బస్సులు ఆపేస్తాం

ABN , First Publish Date - 2022-01-27T07:43:08+05:30 IST

పీఆర్‌సీ సాధన సమితి ఏ క్షణం పిలుపునిచ్చినా బస్సులు ఆపేసి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎ్‌సఆర్టీసీలో అతిపెద్ద ఉద్యోగ సంఘమైన ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ రద్దు, పాత పెన్షన్‌..

బస్సులు ఆపేస్తాం

  • జేఏసీ పిలుపునిస్తే మరుక్షణమే సమ్మెలోకి 
  • ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి 
  • సంఘాల నేతలను అరెస్టు చేయొచ్చు: బండి 
  • ఉద్యమానికి ఆర్టీసీ సంఘాలు వజ్రాయుధాలు 
  • సరైన సమయంలో వాడతాం: బొప్పరాజు


అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ సాధన సమితి ఏ క్షణం పిలుపునిచ్చినా బస్సులు ఆపేసి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎ్‌సఆర్టీసీలో అతిపెద్ద ఉద్యోగ సంఘమైన ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ రద్దు, పాత పెన్షన్‌ అమలవుతుందని ప్రభుత్వంలో విలీనమైతే అవి ఇవ్వకపోగా అమల్లో ఉన్న సదుపాయాలను కూడా తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. యూనియన్‌ జిల్లాల ప్రతినిధులతో ఎన్‌ఎంయూ రాష్ట్ర నేతలు బుధవారం సమావేశమై పీఆర్సీ ఉద్యమంలో చేరి సమ్మెకు సై అన్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు మాట్లాడారు. పీఆర్సీ సాధన సమితి పోరాటంలో తామూ భాగస్వాములమేనని, ఎప్పుడు పిలుపొస్తే ఆ క్షణం నుంచే సమ్మెలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 


రివర్స్‌ పీఆర్సీతో పెద్ద ద్రోహం: బండి 

ప్రభుత్వంలో విలీనంతో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిందని ఏపీఎన్జీవోల సంఘం నాయకుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య అయితే ఆర్టీసీ సిబ్బందికి వేతన వ్యత్యాసం, ఉన్న వైద్య సదుపాయం కోల్పోవడం, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌ లాంటివి ఆపేయడం వంటివి ఇంకా చాలా ఉన్నాయన్నారు. పీటీడీ సిబ్బందికి ఈహెచ్‌ఎస్‌ కార్డులతో ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని, పోలీసులు సైతం వాటిని తగులబెట్టాలని బండి పిలుపునిచ్చారు. కొత్త జీతాలు వద్దంటున్నా ఇస్తామంటోన్న ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని, రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులకు పెద్ద ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగులపై దాడి చేయవచ్చని, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేయించవచ్చని బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్‌సీ సాధించే వరకూ బెదిరే ప్రసక్తే ఉండబోదన్నారు. 


ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేం: బొప్పరాజు 

ప్రభుత్వ దుర్మార్గాన్ని ఇన్నాళ్లూ భరించామని, ఇంకా తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. నివేదికను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వం భయపడుతోందని, ప్రజలకు అన్నీ తెలుసన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నివిధాలా అన్యాయం జరిగిందని, విలీనంతో రెండు విధాలా నష్టపోయారన్నారు. ఈహెచ్‌ఎస్‌ కూపంలోకి దిగొద్దని ఆర్టీసీ కార్మికులకు ముందే చెప్పామని, సూపర్‌ స్పెషాలిటీలో ఉన్న వైద్యాన్ని వారు కోల్పోయారన్నారు. పీటీడీ సిబ్బందికి అన్ని విధాలా న్యాయం జరిగే వరకూ జేఏసీ అండగా ఉంటుందన్నారు. ఉద్యమానికి వజ్రాయుధమైన ఆర్టీసీ సంఘాలను సరైన సమయంలో రంగంలోకి దించుతామన్నారు. 

Updated Date - 2022-01-27T07:43:08+05:30 IST