బాలిక మృతి మిస్టరీని ఛేదించకపోతే డీజీపీని కలుస్తాం

ABN , First Publish Date - 2020-07-11T09:25:56+05:30 IST

బాలిక (17) అనుమానాస్పద మృతి మిస్టరీని వెంటనే ఛేదించకపోతే డీజీపీని కలుస్తామని, అవసరమైతే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక

బాలిక మృతి మిస్టరీని ఛేదించకపోతే డీజీపీని కలుస్తాం

అవసరమైతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి 

అంబేద్కర్‌ రాజగృహంపై దాడిని దేశద్రోహం కేసుగా నమోదుచేయాలి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ 


ఖమ్మం చర్చికాంపౌండ్‌/కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూలై 10 : బాలిక (17) అనుమానాస్పద మృతి మిస్టరీని వెంటనే ఛేదించకపోతే డీజీపీని కలుస్తామని, అవసరమైతే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన ఆయన తొలుత ఖమ్మం జడ్పీసెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహం కేసుగా నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో అంబేద్కర్‌ ఇంటికి పూర్తి రక్షణ కలిపించాలని, అంబేద్కర్‌ కుటుంబీకులకు అత్యున్నత రక్షణ కలిపించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కొత్తగూడెం వెళ్లిన  ఆయన కొత్తగూడెం గంగాభీషన్‌ బస్తీలోని బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక మృతి వివరాలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి తెలుసుకున్నారు. బాలిక మృతిచెంది 17 రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు విచారణ వేగవంతం చేయడంలేదని ప్రశ్నించారు.


గత నెల జూన్‌ 24న తేదీ తెల్లవారుజామున చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్‌, బేరియం తండా వద్ద రైల్వే ట్రాక్‌పై బాలిక విగత జీవిగా అనుమానాస్పద స్థితిలో పడి ఉండటం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలీసులు, ఓ ఐపీఎస్‌ పోలీస్‌ అధికారి సహా ఈ కేసును విచారిస్తున్నట్లు తెలుస్తున్నా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం శోచనీయమన్నారు. రైల్వే ట్రాక్‌పై ఆమెది హత్య అనే ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, కానీ పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా విచారణ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రెండు సార్లు పోస్టుమార్టం చేశారని, రీ పోస్టుమార్టం రిపోర్టును బట్టి ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. అనాగరిక వర్గాల మహిళలకు, ఆడ పిల్లలకు ఇలాంటి దాడులను చేస్తే ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని, కానీ ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మరో వారం రోజుల్లో ఈ కేసును ఛేదించకపోతే ప్రభుత్వం సీబీఐకి ఈ కేసును అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బచ్చలకూర వెంకటేశ్వర్లు, తూరుగంటి అంజయ్య మాదిగ, గాజుల నర్సింహారావు, ఎమ్మార్పీఎస్‌ భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు మదార్‌సాహెబ్‌, అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌, గురునాథం, కొత్తపల్లి సోమయ్య, రత్న కుమారి, కృపావేణి, గాయత్రి, జంపన్న, రవి, తదితరులున్నారు. 

Updated Date - 2020-07-11T09:25:56+05:30 IST