Abn logo
May 4 2021 @ 03:36AM

కుదేలైన కూలీ!

  • కొవిడ్‌తో తగ్గిన రైళ్లు .. పనుల్లేక పోర్టర్ల ఇబ్బందులు 
  • ఒక్కొక్కరికి నెలలో వారంపాటే పనులు 
  • కుటుంబ పోషణకు నానా అవస్థలు 
  • కేంద్ర ప్రభుత్వ సాయం కోసం వినతి 


హైదరాబాద్‌ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): రైల్వే కూలీ కుదేలయ్యాడు. ఒంటిపై ఎర్ర చొక్కా, ఖాకీ నిక్కర్‌ వేసుకుని కూలీ సార్‌.. కూలీ.. అంటూ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ఉపాధి పొందే పోర్టర్ల (రైల్వే కూలీలు) పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. నగరానికి వచ్చే వివిధ రైళ్ల నుంచి దిగుతున్న ప్యాసింజర్ల లగేజీలను ఫ్లాట్‌ ఫాంలపై నుంచి స్టేషన్‌ బయటి వరకు మోసుకెళ్తూ వారు అందించే కూలితో కుటుంబాలను పోషించుకుంటున్న పోర్టర్లు కొంతకాలంగా అవస్థలు పడుతున్నారు. చేసేందుకు పనులు దొరకక.. వేరే పని తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా రైల్వేస్టేషన్లపై ఆధారపడి జీవిస్తున్న వారిని పట్టించుకునే నాథుడే కరువవడంతో బోరుమంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్‌ స్టేషన్‌లో మొత్తం 220 మంది లైసెన్స్‌డ్‌ కూలీలు ఉన్నారు. అలాగే కాచిగూడలో 40, నాంపల్లిలో 50, లింగంపల్లిలో ముగ్గురు పని చేస్తున్నారు.


కొవిడ్‌కు ముందు చేతినిండా పని..

సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని మొత్తం 220 మంది కూలీల్లో కొవిడ్‌కు ముందు ప్రతి రోజు 110 మంది చొప్పున రెండు షిప్టుల్లో పని చేసేవారు. ఈ మేరకు ఒక్కో కూలీకి 15 రోజులపాటు పనులు లభించేవి. పని చేసిన రోజు ఒక్కొక్కరికి రూ.1200-1500 వరకు కూలి దక్కేది. కాగా, 2020 మార్చికి ముందు వరకు కరోనా వ్యాప్తి లేకపోవడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ 121 రైళ్లు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించగా, దాదాపు 1.40 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో కూలీలకు 24 గంటలపాటు పనులు ఉండేవి. ఒక రోజు పని చేయగా, మరో రోజు ఖాళీ ఉండే సమయంలో పొరుగూరు నుంచి వచ్చే కూలీల్లో కొందరు వ్యవసాయ పనులు చేసుకునేవారు. మరికొందరు ఖాళీగా ఉండేవారు. అయితే కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కొంతమంది రైల్వే కూలీలు నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకున్నారు. కాగా, అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా జూన్‌ నుంచి రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కడంతో తిరిగి పనులకు హాజరవుతున్నారు. 


రెండో దశ పంజా..

గతేడాది జూన్‌, జూలై నుంచి దక్షిణ మధ్య రైల్వేలో పదుల సంఖ్యలో ప్రారంభమైన రైళ్లు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వచ్చేసరికి భారీగా పెరిగాయి. డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రతి రోజూ 300 రైళ్లు రాకపోకలు సాగించగా.. ఇందులో 210 రైళ్లు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి నుంచి నేరుగా ప్రారంభమయ్యేవి. దీంతో రైల్వే కూలీలకు కొంత మేరకు పనులు దొరికాయి. అయితే కొవిడ్‌ తగ్గుముఖం పట్టి మళ్లీ సాధారణ పరి స్థితులు వచ్చాయనుకుంటున్న తరుణంలో వైరస్‌ రెండో దశ పంజా విసురుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతోపాటు మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆయా స్టేషన్ల నుంచి నడుస్తున్న 210 రైళ్లలో ఇప్పటి వరకు 86 రైళ్లను రద్దు చేశారు. కొవిడ్‌తో ఆయా రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గిన కారణంగా కొన్ని రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. 


నెలకు రూ.10 వేలు ఇవ్వాలి

కొవిడ్‌తో ఏడాదిన్నర కాలంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా చేతినిండా పనులు లేకపోవడంతో కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో ఒక్కొక్కరికి నాలుగు రోజుల వరకు కూడా పని దొరకడం లేదు. కొవిడ్‌ కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక్కో కూలీకి నెలకు రూ.10 వేల చొప్పున  జీవనభృతి అందించి ఆదుకోవాలి.

 ఎగ్గిడి వెంకటేశ్‌, లైసెన్స్‌డ్‌ పోర్టల్‌ నేత 


పరిస్థితి దారుణంగా ఉంది 

కరోనా కారణంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి మునుపటి లెక్క రైళ్లు నడవడం లేదు. కొవిడ్‌కు ముందు నేను రోజుకు రూ.1200 వరకు సంపాదించేవాడిని. ఇప్పుడు నాలుగు రోజులకోసారి వచ్చే పనితో కనీసం రూ.500 కూడా రావడం లేదు. దీంతో ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్నాను. 

కర్రె రమేశ్‌, లైసెన్స్‌డ్‌ కూలీ 

Advertisement
Advertisement
Advertisement