2గా సంభోదిస్తూ ఎద్దేవా చేస్తూ.. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ఏ2 చూస్తున్నారని, 2 రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించి కలకలం రేపారు.


ఇప్పటికే ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ  పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నెల 30న (శుక్రవారం) పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. కాగా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణరాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు.

Updated Date - 2021-07-30T20:42:03+05:30 IST