ఇటలీని హైదరాబాద్‌కి తీసుకొచ్చాం!

ABN , First Publish Date - 2022-03-06T05:50:59+05:30 IST

చిత్రసీమంటేనే ‘కళా’త్మక రంగం.దర్శకుడి కథనీ, కెమెరామెన్‌

ఇటలీని హైదరాబాద్‌కి తీసుకొచ్చాం!

చిత్రసీమంటేనే ‘కళా’త్మక రంగం.దర్శకుడి కథనీ, కెమెరామెన్‌ కలనీ, తన కుంచెలోంచి చూసి, దానికి కళాత్మకమైన మెరుగులు దిద్దడం కళా దర్శకుడి బాధ్యత. ఈ విషయంలో రవీందర్‌ వెండి తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ‘మగధీర’, ‘ఈగ’, ‘మర్యాద రామన్న’, ‘భాగమతి’.. ఈ చిత్రాల్లో కళా దర్శకుడిగా తన నైపుణ్యం చూపించి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఎదిగారు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ చిత్రంకోసం పనిచేశారు. ఈ సినిమా  కోసం ఇటలీని హైదరాబాద్‌ తీసుకొచ్చారాయన. ఆ ప్రయోగం ఎలా జరిగిందో ఆరా తీసింది నవ్య.


 మీరు పనిచేసిన ‘మగధీర’ లాంటి చిత్రాల తరవాత సెట్స్‌కి భారీ బడ్జెట్‌ కేటాయించడం మొదలైంది. ఈ మార్పుని మీరెలా చూస్తారు? 

మీరన్నట్టు ‘మగధీర’ తరవాత ఆర్ట్‌ విభాగానికి ఇది వరకు లేని గుర్తింపు వచ్చింది. ఓరకంగా అది మంచి సంకేతం. ఆ క్రెడిట్‌ నాకు దొరకడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఏ సినిమాకైనా ఆర్ట్‌ విభాగం చాలా ముఖ్యం. ఓ కథకు కావాల్సిన విజువల్‌ క్రియేట్‌ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కళా దర్శకుడికి ఉంది. ఉదాహరణకు ఓ కిటికీ దగ్గర భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు అన్నారనుకోండి. ఆ కిటికీకి ఓ కర్టెన్‌ చేరుస్తా. అందులోంచి చల్లని గాలి వీస్తుంది. అలా.. ఓ సౌండ్‌ క్రియేట్‌ చేయడానికి నేను స్పేస్‌ ఇస్తాను. పెద్దపెద్ద హాలీవుడ్‌ చిత్రాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ వర్క్‌ ఇలానే మొదలవుతుంది. ఓ కథని కొత్త కోణంలో చూపించడానికీ, చెప్పడానికీ కళా దర్శకుడు చాలా ఉపయోగపడతాడు. తన సృజనకు తగిన బడ్జెట్లు ఇప్పుడు దొరకడం, తన ప్రతిభని గుర్తించగలడం సంతోషాన్ని కలిగిస్తుంటుంది.


సాంకేతిక విషయంలో  బాలీవుడ్‌ స్థాయిని అందుకోగలుగుతున్నాం. మరి ఆర్ట్‌ విభాగంలో ఎక్కడ ఉన్నాం? 

ఆర్ట్‌లో చాలా వరకూ అడ్వాన్స్‌ అయ్యాం. కానీ టెక్నికల్‌గా ఇంకొంచెం మెరుగవ్వాలి. మనం మంచి మంచి సెట్స్‌ వేస్తున్నాం. మంచి క్యాలీటీ ఇస్తున్నాం. దానికి టెక్నికల్‌ సపోర్ట్‌ దొరికితే ఇంకా అద్భుతాలు చేయొచ్చు. బడ్జెట్‌ని, సమయాన్ని కంట్రోల్‌ చేయొచ్చు. ఇప్పటికీ పాత పద్ధతులనే ఫాలో అవుతున్నాం. ఆ ఓల్డ్‌ స్కూల్‌ మార్చాలి. ఇది చేయగలిగితే మరో మార్పునకు నాంది పలికేవాళ్ళం అవుతాం.




ఓ సినిమా హిట్టయితే కళా  దర్శకుడికి రావాల్సిన పేరు వస్తోందా?

నా వరకూ చూస్తే.. నా సినిమాల్లో కనిపించేది సెట్టా? లేదంటే రియల్‌ లొకేషనా? అనేది తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాను. అందుకే.. పెద్దగా గుర్తింపు రాదేమో? కొన్ని కొన్ని సార్లు...దర్శకుడే ఆర్ట్‌ డైరెక్టర్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడేమో అనిపిస్తుంటుంది. ఒక క్లాప్‌ బోర్డ్‌ కావాలంటే రాత్రికిరాత్రి ఫోన్‌ చేసి ఆర్ట్‌ డైరెక్టర్‌ని అడుగుతారు. క్లాప్‌ బోర్డ్‌లో ఏముంది? అది ఎక్కడైనా దొరికేస్తుంది. కొనుక్కుని అయినా తీసుకొని రావచ్చు. అదే ఓ పోస్టర్‌ డిజైన్‌ చేసేటప్పుడు మమ్మల్ని అడగరు. అది కూడా ఆర్టే కదా? ఆ ఓల్డ్‌ స్కూల్‌ నుంచి దర్శకులు బయటికి వేస్త మాలాంటి వాళ్ళు బయటికి వస్తారు.

టాలీవుడ్‌లో ‘ప్రొడక్షన్‌ డిజైనర్‌’ అని టైటిల్‌ కార్డు వేసుకున్నది మీరే. ఆర్ట్‌ డైరెక్టర్‌ నుంచి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా మారడం వల్ల ఎన్ని బాధ్యతలు పెరుగుతాయి?

ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ అనేదిహాలీవుడ్‌ లో ఎప్పటి నుంచో వుంది. అది చాలా పెద్ద బాధ్యత. ఓ రకంగా చెప్పాలంటే దర్శకుడి తరవాతి స్థానం తనదే. ఓ సినిమా టింజ్‌ని నిర్ణయించే వ్యక్తి ప్రొడక్షన్‌ డిజైనర్‌. దర్శకుడు ఓ కథ చెప్పిన తర్వాత కెమెరామెన్‌, సౌండ్‌ డిజైనర్‌లతో ప్రయాణం చేయాలి. కథకు సంబఽధించిన లొకేషన్స్‌, నటీనటులు, కాస్ట్యుమ్స్‌, మేకప్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ తన ప్రమేయం ఉంటుంది.  

 కథ విన్నప్పుడు ఎక్కడ సెట్‌ వేయాలి? ఎక్కడ వేయకూడదు అనే జడ్జ్‌మెంట్‌ ముఖ్యం కదా ? సన్నివేశం ప్రకారం ఒక ఇంట్లో 15 రోజుల పాటు షూటింగ్‌ చేయాలి అనుకుందాం. దాన్ని రియల్‌ లొకేషన్‌లో తీయాలంటే 50 లక్షల బడ్జెట్‌ అవుతుందని అనుకుంటే, ఆ యాభై లక్షల్లో సెట్‌ వేయగలం అనిపిస్తే.. సెట్లో ఆ సీన్లు తీయడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే.. రియల్‌ లొకేషన్లలో లేని కొన్ని సౌలభ్యాలు సెట్లో దొరుకుతాయి. రియల్‌ లొకేషన్‌లో సగానికి సగం కాంప్రమైజ్‌ అవుతున్నారు. సెట్‌లో వంద శాతం సంతృప్తి దొరుకుతుంది. 



రియల్‌ లొకేషన్‌ లో ఆర్ట్‌ డైరెక్టర్‌ కి ఏం పని ?

రియల్‌ లోకేషన్‌లో పని వుండదనే ప్రశ్నే లేదు. మనకి ఇచ్చిన డబ్బుకి సిన్సియర్‌గా పని చేయాలంటే ఎక్కడైనా పని వుంటుంది. రియల్‌ లొకేషన్‌లో మనకి కావాల్సింది వుందని అనుకుంటాం, కానీ అక్కడ కొంచెం సమయం, కొంచెం తెలివిని వాడితే విజువల్‌ అవుట్‌ పుట్‌ మరో స్థాయిలో వుంటుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ సినిమాలో ప్రతి చోటా అవసరమే.

రెప్లికా వుండటానికి లేకపోవడనికి తేడా వుంటుందా?

ఉన్నదాన్ని మళ్ళీ క్రియేట్‌ చేయడం రెప్లికా. చార్మినార్‌ అంటే చార్మినార్‌ లానే వేయాలి. చూస్తున్న ప్రేక్షకుడికి అది చార్మినారే అనిపించాలి. కొత్త సెట్‌ క్రియేట్‌ చేయడం కూడా కష్టమైన పనే. ఇక్కడ చేేస పని సెన్సిబుల్‌గా వుండాలి. ఒక కొత్త కార్‌ని డిజైన్‌ చేయాలంటే.. ఆ డిజైన్‌ నమ్మదగినదిగా వుండాలి. ఇదేదో బావుందే అన్నట్లు వుండాలి. అలా కాకుండా ప్రామాణికంగా లేని ఓ డిజైన్‌ చేేస్త... చూసిన ప్రేక్షకుడికి అర్దమైపోతుంది. 

రాధే శ్యామ్‌ లో కష్టంగా అనిపించిన ఎపిసోడ్‌ ఏంటి ? 

క్లైమాక్స్‌నే. అందుకోసం 432 అడుగుల షిప్‌ లో షూట్‌ చేయాలి. దానికి సరిపడా వాటర్‌, బాడీ, దానికి టెక్నాలజీ, సిస్టం ఇలా చాలా కావాలి. ఆ ఎపిసోడ్‌ని ఇటలీ లేదా బల్గేరియాలో షూట్‌ చేద్దామనుకున్నాం. కానీ దాన్ని సింపుల్‌ఫై చేసి హైదరాబాద్‌లోనే చేశాం. 

 అన్వర్‌




మర్యాద రామన్న కోసం మీరు ఓ పెద్ద ఇంటి సెట్‌ వేశారు. దానికి పేటెంట్‌ వచ్చింది. ఓ సెట్‌కి పేటెంట్‌ రైట్స్‌ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి?

అది చాలా పెద్ద ప్రోసెస్‌ అండీ. మనం ఓ సెట్‌ వేస్తే, అలాంటి సెట్‌ ఈ భూ ప్రపంచంలోనే ఎవరూ వేయలేదని, ఎక్కడా ఇలాంటి సెట్‌ని పోలిన వస్తువు, ఆకృతి లేదని నిరూపిస్తే అప్పుడు పేటెంట్‌ రైట్స్‌ వస్తాయి. దానికోసం కొన్ని కంపెనీలు పనిచేస్తుంటాయి. వాళ్లు వచ్చి, మన సెట్‌ చూసి, ఓ రిపోర్ట్‌ తయారు చేస్తారు. ఆ తరవాత ఆరేడు నెలలు ఆ సెట్‌పై రీసెర్చ్‌ జరుగుతుంది. ‘ఇలాంటి సెట్‌ ఇదివరకు ఎక్కడా వేయలేదు’ అనుకుంటే, అప్పుడు పేటెంట్‌ ఇస్తారు. 

మీ వర్క్‌ మీరు తెరపై చూసుకుని  మీరే సర్‌ప్రైజ్‌ అయిన సందర్భాలున్నాయా?

సాధారణంగా ఎవరికీ పూర్తిస్థాయి సంతృప్తి దొరకదు. ఎక్కడో ఏదో ఓలోపం కనిపిస్తుంటుంది. అందుకే నాకు నేను పూర్తి మార్కులు వేసుకోను. కానీ ‘రాధే శ్యామ్‌’ విషయంలో మాత్రం నన్ను నేను బాగా మెచ్చుకున్నా. ఓరోజు అన్నపూర్ణ స్డూడియోలో షూటింగ్‌ చేస్తున్నాం. ఇటలీ నేపథ్యంలో ఓసీన్‌ తీస్తున్నారు. నేను మానేటర్‌ దగ్గర కూర్చున్నా. ఆ టీవీలో సీన్‌ చూస్తుంటే.. ‘ఇటలీలోనే ఉన్నాం’ అనే ఫీలింగ్‌ వచ్చింది. టీవీ నుంచి చూపు మరల్చి పైకి చూస్తే... అన్నపూర్ణ స్డూడియో పైకప్పు కనిపిస్తోంది. ఒకేచోట, ఒకేసారి ఇటలీ, హైదరాబాద్‌ పక్క పక్కన చూస్తున్న ఫీలింగ్‌ వచ్చింది. మరోరోజు షూటింగ్‌ కోసం ఇటలీ నుంచి కొంతమంది ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. అందులో ఓ పెద్దాయన ‘ఈ సినిమాకి ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎవరూ’ అంటూ మా దగ్గరకు వచ్చారు. ‘నేనే.. ఏమైంది’ అని అడిగా. ‘చాలా గొప్ప వర్క్‌ చేశారు. నేను ఇటాలియన్‌ని. అక్కడి సంప్రదాయాల్ని, స్టైల్‌నీ మీరు బాగా పట్టుకున్నారు’ అని మెచ్చుకున్నారు. ఆ రోజు చాలా హై వచ్చింది.




రైలు, ఓడ, విమానం...


‘‘రాధేశ్యామ్‌ ఇటలీ నేపథ్యంలో సాగే కథ. కొన్ని కీలకమైన సన్నివేశాలు ఇటలీలో తీశాం. అయితే... కరోనా వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. మళ్లీ ఇటలీ వెళ్లి షూటింగ్‌ చేసే పరిస్థితి కనిపించలేదు. దాంతో హైదరాబాద్‌లోనే ఇటలీని పోలిన సెట్లు వేయాల్సివచ్చింది. ఈ కథలో రైలు కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇటలీలో ఓ ట్రైన్‌లో కొన్ని సీన్లు తీశాం. అయితే మాకు కావల్సినప్పుడల్లా ఆ ట్రైన్‌ అందుబాటులో ఉండేది కాదు. అందుకే హైదరాబాద్‌లోనే ట్రైన్‌ సెట్‌ వేసి, అందులోనే ఆయా సన్నివేశాలు పూర్తి చేద్దామనిపించింది. ‘రాధేశ్యామ్‌’ కోసం హైదరాబాద్‌లో ఎన్ని సెట్లు వేశామో లెక్కేలేదు. వెండి తెరపై సినిమా చూస్తుంటే, ఏది సెట్లో, ఏది ఇటలీలోని నిజమైన లొకేషనో అర్థంకాదు. 4 ట్రైన్లు, ఓ షిప్‌, ఓ చాపర్‌ ఈ సినిమా కోసం సృష్టించాం. కేఫ్టేరియా సెట్‌ చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఒక్క షిప్‌ సెటప్‌ తప్ప మిగిలిన సెట్లన్నీ అన్నపూర్ణ స్డూడియోలోనే వేశాం. షిప్‌కి సరిపడా సెటప్‌ వేయడానికి మన దగ్గర సరైన సదుపాయాలు లేవు. కొన్ని ఫారెన్‌ స్డూడియోల్లో షిప్‌ సెటప్‌లు ఉంటాయి. అక్కకి వెళ్లి షూటింగ్‌ చేద్దామనుకున్నాం. కానీ నేను మాత్రం షిప్‌ సెట్‌ని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఐదు ఫ్లోర్లు అద్దెకు తీసుకుని, మూడు నెలలు పాటు శ్రమించి, షిప్‌ సెట్‌ వేశా. క్లైమాక్స్‌ మొత్తం ఈ సెట్లోనే జరుగుతుంది.  


ఇప్పటి వరకూ పిరియాడిక్‌ చిత్రాలు చాలా వచ్చాయి. కానీ ‘రాఽధే శ్యామ్‌’ లాంటి సినిమా మాత్రం రాలేదు. మొదటిసారి ఒక ఫారిన్‌ కంట్రీ వింటేజ్‌ ని మనం రిప్లికా చేసి చూపిస్తున్నాం. చరిత్రలో మనమే మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇటలీ లాంటి దేశాన్ని రిప్లికా చేయడం చాలా కష్టం. ఆర్ట్‌ పుట్టిందే ఇటలీలో. ప్రపంచంలో హేమాహేమీలైన కళాకారులు అక్కడ పుట్టారు. ప్రపంచంలోని ప్రతి పురాతన భవనంపై ఇటలీ ప్రభావం వుంటుంది. అలాంటి దేశాన్ని మనం రిప్లికా చేయడం చాలా కష్టం. 


Updated Date - 2022-03-06T05:50:59+05:30 IST