ఆ ఓట్లపై ‘‘గంప’’డాశలు

ABN , First Publish Date - 2020-12-04T12:39:36+05:30 IST

ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థుల్లో కొత్త గుబులు మొదలైంది. డబ్బులు తీసుకున్న వారంతా తమకే ఓటేశారా.. లేకుంటే ఇతరులకు వేశారా.. అనే దానిపై అనుమానాలు ....

ఆ ఓట్లపై ‘‘గంప’’డాశలు

గంపగుత్త ఓట్లపైనే అభ్యర్థుల ఆశ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థుల్లో కొత్త గుబులు మొదలైంది. డబ్బులు తీసుకున్న వారంతా తమకే ఓటేశారా.. లేకుంటే ఇతరులకు వేశారా.. అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు గంపగుత్త ఓట్లనే ఎక్కువగా కొనుగోలు చేశారు. బస్తీలు, కాలనీల్లోని కులాలు, మహిళా, యువజన సంఘాలకు పెద్ద మొత్తంలో నగదు, కానుకలు సమర్పించారు. కాలనీ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్‌ కమిటీలు కోరిన కోర్కెలను ఆయా పార్టీల అభ్యర్థులు తీర్చారు. ఒక అభ్యర్థి దగ్గర 20 నుంచి 30 ఓట్లకు సంబంధించిన నగదును తీసుకున్న సంఘాలు, మరో అభ్యర్థి నుంచి కూడా ఇదే పద్ధతిలో డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్న వారు ఎవరికి ఓట్లు వేయించారన్నది ఆసక్తికరంగా మారింది. చాలా డివిజన్లలో 40 నుంచి 45 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాకవడంతో గెలుపోటముల మధ్య తేడా వందల సంఖ్యలోనే ఉండనున్నట్లు తేలనుంది.

ప్రతిఫలం దక్కేనా..!

నగరంలో ఎమ్మెల్యే తర్వాత కార్పొరేటర్‌ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పదవి కోసం చాలామంది అభ్యర్థులు ఎన్నికల ముందు నుంచే భూములు, ప్లాట్లు అమ్ముకుని డబ్బును సమకూర్చుకున్నారు. కొందరు బంధువులు, స్నేహితుల దగ్గరి నుంచి అప్పు తెచ్చుకుని పెద్దఎత్తున ప్రచారం చేశారు. అలాంటి వారికి ‘గెలవకపోతే..!’ అన్న ఊహ దుర్భరంగా ఉంది.

Updated Date - 2020-12-04T12:39:36+05:30 IST