ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం లభించేనా ?

ABN , First Publish Date - 2021-08-03T05:53:34+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం లభించేనా ?

ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం లభించేనా ?

తాజా ఆదేశాలతో కదలిక 

ప్రత్యేక బృందాల ఏర్పాటుకు కసరత్తు

ఉమ్మడి జిల్లాలో 2 లక్షల దరఖాస్తులు


హన్మకొండ, ఆగస్టు 2  (ఆంధ్రజ్యోతి) : ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తుదారులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇళ్ల స్థలాల నిర్మాణానికి నగరపాలక, మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి కోసం పలువురు దరఖాస్తులు పెట్టుకున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో తిరిగి కదలిక మొదలైంది. 2020 ఆగస్టులో పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన పలు కారణాలతో వాయిదా పడింది. 2015లో కూడా ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అప్పటికే అనేక దరఖాస్తులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతి కోసం ఇళ్ల స్థల యజమానులు ఇప్పటికీ తిరుగుతున్నారు. కనీసం ఇప్పుడైనా అనుమతులు లభిస్తాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. 


హడావిడి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనను 15 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశా లు జారీచేయడంతో అధికారులు హడావిడి పడుతున్నారు. దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే 15 రోజుల గడువులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. ప్రాథమిక కసరత్తు కూడా మొదలు కాలేదు. కొత్త మార్గదర్శక సూత్రాల ప్రకారం లేఔట్లు,  ప్లాట్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, నీటి పారుదల శాఖ, పట్టణ ప్రణాళిక శాఖ సిబ్బందితో ఈ బృందాలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగంలోని సిబ్బందే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తీసుకొని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లేవారు. ఇప్పుడు నాలుగు శాఖలను భాగస్వామ్యం చేసింది. గతేడాది ఆగస్టు 31న జీవో నెంబర్‌ 131 జారీ చేసింది. దీని ప్రకారం 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు. జీవో జారీ చేసిన 45 రోజుల్లోగా దరఖాస్తులను దాఖలు చేయాలని పేర్కొన్నది.


2 లక్షలకుపైగా దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకుపైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో లక్షకుపైగా దరఖాస్తులు ఒక్క వరంగల్‌ మహానగర పాలక సంస్థకే వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది మునిసిపాలిటీలకు మరో 50వేలు, గ్రామ పంచాయతీలకు ఇంకో 50వేలు వచ్చాయి. 2015లో తొలిసారి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. అప్పుడు దరఖాస్తు ఫీజు రూ.10వేల చొప్పున వసూలు చేసిన ప్రభుత్వం.. తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.వెయ్యికి తగ్గించింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. తొలుత పురపాలక, నగర పాలక సంస్థల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు.


ఏ స్థలాలకంటే..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల సందర్భంగా స్థలాలకు అనుమతిచ్చే విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటికి ఎల్‌ఆర్‌ఎ్‌సకు అనుమతి ఇవ్వరు. అలాగే భూగరిష్ట పరిమితి చట్టానికి భిన్నంగా ఉన్నవి, సరిహద్దులు, మొదలైన వివాదాలు కలిగి ఉన్నవి, జీవో 111లో నిర్దేశిత ప్రాంతాలు, జలవనరులు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నవి, నాలాలకు 2 మీటర్ల లోపు, విమానాశ్రయాలు, రక్షణ, సైనిక ప్రాంతాలకు 500 మీటర్ల లోపు దూరం ఉన్నవి, బృహత్తర ప్రణాళికలో నిర్దేశించిన జోన్లు, రిక్రియేషన్‌ కోసం కేటాయించిన ప్రాంతాల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయరు. అనధికారిక లేఔట్లలో రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లను, కనీసం పది శాతం ప్లాట్లు రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా విక్రయించిన అనధికారిక లేఔట్లను, సేల్‌ డీడ్‌, లేదా టైటిల్‌ డీడ్‌ ఉన్నవాటికి ఎల్‌ఆర్‌ఎ్‌సకు ఆమోదం లభిస్తుంది. అగ్రిమెంట్‌ లేదా జీపీఏను పరిగణలోకి తీసుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లు, లే ఔట్లు ఉంటే కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

Updated Date - 2021-08-03T05:53:34+05:30 IST