సంక్షోభంలోనూ నిరర్థక వ్యయాలా!

ABN , First Publish Date - 2021-09-09T06:04:56+05:30 IST

మునుపెన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో ఉభయ తెలుగురాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు, కంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి...

సంక్షోభంలోనూ నిరర్థక వ్యయాలా!

మునుపెన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో ఉభయ తెలుగురాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు, కంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాయి. అయినా ప్రభుత్వపెద్దలు, అధికారుల దుబారావ్యయాలు ఏమాత్రం తగ్గడం లేదు. వందలాది కార్ల కాన్వాయ్‌లలో, ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు, జన సమీకరణలలో భాగంగా వేలాదిమందికి ప్రజాధనంతో మాంసాహార విందులు, ఒకే కార్యాలయం నుంచి ఒకే గమ్యస్థానాలకు  వెళ్లే ఒక్కొక్క ఆఫీసరుకు ఒక్కో ప్రత్యేక వాహనం, జాయింట్‌ కలెక్టర్‌కు కానుకగా విలాసవంతమైన కార్ల కేటాయింపు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశలో ప్రచారార్భాటాలకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేస్తున్నారు. ఒక్క కేసులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులను సాధించలేని నిరర్ధక న్యాయవాదులకు కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వని సలహాదారుల వ్యవస్థపై వందల కోట్లు వ్యయం చేస్తున్నారు. 


అదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌కు అప్పుపుట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. లేకపోతే పాలసేకరణ, సహకార సంస్థలకు పోటీగా అమూల్‌ పాలసేకరణ వ్యవస్థకు సుమారు ముప్పైవేల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి మళ్లిపోయి ఉండేవి. ఇంతటి భారీ వ్యయంతో ఇప్పటికే ఉన్న పాల సహకార డెయిరీలకు అనైతిక పోటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమా?


ఇప్పటికే దాదాపు ప్రతి జిల్లాకు ఒక వైద్యకళాశాల ఉంది. వాటిలో చాలా కళాశాలలు నిధులు, సదుపాయాలు, అర్హులైన అధ్యాపకుల లేకపోవడం వంటి సమస్యలతో అల్లాడుతున్నాయి. కొన్ని గుర్తింపును కోల్పోయే దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కో వైద్య కళాశాలకు 100 ఎకరాల చొప్పున 25 ప్రతిపాదిత కాలేజీలకు 2500 ఎకరాలు, వాటి చుట్టూ ఏర్పడే జనావాసాలకు మరికొన్ని ఎకరాల సేద్యపు భూములలో వ్యవసాయం తుడిచిపెట్టుకు పోనుంది. ఈ ప్రతిపాదన కేవలం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ను సృష్టించడానికేనని విమర్శలు వినిపిస్తున్నాయి. దయనీయ ఆర్థికస్థితిలోకి జారిపోయిన తెలుగు రాష్ట్రాలు కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా వెచ్చించడం సమర్థనీయం కాదు.


లబ్ధిదారులలో కొత్త విధానాలు, కొత్త వినియోగాలపై ఆసక్తిని పెంచి ప్రోత్సహించడానికి, పారిశ్రామిక అభివృద్ధికి, విపత్తు సమయాలలో మాత్రమే ప్రజలను కాపాడడానికి పరిమితం కావలసిన సబ్సిడీలు, ఉచితాలను విచక్షణారహితంగా కొనసాగించడమే కాక, వాటి వ్యయభారాన్ని పన్ను చెల్లింపుదారుల మీద రుద్దటం సమంజసం కానే కాదు.


కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు ముందుచూపు లేకుండా ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలను, అవి నిష్ప్రయోజనమని తెలిసినా, రద్దు చేయలేని పరిస్థితుల్ని చూస్తున్నాం. ఇటువంటి పథకాల వల్లనే వెనిజులా వంటి దేశాలు అతి తీవ్ర ద్రవ్యోల్బణంతో పూర్తిగా దివాలా తీశాయని మన నేతలు, ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వానికి సంక్షేమం పట్ల శ్రద్ధ ఉంటే నానాటికీ అంతరించిపోతున్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి వారికి, కులవృత్తులపై ఆధారపడి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వారికి గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ల పెంపకం వంటి వ్యాపకాలను ప్రోత్సహించడానికి ఋణాలు, సబ్సిడీలు ఇవ్వవచ్చు. చేనేత పరిశ్రమలో ఉంటూ అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులకు పాడి పశువుల కొనుగోలుకు ఋణాలు, సబ్సిడీలు అందించవచ్చు. ఇందువల్ల ఈ వర్గాలలో అప్పుల బాధ భరించలేక జరిగే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయవచ్చు.


ఆన్‌లైన్‌ పాలనా సౌలభ్యం, ఈ-సేవ, ఈ-బ్యాంకింగ్‌, కంప్యూటర్లతో విశ్లేషణ, వీడియో వాట్సప్‌, సిసి కెమెరాలతో పర్యవేక్షణ, వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండగా, పరిపాలనా సౌలభ్యం సాకుతో జిల్లాల సంఖ్యను రెండుమూడు రెట్లు పెంచాలని ఆలోచించడంలో అర్థం లేదు. ఇందువల్ల భూదందాలు పెరిగిపోవడం, పాలనా వ్యయం రెండింతలు పెరగడం, సేద్యపు భూముల విస్తీర్ణాలు తగ్గిపోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.

డా. యం.వి.జి అహోబలరావు

Updated Date - 2021-09-09T06:04:56+05:30 IST