వచ్చేస్తోంది విశాఖ ఎక్స్‌ప్రెస్‌!

ABN , First Publish Date - 2020-02-28T10:03:06+05:30 IST

వచ్చేస్తోంది విశాఖ ఎక్స్‌ప్రెస్‌!

వచ్చేస్తోంది విశాఖ ఎక్స్‌ప్రెస్‌!

 కోడి వెంకట శశికాంత్‌.. తాజా రంజీ సీజన్‌లో సంచలనాలకు కేంద్ర బిందువు. విశాఖ పోర్ట్‌ జట్టుకు ఆడిన నాన్న అడుగుజాడల్లో నడుస్తూ క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న

 ఈ మీడియం పేసర్‌.. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన  20 రంజీల్లో 70 వికెట్లు తీస్తే, అందులో ఈ సీజన్‌లోని 

ఎనిమిది మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు నేలకూల్చాడు. ఇలా.. అద్భుతమైన ఫామ్‌ను చాటుకుంటూ ఆంధ్ర విజయాల్లో కొంతకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ 24 ఏళ్ల కుర్రాడు.. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా  దూసుకెళ్తున్నాడు. త్వరలోనే టీమిండియా జెర్సీని తండ్రికి బహుమతిగా ఇస్తానంటున్న శశికాంత్‌.. క్రికెట్‌ ప్రయాణం ఎలా మొదలైందో  అతడి మాటల్లోనే..


క్రికెట్‌ వైపు అడుగులు పడ్డాయిలా..

నాన్న పేరు రామకృష్ణ. ఆయన విశాఖ పోర్ట్‌ క్రికెట్‌ జట్టు తరపున లెగ్‌ స్పిన్నర్‌గా ఆడేవారు. పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. చిన్నతనంలో ఆయనతో పాటు గ్రౌండ్‌కు వెళ్లేవాడిని. నాన్న వాళ్ల టీమ్‌ ఆడుతుంటే గ్యాలరీలో కూర్చొని గోల చేసే వాడిని. నన్ను కంట్రోల్‌ చేయడానికి నాన్న స్నేహితులు కొందరు నాతో బౌలింగ్‌ చేయించడం ప్రారంభించారు. అలా మొదలైన నా క్రికెట్‌ ప్రస్థానం నాన్న ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చింది.


కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌..

2017లో సీకే నాయుడు అండర్‌-23 టోర్నమెంట్‌లో 34 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచా. ఈ టోర్నీలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదు (5/57) వికెట్లు పడగొట్టడంతో పాటు సెంచరీ (157 నాటౌట్‌) కూడా చేశా. ఈ ప్రదర్శనతో జట్టులో స్థానం పదిలమైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌తో రంజీ పోరులో ఆరు (6/18) వికెట్లు తీశా. అప్పటినుంచి కెరీర్‌ వేగం పుంజుకుంది.


రంజీల్లో అరంగేట్రం చేసి నాలుగేళ్లవుతున్నా..

ఆంధ్ర రంజీ జట్టు తరఫున 2015 అక్టోబరులో ఉత్తరప్రదేశ్‌పై అరంగేట్రం చేశా. టీమ్‌లో ఉన్న పోటీ కారణంగా అడపాదడపా చోటు దక్కేదేకానీ, రెగ్యులర్‌ బౌలర్‌ని కాదు. సీనియర్లు అందుబాటులో లేనప్పుడు లభించిన అవకాశాలను ఉపయోగించుకొనే వాడిని. గత రెండేళ్ల నుంచి నిలకడగా చాన్సులు లభిస్తుండడంతో నా బౌలింగ్‌ మునుపటి కంటే బాగా మెరుగైంది. సీమ్‌ పొజిషన్‌, లైన్‌ అండ్‌ లెంగ్త్‌, రనప్‌ సమస్యలను కోచింగ్‌ సిబ్బంది సహకారంతో అధిగమించా. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ఏడాది మరింతగా రాణించేందుకు ప్రయత్నిస్తా.


అభిమానించే క్రికెటర్‌..

సచిన్‌ టెండూల్కర్‌కు వీరాభిమానిని. పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ ఆటనూ అభిమానిస్తా. బౌలింగ్‌లో అయితే మెక్‌గ్రాత్‌ నాకు రోల్‌ మోడల్‌.


భవిష్యత్‌ లక్ష్యం..

భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఇండియన్‌ టీమ్‌ జెర్సీని నాన్నకు గిఫ్ట్‌గా ఇస్తా. ఆయన స్వప్నాన్ని సాకారం చేస్తా.


(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - 2020-02-28T10:03:06+05:30 IST