మహమ్మారి పుట్టుకపై అప్పుడలా.. ఇప్పుడిలా.. చిక్కుల్లో ఆంథోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-06-04T22:07:23+05:30 IST

కొవిడ్-19 మొట్టమొదటి సారిగా 2019లో వెలుగులోకి వచ్చి.. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఇప్పటి వరకు కరోనా పుట్టుకకు సంబంధించిన విషయం

మహమ్మారి పుట్టుకపై అప్పుడలా.. ఇప్పుడిలా.. చిక్కుల్లో ఆంథోనీ ఫౌచీ

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 మొట్టమొదటి సారిగా 2019లో వెలుగులోకి వచ్చి.. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఇప్పటి వరకు కరోనా పుట్టుకకు సంబంధించిన విషయంపై స్పష్టత రాలేదు. కానీ తాజాగా మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి బయటికొచ్చిందంటూ బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారి వుహాన్ ల్యాబ్ నుంచే బయటికొచ్చిందనే వాదనలు బలపడుతున్నాయి. ఇదే సందర్భంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీపై విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహిర్గతమైన ఫౌచీ ఈమెయిల్స్ కూడా ఆయనపై విమర్శలకు ఆజ్యం పోస్తున్నాయి. చైనా ల్యాబ్‌లో ఏం జరుగుతుందో నిజంగానే ఆయనకు తెలియదా.. లేక అన్ని తెలిసి తేలు కుట్టిన దొంగలా మిన్నకుండి పోయారా? మహమ్మారి పుట్టుక విషయంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


కొద్ది రోజుల క్రితం ఫౌచీకి సంబంధించిన కొన్ని ఈమెయిల్స్ బయటికొచ్చాయి. వీటిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ మొదలైన తొలినాళ్లలో.. వుహాన్ ల్యాబ్‌లో మహమ్మారి అభివృద్ధి జరిగిందనే వాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇటీవల ఓ కార్యక్రమంలో మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు. ల్యాబ్ నుంచే వైరస్ బయటికొచ్చిందనే వాదనలను కొట్టిపారేయలేం అని పేర్కొన్నారు. ఆంథోనీ ఫౌచీకి ఇమ్యూనాలజిస్ట్ క్రిస్టియన్ జీ అండర్సన్ డాక్టర్ పంపిన మెయిల్‌లో వైరస్‌కు సంబంధించిన అంశాలను నిశితంగా పరిశీలిస్తే మహమ్మారి ల్యాబ్‌లో అభివృద్ధి చెందిందోమో అనిపిస్తుందంటూ సందేహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత ఆయనే దానికి విరుద్ధంగా నివేదిక ఇచ్చారు. వైరస్ ల్యాబ్‌లో లీకైందనడానికి ఆధారాల్లేవు అంటూ ఓ పత్రాన్ని సమర్పించారు. ఇదే సమయంలో కొవిడ్-19.. జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించి ఉండొచ్చనే వాదనను ఫౌచీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం.. ల్యాబ్ నుంచే లీక్ కొవొచ్చనే అనుమానాలను ఫౌచీ వ్యక్తం చేస్తున్నారు. 



ఇదిలా ఉంటే.. ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ యజమాని పీటర్ డెస్జోక్.. 2020 ఏప్రిల్ 20న ఫౌచీకి ఓ మెయిల్ పంపారు. ఈ మెయిల్.. ఫౌచీ వైఖరిపై కలుగుతున్న అనుమాలకు మరింత బలాన్ని ఇచ్చింది. ‘మా మిత్రులు, భాగస్వాముల తరఫున నిలబడినందుకు మీకు ధన్యవాదాలు. వైరస్ పుట్టుక సహజమైనదే అని మీరు వాదిస్తున్నారు. దీనివల్ల వైరస్ పుట్టుకపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు దూరం అవుతాయి’ అని పేర్కొన్నారు. ఎకోహెల్త్ అలయన్స్ యజమాని పంపిన మెయిల్‌ ఫౌచీపై అనుమానాలకు ఎందుకు కారణమైందనే విషయానికి వస్తే.. ఈ సంస్థకు వుహాన్ ల్యాబ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2014-19 మధ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి ఎకోహెల్త్ అలయన్స్ ద్వారా వుహాన్ ల్యాబ్‌కు 3.4మిలియన్ డాలర్లు వెళ్లాయి. 


అంతేకాకుండా ఆంథోని ఫౌచీ తన అసిస్టెంట్ హ్యూజ్ ఔచిన్‌క్లోస్‌కు గత ఏడాది ఫిబ్రవరి‌లో ఓ మెయిల్‌ను పంపి.. అందులో ఉన్న కరోనా వైరస్‌లపై చేసిన పరిశోధన పత్రాన్ని చదవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హ్యూజ్ ఔచిన్‌క్లోస్ స్పందించాడు. ‘విదేశాల్లో జరిగిన ఈ పరిశోధనకు మనకు ఏమైన సంబంధాలు ఉన్నాయేమో తెలుకుంటాను’ అని తెలిపారు. ఈ క్రమంలో నేషనల్ ఇన్‌ట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులను కరోనా వైరస్‌పై పరిశోధనకు ఉపయోగించొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిధులతో ల్యాబ్‌లో వైరస్‌ను అత్యంత ప్రమాదకరంగా మార్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. దీనిపై ఓ కార్యక్రమంలో ఫౌచీ మాట్లాడుతూ.. నమూనాల సేకరించేందుకు మాత్రమే ఎకో‌హెల్త్ ఫౌండేషన్‌కు నిధులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా తన మెయిల్స్‌ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వెల్లడించారు. 


Updated Date - 2021-06-04T22:07:23+05:30 IST