Abn logo
May 23 2020 @ 11:50AM

వరంగల్ డెత్ మిస్టరీ: తల్లీకూతుళ్ల గొడవే కారణమా..? పరువుపోతుందని మక్సూదే..

పరువు పోతుందని మక్సూదే ఈ ఘోరానికి పాల్పడ్డాడా..?

గొర్రెకుంట మరణాల ఘటనలో అంతుబట్టని మిస్టరీ

కుటుంబ పెద్ద మక్సూద్‌ తీరుపై అనుమానాలు


వరంగల్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి) : వలస కార్మికుల విషాదాంతం మరో మలుపు తిరిగింది. గురువారం పాడుబడిన బావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మరో ఐదు మృతదేహాలు కనిపించాయి. ఒకే బావిలో తొమ్మిది మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.  వీరు ఎలా మరణించారనేది మిస్టరీగా మారింది. 


వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో గల సాయిదత్తా ట్రేడర్స్‌ ఖార్ఖానా ఆవరణ ఇప్పుడు సంచలనానికి కేరాఫ్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కటాకు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(50) తన కుటుంబంతో 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. కరోనా లాక్‌డౌన్‌తో స్థానిక సాయిదత్తా ట్రేడర్స్‌లో బారదాన్‌లు కుట్టే పనిచేసుకుంటూ అదే ఆవరణలోని గదుల్లో ఉంటున్నారు. గురువారం అనూహ్యంగా  మక్సూద్‌తో పాటు అతడి భార్య నిషా, కుమార్తె బూస్రా(22) మూడేళ్ల మనవడు బావిలో శవాలుగా లభ్యం కాగా, శుక్రవారం మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(21), సోహెల్‌ ఆలం(18)తో పాటు బిహార్‌కు చెందిన వలసకార్మికులు శ్యాం(20), శ్రీరాం(21), త్రిపురకు చెందిన షకీల్‌ (30) మృతదేహాలు లభ్యమయ్యాయి.  


పాడుబడిన బావి నుంచి తొమ్మిది మంది మృతదేహాలు బయటపడటం అంతు చిక్కని మిస్టరీగా మిగిలింది. వాస్తవానికి ఖార్ఖానా ఆవరణలో 8మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. తొమ్మిదో వ్యక్తి అయిన షకీల్‌ అక్కడికి ఎందుకు వచ్చాడు..? వారితో పాటే ఎలా మృతి చెందాడనేది అంతుబట్టకుండా మారింది.  తొమ్మిది మందిని చంపింది పదో వ్యక్తేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతుల సెల్‌ఫోన్లన్నీ గురువారం ఉదయం ఐదున్నర గంటలకు స్విచ్ఛాఫ్‌ కాగా, మక్సూద్‌ ఫోన్‌ మాత్రం మరో ప్రాంతంలో గురువారం 8గంటల తర్వాత ఆగిపోయింది. ఈ క్రమంలో ఘటనలో పదో వ్యక్తి ప్రమేయం ఉందా, లేదా మక్సూద్‌ పనేనా అనే అనుమానం కలుగుతోంది.  


సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే గందరగోళంగా ఉంది. మక్సూద్‌ కుటుంబం నివాసం ఉండే ప్రాంతం నుంచి మృతదేహాలు లభ్యమైన బావి దాదాపు 200 మీటర్ల దూరం ఉండడంతో పాటు ఖార్ఖానాకు, బావికి మధ్యలో ఐదడుగుల ఎత్తుగల ప్రహరీ ఉంది. బిహార్‌కు చెందిన శ్యాం, శ్రీరాంలు ఉన్నది గోదాంపైన ఉన్న మొదటి అంతస్తులోని గది. ఈ గది బావికి చాలా దగ్గరగా ఉంది. మక్సూద్‌ ఇంట్లో ఒకవేళ విష ప్రయోగం జరిగితే మృతదేహాలను బావి దగ్గరికి తరలించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మక్సూద్‌ నివాసం గోదాం ప్రధాన గేటు దగ్గరుంది. అక్కడి నుంచి మృతదేహాలను బావిలో పడేయాలంటే మధ్యలో ఉన్న ప్రహరీని దాటాల్సి ఉంటుంది. ఇక్కడే ఓ సందేహం అందరి మెదళ్లను తొలుస్తోంది. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్న గది దగ్గరే ఏదో ఘటన జరిగింది. విష ప్రయోగం జరిగాకా, సోయి తప్పిన అనంతరం వారిని భవనం పైనుంచి నేరుగా బావిలో పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. 


మక్సూద్‌ ఫోన్‌...

సంఘటన బుధవారం రాత్రి సమయంలో జరిగినట్టుగా భావిస్తున్నారు.  షకీల్‌  సరిగ్గా ఏడున్నర గంటల ప్రాంతంలో మక్సూద్‌ ఇంటికి వచ్చినట్టు సెల్‌ఫోన్‌ టవర్‌ చూపెడుతోంది. మృతులకు సంబంధించిన ఐదు మొబైల్స్‌ బావి దగ్గరే గురువారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో స్విచ్చాఫ్‌ అయ్యాయి. మక్సూద్‌కు చెందిన మొబైల్‌ ఫోన్‌మాత్రం వర్ధన్నపేట మండలం కట్ర్యాల-నందనం మధ్య  స్విచ్ఛాఫ్‌ కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.  మక్సూద్‌ తన కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో పరువు హత్యలకు పాల్పడిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడని, అయితే పట్టుబడితే శిక్ష తప్పదనే ఉద్దేశంతో తిరిగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 


కండోమ్‌, కూల్‌ డ్రింక్‌ బాటిళ్లు...

మక్సూద్‌ ఇంట్లో కూల్‌ డ్రింక్స్‌ బాటిళ్లు తాగినవి లభించాయి. అలాగే సగం తాగిన కూల్‌ డ్రింక్‌ బాటిల్‌తో పాటు మరో టెట్రాప్యాకెట్‌ కూల్‌ డ్రింక్‌ సాచెట్‌ పడి ఉంది.  రెండు గదుల ఇల్లు కావడంతో ఓ గదిలో షర్టు జేబులో కండోమ్‌లు లభించాయి.  అలాగే సగం తిన్న తినుబండరాలు ఉన్నాయి. దీంతో కూల్‌డ్రింక్స్‌లో విషం కలిపి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.


పోస్టుమార్టం రిపోర్టే కీలకం..

గొర్రెకుంట బావిలో బయటపడ్డ తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టు‌మార్టం పూర్తి అయ్యింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్లే కీలకంకానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న అక్రమ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో సీపీ సమావేశమయ్యారు. 


భూ కబ్జాదారులపైనా అనుమానాలు.. మృతుల వద్ద లభించని సెల్‌ఫోన్లు

గొర్రెకుంట బావిలో లభ్యమైన 9 మృతదేహలపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పరువు హత్యలని కొందరు, కాదు హత్యలని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మరణాలకు సంబంధించి మరోకోణం కూడా ప్రచారంలోకి వచ్చింది.  కొందరు భూకబ్జాదారులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ దందాలకు అడ్డాగా ఉన్న ప్రాంతంలో వలస కార్మికులు నివాసం పేరిట ఉండడం ఇష్టంలేక, ఫుడ్‌ ప్యాకెట్లలో విషం కలిపి హతమార్చి ఉంటారని ప్రచారం సాగుతోంది. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునే పేరిట  దాతలు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ అడ్డాలో ఉంటున్న వారిని అడ్డు తొలగించుకునేందుకు కొందరు స్థానిక కబ్జాదారులు ఫుడ్‌ ప్యాకెట్లలో పాయిజన్‌ కలిపి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మూకుమ్మడి హత్యలతో భయోత్పాతం  క్రియేట్‌ చేస్తే సొంతదారులు భయంతో భూమిని వదులుకుంటారనే ఉద్దేశంతో.. కబ్జాదారులు అమాయకులను హతమార్చి ఉంటారని స్థానికులంటున్నారు. అయితే ఒక రోజు తేడాతో శవాలు నీటిలో తేలియాడటం మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది. 9  మృతదేహాలను ఒకేసారి బావిలో వేయకుండా సమయం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. 


జాడలేని ఫోన్లు...

మృతదేహాల వద్ద వారి మొబైల్‌ ఫోన్లు లభించకపోవడంతో ఇవి ఖచ్చితంగా హత్యలనే నిర్ధారణకు పోలీసులు వస్తున్నారు.  బావిలో మొబైల్స్‌ ఉంటాయనే కోణంలో బావిలోని నీటిని రెండు మోటార్లతో ఖాళీ చేశారు. అడుగు కనిపించినా, ఒక్క ఫోను కూడా బయట పడలేదు. సాధారణంగా మృతుల జేబుల్లోనే ఫోన్లు ఉంటాయి. కానీ బావి నుంచి వెలికితీసిన మృతదేహాల్లో ఫోన్లు లేకపోవడం, అవన్నీ ఒకే సమయంలో స్విచ్ఛాఫ్‌ కావడం, మక్సూద్‌ ఫోను మాత్రం వర్ధన్నపేట మండలం నందనం-కట్ర్యాల దగ్గర టవర్‌లో ఆగిపోవడం లాంటి విషయాలు పోలీసులకు సవాలుగా మారాయి. 


తల్లీకూతుళ్ల గొడవే కారణమా..?

గొర్రెకుంట బావిలో 9 మంది చావుకు తల్లీకూతుళ్ళ మధ్య జరిగిన గొడవే కారణమా అన్న కోణం వెలుగు చూస్తోంది. సెల్‌ ఫోన్‌లో ఎక్కువ సేపు ఎవరితోనో మాట్లాడుతున్న కూతురుని తీవ్ర స్థాయిలో తల్లి మందలించినట్టు సమాచారం. దీంతో కూతురు సైతం అదే స్థాయిలో తల్లితో గొడవపడినట్టుగా తెలుస్తోంది. మృతులకు సంబంధించిన సెల్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. ఘటనకు ముందు ఎవరెవరికి కాల్‌ చేశారు. వారిని విచారించడంతో పోలీసులకు ఈ కొత్త కోణం వెలుగు చూసినట్టు సమాచారం. కాగా తల్లీకూతుళ్ళ  మధ్య వాగ్వాదంలో వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు. పరస్పరం నిందించుకోవడం మక్సూద్‌ అవమానంగా భావించినట్లుగా తెలుస్తోంది. అనేక పర్యాయాలు ఇదే విధంగా తల్లీకూతుళ్ళ  మధ్య గొడవ  జరిగినట్టు సమాచారం.  వీరి ప్రవర్తన పట్ల తండ్రి మక్సూద్‌  చాలా సార్లు అభ్యంతరం చెప్పడం, వారు వినక పోవడం సర్వ సాధారణంగా జరిగేదని తెలుస్తోంది. దీంతో పరువు పోతోందనే మనస్తాపంతో మక్సూదే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి కుటుంబానికి సంబంధం లేని మరో ముగ్గురు యువకులు ఎందుకు చనిపోయారనేది అంతుబట్టకుండా మారింది. 


ఒక్కొక్కటిగా తేలిన మృతదేహాలు..

ఎక్కడో పుట్టి జీవనోపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గొర్రెకుంటలోని సాయిదత్తా ట్రేడర్స్‌ ఆవరణలోని పాడుబడిన బావి నుంచి  ఒక్కొక్క మృతదేహాన్ని రెస్క్యూ టీం, స్థానికులు బయటకు తీస్తుంటే  స్థానికులు అయ్యో బిడ్డా అంటూ కన్నీరుపెట్టారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో శుక్రవారం పోలీసులు మోటార్‌లను పెట్టి తోడారు. దీంతో ఒక్కొక్కటిగా మృతదేహాలు కనిపించాయి.  ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతోపాటు క్లూస్‌టీం, ప్రత్యేక సిబ్బంది బావివద్దకు చేరుకొని ఘటనకు సంబంధించి పలు కోణాల్లో పరిశీలించారు. మృతులు నివాసం ఉండే గదులను నిశితంగా పరిశీలించారు. సంఘటన రోజు, అంతకుముందు ఏమి జరిగిందనే విషయమై చుట్టుపక్కల ఉన్న వారిని ఆరా తీశారు.  మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ సీఐ శివరామయ్య, పర్వతగిరి సీఐ కిషన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కిశోర్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ రవిందర్‌, ఎస్‌ఐలు, పోలీసులు విచారణలో పాలుపంచుకున్నారు. సంఘటన స్థలం వద్దకు స్థానికులే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.


మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి

బావిలో శవాలై తేలిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.  నగర శివారు గొర్రెకుంట గ్రామంలోని పాడుపడ్డ బావిలో శుక్రవారం లభ్యమైన ఐదుగురు కార్మికుల శవాలను పోలీసులు గుర్తించి వరంగల్‌ ఎంజీఎంకు మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం మంత్రి నేరుగా ఎంజీఎంకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఘటన వివరాలను కలెక్టర్‌ హరిత, సీపీ రవీందర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9మంది కార్మికులు బావిలో శవాలుగా మారడం భాదాకరమన్నారు. సీఎం ఆదేశాల మేరకు మృతులు బంధువులు మిత్రుల కోరిక మేరకు వారి అంత్యక్రియలు జరిపించటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని  పోలీసు అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా  లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నన్నపు నేని నరేందర్‌, దాస్యం వినయ్‌ భాస్కర్‌ చెరో రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. 

Advertisement
Advertisement