‘విశాఖ కోపరేటివ్‌ బ్యాంక్‌ దేశానికే ఆదర్శం’

ABN , First Publish Date - 2020-09-22T23:01:07+05:30 IST

దేశంలో అనేక కోపరేటివ్‌ బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో

‘విశాఖ కోపరేటివ్‌ బ్యాంక్‌ దేశానికే ఆదర్శం’

  • రాజ్యసభ చర్చలో విజయసాయి రెడ్డి


న్యూఢిల్లీ : దేశంలో అనేక కోపరేటివ్‌ బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో దక్షిణాదిలో అగ్రగామిగా నిలిచిన విశాఖపట్నం కోపరేటివ్‌ బ్యాంక్‌ పని తీరును ఆదర్శంగా తీసుకుని ఇతర కోపరేటివ్‌ బ్యాంక్‌లను తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. దేశంలో తీవ్ర ఆర్థిక వత్తిళ్ళు, పాలనాపరమైన లోపాలతో సంక్షోభంలో పడిన కోపరేటివ్‌ బ్యాంక్‌లను పునఃవ్యవస్థీకరించి, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లుపై ఎంపీ విజయసాయి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రికి కొన్ని సూచనలు చేశారు. 88 వేల మందికి  పైగా సభ్యులు కలిగిన విశాఖపట్నం కోపరేటివ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది జూలై 2020 నాటికి 6 వేల కోట్ల పైబడిన టర్నోవర్‌ సాధించింది. ఈ బ్యాంక్‌ పని తీరును ఆదర్శంగా తీసుకుని ఇతర కోపరేటివ్‌ బ్యాంక్‌లు పని చేసేలా చర్యలు తీసుకోవలసిందిగా ఆర్థిక మంత్రికి సూచించారు. అర్బన్‌ బ్యాంక్‌ల పర్యవేక్షణ, నియంత్రణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌లో ప్రత్యేక విభాగం ఉంది.


అయినప్పటికీ పీఎంసీ బ్యాంక్‌ కుంభకోణం జరిగింది. ఈ తరహా సమస్యలకు పరిష్కారం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కంటే రిజర్వ్‌ బ్యాంక్‌లో అర్బన్‌ బ్యాంక్స్‌ విభాగాన్ని పటిష్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీ వసూళ్ళ విషయంలో జిల్లా సహకార సంఘాలు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలతో అనుసంధానమై పని చేస్తుంటాయన్నది తెలిసిన విషయమే. అయితే సకాలంలో రుణ బకాయిలు వసూలు చేయలేక దేశంలోని అనేక డీసీబీలు సతమతమవుతున్నాయి. జిల్లా కోపరేటివ్‌ సొసైటీలను రాష్ట్ర కోపరేటివ్‌ సౌసైటీలో విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కనుగొన్నదని విజయసాయి రెడ్డి తెలిపారు.


Updated Date - 2020-09-22T23:01:07+05:30 IST