పోలవరం అప్రోచ్‌ చానల్‌ నుంచి నీరు

ABN , First Publish Date - 2021-06-12T09:29:59+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అప్రోచ్‌ చానల్‌ నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలను అధికారులు శుక్రవారం ప్రారంభించారు, ప్రాజెక్టు వద్ద గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్‌ ద్వారా స్పిల్‌వేలోకి మళ్లించేందుకు జలవనరుల శాఖ

పోలవరం అప్రోచ్‌ చానల్‌ నుంచి నీరు

రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్‌ చానల్లోకి.. అక్కడి నుంచి సహజ ప్రవాహంలోకి జలాలు


పోలవరం, జూన్‌ 11: పోలవరం ప్రాజెక్టు అప్రోచ్‌ చానల్‌ నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలను అధికారులు శుక్రవారం ప్రారంభించారు, ప్రాజెక్టు వద్ద గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్‌ ద్వారా స్పిల్‌వేలోకి మళ్లించేందుకు జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ అధికారులు పూజలు జరిపారు. అనంతరం అప్రోచ్‌ చానల్‌కు, గోదావరి నదికి మధ్య ఉన్న గట్టును జేసీబీల ద్వారా తవ్వించి నీటిని స్పిల్‌ వే అప్రోచ్‌ చానల్‌లోకి విడుదల చేశారు. అవి అక్కడి నుంచి స్పిల్‌ వే రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్‌ చానల్లోకి.. అక్కడి నుంచి గోదావరి నది సహజ ప్రవాహంలోకి ప్రవహిస్తున్నాయి. ఇవి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి చేరి అక్కడ నుంచి సెంట్రల్‌ డెల్టాతోపాటు తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలోని పంట భూములకు నీరందుతుందని అధికారులు తెలిపారు. స్పిల్‌వే రివర్‌ స్లూయిజ్‌, పవర్‌ హౌస్‌ విడుదల ద్వారా బ్యారేజీల నుంచి కాల్వలకు నీరు చేరుతుంది. కానీ ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణలో ఉండగానే డెల్లాకు నీరు చేరడం వల్ల ప్రాజెక్టు తొలి ఫలితం అందినట్లు అయిందని అధికారులు తెలిపారు. 6.6 కిలోమీటర్ల మేర స్పిల్‌వే అప్రోచ్‌ చానల్‌ నుంచి గోదావరి సహజ ప్రవాహం వరకు నీటిని మళ్లించ టం అరుదైన విషయమన్నారు. 


దేశంలోనే రెండో పెద్ద నదిగా చెబుతున్న గోదావరిపై ఇలాంటి పని చేయడం సాహసమేనని ఉద్ఘాటించారు. ప్రధాన డ్యాం పనులు పూర్తయ్యే వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కర ఘాట్‌, తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు, తాగునీరు అప్రోచ్‌ చానల్‌ ద్వారానే విడుదల కానున్నాయి. ఇక నుంచి ఏడాది పొడవునా నీటిని అప్రోచ్‌ చానల్‌ ద్వారా మళ్లించి గోదావరి సహజ ప్రవాహంలోకి కలుపుతారు. ఎగువ కాఫర్‌ డ్యాం మూసివేశారు. దిగువ కాఫర్‌ డ్యాం కూడా పూర్తి స్థాయిలో మూసివేసి ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు ప్రారంభించనున్నారు. రానున్న వర్షాల సీజన్‌లో 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా.. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా అప్రోచ్‌ చానల్‌ పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-12T09:29:59+05:30 IST