Abn logo
Mar 18 2020 @ 00:25AM

గొర్రెలతో సంపద, సాధికారిత

ప్రపంచంలో ఎక్కడా లేని గొర్రెల జాతి తెలంగాణలో మాత్రమే ఉంది. పశుసంపద అభివృద్ధిలో, మాంసోత్పత్తుల్లో పారిశ్రామికీకరణ జరగాలి. ఇందుకు తగిన సాంకేతికత, మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు గొర్రెల పరిశోధనాకేంద్రం ఒక దానిని తక్షణమే స్థాపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.


తెలంగాణలో ఆర్థిక విప్లవానికి గొర్రెలు నాంది కానున్నాయా? లక్షలాది కుటుంబాలను ధనవంతులను చేయబోతున్నాయా? స్థానికంగా ఆహార సమస్యను తీర్చడమే కాక, ఎగుమతుల్లోనూ తెలంగాణ మాంసోత్పత్తులు డిల్లెం-బల్లెం మోగించనున్నాయి. గొర్రెల పంపిణీ పథకం కింద టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడున్నర లక్షల గొల్ల, కురుమ (యాదవ) కుటుంబాలకు  74 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి  రాష్ట్రంలో గొర్ల సంఖ్య 12.1 మిలియన్లు మాత్రమే. ఈ పథకం అమలుతో ఆ సంఖ్య పెరిగింది. 2019లో కేంద్రం నిర్వహించిన 20వ పశుగణన ప్రకారం తెలంగాణలో 19.1 మిలియన్ల గొర్రెలున్నాయి. వీటి సంఖ్య ప్రస్తుతం 2 కోట్లకు పైగా పెరిగింది. ఈ విధంగా పశు సంపదకు కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణ మాంసోత్పత్తులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాలంటే వ్యవసాయాన్ని పారిశ్రామిక రంగంగా మార్చాలి. రాజకీయ నిర్ణయం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ, పెట్టుబడులు అందిస్తే ప్రైవేటు రంగం, ప్రజా భాగస్వామ్యం అల్లుకు పోగలవు.


తాజా పశుగణన ప్రకారం తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాలు గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాలుగా తేలాయి. కానీ, పశు సంవర్ధక సంబంధ సాంకేతిక సంస్థలు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్ర అవికానగర్‌లో సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌, హిమాచల్‌ ప్రదేశ్ గర్శలోని నార్తరన్ టెంపరేట్ రీసెర్చ్ స్టేషన్, ఉత్తర ప్రదేశ్‌లోని మఖ్దూంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్‌ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి ఒక సంస్థ లేకపోవడం మనకు వెనుకబాటుగానే ఉంది. గతంలోనూ, ఇప్పుడూ కేంద్రంలో అధికారం నెరపిన ప్రభుత్వాలు, అధికార పార్టీలు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోక పోవడం వల్లే ఇటువంటి నష్టాలెన్నో కలిగాయి. కాబట్టి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ, తెగింపు ప్రదర్శిస్తే ఈ రంగంలో అద్భుతాలు ఆవిష్కరించగలం. ప్రపంచంలో ఎక్కడా లేని గొర్రెల జాతి తెలంగాణలో మాత్రమే ఉంది. అదే, డెక్కన్ బ్రీడ్ (నల్ల గొర్రె) నెల్లూరు గొర్రె, జుడిపి గొర్రె. పశుసంపద అభివృద్ధిలో, మాంసోత్పత్తుల్లో పారిశ్రామికీకరణకూ ఇక్కడ అవకాశం ఉంది. అందుకని, వ్యాపారాభివృద్ధికి తగిన సాంకేతికత, మార్కెట్లను అభివృద్ధి చేసే ఒక సంస్థను స్థాపించడం తక్షణావసరం. గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడం వలన మాంసం ఉత్పత్తితో పాటు వీటికి సంబంధించిన ఫార్మా కంపెనీలు వస్తాయి, వీటి వలన యువతకు ఉపాధి సైతం దొరుకుతుంది.


మన ముఖ్యమంత్రి ఇంతకు ముందే తెలంగాణ మాంసోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి అభివృద్ధి చేసి, గొల్ల కురుమ కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేస్తామని ప్రకటించి ఉన్నారు. దీనితో గొల్ల కురుమ (యాదవ) కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నింపుతామని, గ్రామాలలో ఆర్థిక విప్లవం వస్తుందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ కూడా రాష్ట్రంలో ‘పింక్‌ రెవల్యూషన్‌ (మాంసోత్పత్తి ఉద్యమం)’ సాధిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం సంస్థను మంజూరు చేయడంలో తాత్సారం చేస్తే, ముందుగా అటువంటి సంస్థను రాష్ట్రమే ప్రారంభించి ఆ తరువాత జాతీయ సంస్థగా మార్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి నుండి ఆర్థిక నిధులు పొందవచ్చు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు పొందే అవకాశాలున్నాయి.


నల్ల గొర్రె (డెక్కన్ బ్రీడ్) మన దగ్గర తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విజర్లాండ్, తదితర దేశాలు మనకు ఆర్థిక, సాంకేతిక సహకారాలు అందిస్తాయి.


తెలంగాణలో దాదాపు 7 లక్షల గొల్ల, కురుమ (యాదవ) కుటుంబాలున్నాయి. ఇప్పటికే మూడున్నర లక్షల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగింది. మిగతా మూడున్నర లక్షల కుటుంబాలకు రెండో దశలో భాగంగా ఈ జూన్‌ నుంచి గొర్లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం 


అవుతుంది. దానితో గొర్రెలు సంఖ్యాపరంగా మరింత వృద్ధి కానున్నాయి. దీనితో మాంసోత్పత్తీ గణనీయంగా, భారీ ఆదాయాన్ని తెచ్చేదిగా విస్తరించనుంది. మాంసోత్పతుల వల్ల లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గానీ, వ్యాపార అవకాశాలు గానీ, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు గానీ ఒక్క గొల్ల కురుమలకే పరిమితం కావు. వేలాది మందికి సాధికారత కల్పించగలదు. ఈ రంగంలో ఒక్క సారి ఆర్థిక విస్ఫోటనం ఆరంభం అయితే, అన్ని వర్గాలు ప్రగతి ఫలాలు అనుభవించవచ్చు. గొర్రెల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణలో 19.1 మిలియన్ల గొర్రెలు ఉండగా, 17.6 మిలియన్లతో రెండవ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్, 11.1 మిలియన్లతో మూడవ స్థానంలో కర్ణాటక, 5.6 మిలియన్ల గొర్రెలున్న మహారాష్ట్ర నాలుగవ స్థానంలో, 4.1 మిలియన్లున్న తమిళనాడు ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. పైగా తెలంగాణ ఇటువంటి సంస్థ ఏర్పాటుకు భౌగోళికంగా కూడా అనువైన ప్రదేశం. అద్భుతమైన వన సంపద ఉంది. జీవాలకు ఆరోగ్యకరమైన గ్రాసం అందుబాటులో ఉంది. సంచారానికి కొండలు, గుట్టలున్నాయి. పశు వైద్యం, వ్యవసాయ శాస్త్రాల్లో నాణ్యమైన విద్యావకాశాలున్నాయి, అందుబాటులో నిపుణులున్నారు. వ్యాపార రీత్యా హైదరాబాద్ గ్లోబల్ సిటీ, దీంతో పాటే రాష్ట్రం నలు దిక్కులా దినదినాభివృద్ధి చెందుతున్న నగరాలున్నాయి. ఉత్తర, దక్షిణ భారతాలకు వారధి తెలంగాణ. విదేశాలతో వ్యాపారం ఎప్పటి నుంచో సాగుతుంది. ఇన్ని సానుకూలతలున్న ఇక్కడ కాకపోతే మాంసోత్పత్తుల రంగాన్ని ఇంకెక్కడ ఏర్పాటు చేసినా ఉపయుక్తంగా ఉండదు. అందుకని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గొర్రెలు, మేకల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

గోసుల శ్రీనివాస్ యాదవ్

వ్యవస్థాపక అధ్యక్షులు, గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి

Advertisement
Advertisement
Advertisement