జల దిగ్బంధం

ABN , First Publish Date - 2021-09-08T07:44:06+05:30 IST

భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనాన్ని స్తంభింపజేసింది. ప్రత్యేకించి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది.

జల దిగ్బంధం

  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం 
  • హనుమకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటీమీటర్ల వర్షపాతం
  • నీట మునిగిన వరంగల్‌.. జలమయమైన రాజన్న సిరిసిల్ల జిల్లా
  • వరద ప్రవాహానికి గల్లంతైన మరో ముగ్గురు.. ఐదుగురి మృతి
  • జగిత్యాలలో వరదలో కొట్టుకుపోయి తండ్రీ కొడుకుల దుర్మరణం
  • వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు.. కాపాడిన సహాయక బృందాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనాన్ని స్తంభింపజేసింది. ప్రత్యేకించి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 38.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలో 25.34 సెంటీమీటర్లు, వేములవాడలో 21.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం దాకా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, ప్రాజెక్టుల నిండా నీరు చేరడం ఒకెత్తయితే.. భారీ వర్షం, వరదలకు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. పట్టణాలు, నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. పలు చోట్ల సహాయక బృందాలు వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లాలో వరదలో కొట్టుకుపోయి తండ్రీ కొడుకు మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో ఇంటి గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి జిల్లాలో ఇద్దరు యాచకులు ప్రాణాలొదిలారు. అదే జిల్లాలో వాగులో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు కాగా, సిరిసిల్లలో నాలాలో పడి ఒకరు, నిర్మల్‌ జిల్లాలో చేపల వేటకు వెళ్లి మరొకరు గల్లంతయ్యారు. 


నీటమునిగిన వరంగల్‌..

వరంగల్‌ నగరం మరోసారి ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయ. హంటర్‌రోడ్డు ప్రాంతంలోకి భద్రకాళి చెరువు నీళ్లు రావడంతో మొత్తం జలమయమైంది. స్థానికులను బోట్లతో నగర పాలక సంస్థ రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో నీరు ఇళ్ల్లలోకి చేరింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌(రామప్ప) మండలంలో 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్నవరం సరస్సులోని రెండో ఐలాండ్‌లోని ఆరు కాటేజీలలోకి నీరు చేరడంతో వాటిలో విడిది చేసిన పర్యాటకులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు.  పర్యాటక సిబ్బంది బోట్ల ద్వారా వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురంలో సమీపంలోని వాగు వరద ఉధృతి పెరగడంతో మొక్కజొన్న చేనులో చిక్కుకుపోయిన 12 మంది ఆదివాసీ రైతులు, కూలీలను స్థానికులు తాడు సాయంతో ఇవతలికి చేర్చారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లిలో 12.78 సెం.మీ, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెంలోని గోదావరి ఎగపోటు కారణంగా పర్ణశాలలో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగింది. అశ్వారావుపేట మండలం గుబ్బలమంగమ్మ వద్ద సోమవారం వరద తాకిడికి గల్లంతైన ఏపీకి చెందిన మహిళ మృతదేహం మంగళవారం పెంట్లం వద్ద లభ్యమైంది. అధిక వర్షాలకు ఇద్దరు యాచకులు అకాల మరణం పొందారు. టేకులపల్లిమండలంలోని శంభూనిగూడెంలో తాటి రాంబాబు(45) అనే రైతు పొలం నుంచి తిరిగి వస్తూ.. ఉధృతంగా ప్రవహిస్తున్న మొర్రేడువాగును దాటే ప్రయత్నంలో గల్లంతయ్యాడు. 


జలమయమైన కరీంనగర్‌..

కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, కరీంనగర్‌ పట్టణాలతోపాటు పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కోళ్ల ఫారాల్లోకి నీరు రావడంతో 14 వేల కోళ్లు చనిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాను 30 ఏళ్ల తర్వాత  వరద ప్రవాహం ముంచెత్తింది. నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయం మరోసారి నీట మునిగింది. సిరిసిల్ల పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఇండ్లలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సంజీవయ్యనగర్‌కు చెందిన దేవయ్య అనే వ్యక్తి వరదలో నాలాలో పడి గల్లంతయ్యాడు. పాతబస్టాండ్‌ వద్ద వరదనీటిలో చిక్కుకున్న స్రవంతి అనే గర్భిణిని ఎక్స్‌కావేటర్‌ సహాయంతో జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గర్భిణి శ్రావణి కుటుంబసభ్యులతో ఆటోలో సిరిసిల్ల ఆస్పత్రికి వస్తూ కొత్త చెరువు వరద ప్రవాహంలో చిక్కుకుపోగా.. అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తన వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సిరిసిల్లలో నీట మునిగిన ప్రాంతాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ముంపునకు గురైన ప్రాంతాల పరిస్థితిపై కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరా తీశారు. తక్షణమే సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో మూలవాగు ప్రవాహ ఉధృతి పెరగడంతో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి మరోసారి కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 22.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. 


తండ్రీ కొడుకుల మృతి 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట శివారులో వాగు కల్వర్టుపైనుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకుల గంగమల్లు(45), విష్ణువర్ధన్‌(6) అనే తండ్రీ కొడుకులు వరద నీటిలో కొట్టుకుపోయారు. ప్రవాహంలో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామ శివారులో గొర్లను మేతకు తీసుకెళ్లిన బాస సోమన్న(60), లక్ష్మణ్‌ (45), నేమూరి చిన్న ఆశన్న(60) వరదలో చిక్కుకున్నారు. అటవీ ప్రాంతంలో వీరు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి.. గజ ఈతగాళ్ల సహాయంతో మూడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను పంపించారు. పెగడపల్లి మండలంలో 19.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


నిజామాబాద్‌లో బీభత్సం..

నిజామాబాద్‌ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు కాలనీ ప్రజలు విలవిల్లాడిపోయారు. తమ రక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ నగరంలోని బైపాస్‌ రోడ్డు వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో గోడ కూలడంతో.. ఇంట్లో నిద్రిస్తున్న నిమ్మ నర్సవ్వ (35) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని గుండెగావ్‌ గ్రామం మళ్లీ ముంపునకు గురైంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా గ్రామస్థులందరినీ భైంసాలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లోకి తరలించారు. నర్సాపూర్‌(జి) టెంబుర్ని గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్‌ (28) అనే వ్యక్తి శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లోకి చేపల వేట కోసం వెళ్లి గల్లంతయ్యాడు. మెదక్‌ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత భవానీ ఆలయం జలదిగ్బంధమైంది. కాగా, రెండు రోజుల క్రితం న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ శివారులో మామిడి వాగులో కొట్టుకుపోయి చెర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్‌ (35) మరణించాడు. మరోవైపు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి ప్రధాన రహదారిపై ఉన్న వాగులో రంగు క్రిష్ణస్వామి అనే వ్యక్తి గల్లంతయి శవమై తేలాడు.


ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు 

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం ఐదు జిల్లాలు జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, సిరిసిల్లలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. 


నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన కుండపోత వాన.. రాష్ట్రంలో రికార్డుల మోత మోగించింది. 24 గంటల వ్యవధిలో కురిసే సాధారణ వర్షపాతం కేవలం 5.7 మిల్లీమీటర్లు ఉండగా.. ఏకంగా 6.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలే కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావం తెలంగాణపై మంగళవారంతో తగ్గిపోయిందన్నారు. అయితే ఉత్తర, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 


చితిపైనుంచి కొట్టుకుపోయిన మృతదేహం 

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో భారీ వరదలకు చితిపై నుంచి మృతదేహం కొట్టుకుపోయింది. గ్రామానికి చెందిన అరిగడ్డి రాజవ్వ (60) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందడంతో మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు గోదావరి ఒడ్డున గల శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చితి పేర్చి దహన సంస్కారాలు చేపట్టారు. అయితే పక్కనే ఉన్న గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మృతదేహం కాలుతుండగానే ఒక్కసారిగా మరింత పెరిగిన వరదతో చితితోపాటు మృతదేహం కూడా  కొట్టుకుపోయింది.


చండ్రుగొండలో జలమయమైన డబుల్‌ ఇళ్లు 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎదుళ్ల వాగు ఉప్పొంగడంతో చండ్రుగొండలో ఆ వాగు ఒడ్డున పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి మూడేళ్లవుతున్నా.. ఇప్పటికీ పూర్తికాలేదు. ఇలా ఇవి నీట మునగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 


లక్ష ఎకరాల్లో పంటనష్టం

గడిచిన 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. తాజాగా నీట మునిగిన పత్తి, వరి, కంది, సోయాబీన్‌తోపాటు ఇతర పంటలపై క్షేత్రస్థాయిలో ఏఈవోలు నివేదికలు తయారు చేస్తున్నారు. ఖమ్మంజిల్లాలో 1,721 ఎకరాల్లో వరి, పత్తి, తదితర పంటలకు నష్టం జరిగినట్టు గుర్తించగా, మరో వెయ్యి ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 4397 హెక్టార్లలో వరి, వేరుశనగ, పత్తి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల ఎకరాల వరకు పంటలు నీటమునిగాయి. 

Updated Date - 2021-09-08T07:44:06+05:30 IST