మెడికల్‌ హబ్‌గా వరంగల్‌!

ABN , First Publish Date - 2021-06-22T07:51:05+05:30 IST

వరంగల్‌ నగరాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

మెడికల్‌ హబ్‌గా వరంగల్‌!

  • 200 ఎకరాల్లో సమీకృత హెల్త్‌ కాంప్లెక్స్‌ 
  • 33 అంతస్తుల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి
  • ఏడాదిన్నరలో ఆస్పత్రి పూర్తి కావాలి
  • చైనా నుంచీ నిపుణులను రప్పించండి
  • 3వేల కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం
  • మీడియా సంచలనం పిచ్చిని మానుకోవాలి
  • కరోనా వస్తే రెండు డోలో మాత్రలు వాడా
  • వరంగల్‌ పర్యటనలో కేసీఆర్‌ వ్యాఖ్యలు
  • ఇక ‘హన్మకొండ, వరంగల్‌’ జిల్లాలు


(ఆంధ్రజ్యోతి వరంగల్‌ బ్యూరో): వరంగల్‌ నగరాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 200 ఎకరాల్లో సమీకృత హెల్త్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. అగో అంటే ఆర్నెల్లు ఆలస్యం.. ప్రభుత్వం అంటే ఒక యాష్ట అనే అభిప్రాయం ప్రజల్లో రాకుండా వేగంగా పనులు జరగాలని ఆదేశించారు. 28 గంటల్లో  10 అంతస్తుల భవనం నిర్మించిన చైనా దేశం లాగా పనులు చేపట్టాలన్నారు. అవసరమైతే ఆ చైనా నిపుణులనే ఇక్కడికి రప్పిస్తామని ప్రకటించారు. సోమవారం ఆయన వరంగల్‌ నగరంలో పర్యటించారు.సెంట్రల్‌ జైలు ఆవరణలో నిర్మించతలపెట్టిన అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిపాలన భవనం, అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టర్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ తర్వాత అతి ముఖ్యమైన నగరం అయినప్పటికీ అనేక కారణాలతో వరంగల్‌లో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ తూర్పు ప్రాంతానికి ఇది హెడ్‌ క్వార్టర్‌ కావాలని చెప్పారు. 


కాకతీయ వైద్య కళాశాల, పాత సెంట్రల్‌ జైలు ఆవరణ, ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల, ఆటోనగర్‌, ఎంజీఎం ఆస్పత్రులు కలుపుకుంటే 200 ఎకరాలు అవుతుందని, వీటన్నిటిని జోడిస్తూ అత్భుతమైన ప్రణాళికతో హెల్త్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉండేవాళ్లు కూడా ఈర్ష్య పడేలా వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలన్నారు. ‘‘హెలీకాప్టర్‌ పైఅంతస్తులో దిగేవిధంగా హెలీపాడ్‌ నిర్మించాలి. ఎంజీఎం ఆస్పత్రిని కూల్చేసి, అన్ని సౌకర్యాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మూడు వేల కోట్లయినా వెనుకాడేది లేదు. వరంగల్‌కు డెంటల్‌ కళాశాల, దీనికి అనుబంధ ఆస్పత్రిని ఈ రోజే మంజూరు చేస్తున్నాం’ అని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ప్రతీ తాలూకా కేంద్రంలో నీలోఫర్‌ తరహాలో ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఆస్పత్రులు కెనడాలో ఉన్నాయని గవర్నర్‌ చెప్పారని, అవసరమైతే ప్రజాప్రతినిధులు, అధికారులను అక్కడికి పంపుతామని చెప్పారు. కెనడాను తలదన్నేలా ఆస్పత్రులను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ‘‘రోగం వచ్చిన ప్రతి వారు బతికే అవకాశం లేదు కదా. కొందరు చనిపోతారు. అంత మాత్రాన వైద్యులపై దాడులు చేయడం సరికాదు’’ అన్నారు. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను ఇక నుంచి హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పిలవాలని సీఎం నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు.


పిచ్చి సెన్సేషన్‌ మానేయాలి

‘‘టీవీలోళ్లకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి కదా. కరోనా చిన్న పిల్లలకు వస్తదని జోరుగా ప్రచారం చేస్తున్నరు. ఇపుడు వాళ్ళు పండుకుంట లేరు. అసలే బడి బందై ఇండ్లళ్ళ పిచ్చి పిచ్చి చేస్తున్నరు. ఎందుకు అనవసరపు ప్రచారం చెప్పండి? భయంతో పెద్దలు పుస్తెలు అమ్ముకుని లక్షలు లక్షలు ఖర్చు పెట్టడానికి దవాఖానలకు వాళ్ళనెత్తుకుని ఉరుకాల్నా? సమాజానికి, ప్రజలకు మేలు చేసే వారెవరూ ఇలాంటి ప్రచారాలు చేయరు. దండంపెట్టి చెబుతున్నా. దుష్ప్రచారం మానేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘టీవీలు చూసే కొందరు భయంతో చనిపోయారు. స్వయంగా ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నాకు చెప్పారు.. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ప్రజలు భయంతో ఆక్సీజన్‌ సిలిండర్‌లు కొనుగోలు చేసి పెట్టుకోవడం వల్ల అవసరమైన వారికి అందకుండా పోయిందట. మీడియా పిచ్చి సెన్సేషన్‌ మానుకోవాలి’’ అని సూచించారు. 


పారాసెటమాల్‌తో నాకు కరోనా తగ్గింది

‘నాకు కూడా కరోనా వచ్చింది.. డాక్టర్‌ దీనికి ఇచ్చే మందులన్నీ టయల్‌ అండ్‌ ఎర్రర్స్‌ అన్నారు. అసలే నాది బక్క ప్రాణం.. చవగొట్టరు కదా? అన్నాను. నిజానికి చెబితే ఇపుడో పంచాయితీ కానీ నాకు పారాసెటమాల్‌, యాంటీ బయటిక్స్‌, డి విటమిన్‌ మాత్రలు ఇచ్చారు. విటమిన్‌ మాత్రలు వాడనేలేదు. వారం రోజుల్లోనే నాకు తగ్గింది.. కరోనాకు ఎర్లీ ట్రీట్‌మెంటే అత్యంత ముఖ్యమైన చికిత్స’ అని కేసీఆర్‌ వివరించారు. ‘‘చీఫ్‌ జస్టిస్‌ రమణ బంధువులకు ఒకరికి కరోనా వేస్తే ఆయన డాక్టర్లకు జాగ్రత్త చెప్పిండంట. పెద్ద మనిషి చెప్పిండని పాపం అతనికి ఇవ్వకూడని ఇంజక్షన్‌లన్నీ ఇచ్చిన్రు. అత్యవసరం అయితే నే ఇవ్వాల్సిన స్టెరాయిడ్స్‌ కూడా ఇచ్చేశారట.. ఇపుడు ఒక్కసారిగా బాగా లావై పోయాడట. ఈ విషయం జస్టిస్‌ రమణే స్వయంగా నాకు చెప్పారు’ అని కేసీఆర్‌ వెల్లడించారు. 


వంటలు రుచిగా ఉన్నాయని కితాబు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం హన్మకొండలోని తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. సాయంత్రం 5గంటల సమయంలో సీఎం జిల్లా నేతలు, కడియం కుటుంబ సభ్యుల తో కలిసి భోజనం చేశారు. తలకాయ, కాళ్లతో చేసిన కూ రను ఇష్టంగా ఆరగించారు. ‘ఏంటి శ్రీహరి, ఇంత రుచిగా వడ్డిస్తే మళ్లీ మళ్లీ రావాల్సి వస్తుంది’ అని ప్రశంసించారు. భోజనం అనంతరం దానిమ్మ జ్యూస్‌ తాగారు. కడియం శ్రీహరి మనవరాలు ఆన్య(కడియం కావ్య కుమార్తె) పుట్టిన రోజు వేడుకను కేసీఆర్‌ సమక్షంలో జరిపారు.


పోలీసుల అత్యుత్సాహం

కేసీఆర్‌ వరంగల్‌ రాక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులను సైతం సీఎంను కలిసేందుకు అనుమతించలేదు. అడుగడుగునా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నగరాన్ని దిగ్బంధం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కూడా  అడ్డుకున్నారు. ఆయన తన వాహనాన్ని వదిలేసి కలెక్టరేట్‌ వరకు నడిచి వెళ్లారు. జయశంకర్‌ స్మృతివనం వద్ద కూడా ఆయనను పోలీసులు లోనికి వెళ్లనివ్వలేదు. కేయూ విద్యార్ధులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపగా, అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 


చావు భయంపై పిట్టకథ 

‘‘ఇపుడు బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ అని ఏదేదో చెబుతున్నారు.. ఈ ఫంగస్‌ ఉన్నదో లేదో కానీ పేపరోళ్ళు టీవీ వాళ్ళు మాత్రం జోరుగ చెబుతున్నరు. జనం వాటిని చదివి, వినీ సచ్చిపోతుండ్రు.. నన్ను తిట్టినా ఫర్వాలేదు కానీ టీవీలోల్లకు మాత్రం గ్యారంటీగా పాపం తాకుతది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. చావుభయం గురించి ఒక పుస్తకంలో రాసిన పిట్టకథను వినిపించారు. ‘‘ఒక రాజ్యంలో గత్తర(కలరా) బాగా పెరిగింది. రాజు గారు ఏం చేయాల్నో అన్నీ చేసిండు.. అయినా తక్కువ కాలేదు.. చివరకు ఏదో గత్తరను భయపెట్టే ఒక వైద్యుడు ఉన్నడని తెలిస్తే ఆయనను రాజు పిలిపించాడట . ఇదీ తెలిసిన గత్తర మహమ్మారి నెమ్మదిగా ఆ రాజ్యం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసింది. సరిగ్గా ఆ రాజ్య సరిహద్దులో ఆ వైద్యుడికి ఈ గత్తర మహమ్మారి కనిపించింది.. ఏయ్‌ ఆగు అని వైద్యుడు గద్దించడంతో ఆగిపోయింది.. అన్యాయంగా 500 మందిని పొట్టన బెట్టుకున్నవ్‌ కదానే.. అని మండిపడ్డాడట ... దీంతో భయంతో వణికిపోతూ ఆ మహమ్మారి నేను కేవలం 50 మందినే చంపిన,  భయంతోనే మిగతా 450 మంది చనిపోయారు, ఇందులో నా తప్పేమీ లేదని చెప్పిందట. ఇట్లా ఉంది. మీడియా కథనాల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు’’ అని కేసీఆర్‌ ముక్తాయించారు. 

Updated Date - 2021-06-22T07:51:05+05:30 IST