Abn logo
Jan 14 2021 @ 03:15AM

విశ్వ కళ్యాణ సంక్రాంతి లక్ష్మి

విశ్వశాంతి సువర్ణ సుప్రభాత కిరణాల్లో 

భువిని సమతాపతంగాలు రివ్వున ఎగురగా 

గుండెవాకిళ్ళ మమతలతోరణాలు వ్రేలగా 

స్వర్ణరథంలో వచ్చే ‘సంక్రాంతి’ కళ్యాణీ! స్వాగతం!!


తెలుగు గుమ్మాల ముంగిట ముత్యాలముగ్గుల్లో 

ముద్దుగా పూబంతుల గొబ్బెమ్మలను పేర్చి 

గొబ్బిలక్ష్మిని పూజించే – కన్నెలను దీవించగా

వేగవచ్చే – ‘సర్వమంగళదాయని’కి సుస్వాగతం!!


గంగిరెద్దు కాలిమువ్వల శుభకరస్వరాలు, 

బుడబుక్కలవాని ఢమరుక ధ్వనులు 

హరిదాసు – భక్తి కీర్తనలు – శుభాలందీయ, 

సాగి వచ్చే ‘‘సౌభాగ్యలక్ష్మి’’ కిదే స్వాగతం!!


రైతన్నల కష్టం ఫలించి పంటసిరులనిచ్చి, 

పసిపాపలపై భోగిపళ్ళు – శుభాలై కురియ 

‘సర్వే జనాః సుఖినోభవంతు’ అని ఆశీర్వదించ 

తరలి వచ్చే ‘‘శ్రీమహాలక్ష్మి’’కి స్వాగతం!!


కుల మత భేదాలు – భోగిమంటల్లో కాలగ 

అవినీతి బకాసురులు – అంతమందగ

యువజనాలలో చైతన్యకాంతులు విరియగ 

వేగవచ్చే ‘సకల జనహితైషిణి’కి స్వాగతం!!


తెలుగు కలాలు – పసిడి కాంతుల తేజరిల్ల

ప్రతిగుండెలో అహింస, శాంతులు విరాజిల్ల 

తెలుగు వెలుగుల స్వర్ణ క్రాంతిరథంలో 

విచ్చేస్తున్న ‘‘విశ్వకళ్యాణ సంక్రాంతి లక్ష్మి’’! సుస్వాగతం!!

‘కళ్యాణశ్రీ’ జంధ్యాల వేంకటరామశాస్త్రి

Advertisement
Advertisement
Advertisement