ఏవీ ఆ భిన్న స్వరాలు?

ABN , First Publish Date - 2021-02-17T06:24:49+05:30 IST

అహింస, సహాయ నిరాకరణోద్యమాల ద్వారానే పూర్ణ స్వరాజ్యం సాధించాలని మహాత్మాగాంధీ తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్రాత్మకమైన కాంగ్రెస్...

ఏవీ ఆ భిన్న స్వరాలు?

అహింస, సహాయ నిరాకరణోద్యమాల ద్వారానే పూర్ణ స్వరాజ్యం సాధించాలని మహాత్మాగాంధీ తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్రాత్మకమైన కాంగ్రెస్ సదస్సు 1920లో నాగపూర్‌లో జరిగింది. ఈ సదస్సులోనే కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌ను గణతంత్రరాజ్యంగా ఏర్పాటు చేయడమే కాదు, మొత్తం ప్రపంచాన్ని పెట్టుబడిదారీ శక్తులనుంచి విముక్తి చేయడం కాంగ్రెస్ లక్ష్యం కావాలని ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇదే విషయాన్ని ప్రస్తుత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ 2017లో ప్రవాస భారతీయుల సంస్థ అయిన హిందూ స్వయం సేవక్ సంఘ్ సమావేశంలో తెలిపారు. స్వతంత్ర భారతదేశం తనను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని పెట్టుబడిదారీ విధానం కోరలనుంచి తప్పించాలని హెగ్డేవార్ ఆశించినట్లు మోహన్ భాగవత్ ప్రకటించారు. 


ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నదా లేక విదేశీ, దేశీయ గుత్త పెట్టుబడిదారులకు దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిగా అప్పజెప్పే లక్ష్య పరిపూర్తికి తోడ్పడేదిగా ఉన్నదా అనే అనుమానాలు కలగక మానదు. అనేక ప్రభుత్వరంగ సంస్థలనే కాకుండా రహదారులు, విద్యుత్ రంగ ఆస్తులు, చమురు, సహజవాయువు పైప్ లైన్లు, రైల్వే ఆస్తులు, ప్రభుత్వ గోదాంలు, క్రీడా స్టేడియంలు, మౌలిక సదుపాయాలకు చెందిన ఆస్తులను కూడా అమ్మి వేయడం, బ్యాంకులను ప్రైవేటీకరించడం, బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని 74 శాతానికి పెంచడం వంటి అనేక నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తాయి అన్న విషయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేవారు తర్జన భర్జనలు చేస్తున్నారు. తాము ఆశ్రిత పెట్టుబడిదారులను సృష్టించడం లేదని, తాము ప్రవేశపెట్టిన అనేక పథకాలు కోట్లాది సామాన్యులకు మేలు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ బలంగా వాదించారు. కానీ పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలు ఉంటాయని, ఈ పథకాలకూ, ప్రభుత్వ ప్రధాన ఉద్దేశాలకు ముడిపెట్టలేమన్న విషయం ఆమెకు తెలియనిది కాదు.


1998లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, ఆర్థిక సిద్ధాంతవేత్త దత్తోపంత్ థేంగడీ బీమా నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా గురుమూర్తితో కలిసి పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. 2001 ఏప్రిల్‌లో ఢిల్లీలోని రామలీలా మైదానంలో భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహించిన బ్రహ్మాండమైన ర్యాలీలోనే వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించిన స్వేచ్ఛా విపణి వైఖరిని, వివిధ రంగాలను విదేశీ పెట్టుబడులకోసం తెరిచి ఉంచడాన్ని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్ని తీవ్ర భాషలో నిందించారు ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాను దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. ఏడాది తర్వాత యశ్వంత్ సిన్హాను ఆర్థికమంత్రి పదవి నుంచి తొలగించారు. 


థేంగడీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు. కాని ఆశ్రిత పెట్టుబడిదారులను సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘థర్డ్ వే’ (మూడో మార్గం) అన్న పుస్తకంలో ఆయన పెట్టుబడిదారీ విధానం, ప్రభుత్వమే వ్యాపారాలు నిర్వహించడానికి మధ్య మరో మార్గాన్ని అవలంబించాలని కోరారు. ఉదారీకరణ ప్రమాదాల గురించి ప్రజలను చైతన్యవంతంచేసేందుకు స్వదేశీ ప్రచార యాత్రను కూడా ఆయన చేపట్టారు, పిట్స్ బర్గ్‌లోని కార్నెగీ మెలన్ యూనిర్సిటీతో కలిసి హై స్పీడ్ నెట్ డాటా నెట్‌వర్క్ ఏర్పర్చుకునేందుకు అనుమతించిన సాంఖ్య వాహిని ప్రాజెక్టుకు నిరసనగా వామపక్షాలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భారత సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పెట్టుబడిదారీ విధానానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆయన అన్నారు.


హెగ్డేవార్ తర్వాత సర్ సంఘ్ చాలక్‌గా వ్యవహరించిన గోల్వాల్కర్ కూడా పెట్టుబడిదారీ విధానం దుర్మార్గాల గురించి రాశారు. పోటీ మార్కెట్‌లు గుత్తపెట్టుబడిదారులను ఏర్పరుస్తాయని జనసంఘ్ అధ్యక్షుడు దీనదయాళ్ ఉపాధ్యాయ కూడా అభిప్రాయపడ్డారు, నిజానికి సంఘ్ సిద్ధాంతకర్తలంతా ఆర్థిక సమానత్వాన్ని ఆశించిన వారే. 1953 జూలై 25న జనసంఘ్ ఆర్థిక విధానాన్ని ప్రకటిస్తూ ఆదాయ వ్యయాల్లో అసమానతలు తగ్గించడం తమ ధ్యేయమని, కొందరి చేతుల్లోనే పరిశ్రమలు కేంద్రీకృతం కాకూడదని చెప్పారు. వ్యక్తులు సంపదను పోగుచేసుకోవడంపై పరిమితి విధించాలని 1972లో గోల్వాల్కర్ అన్నారు. 


స్వదేశీ జాగరణ్ మంచ్ స్థాపించిన థేంగడీ ఆలోచనా విధానాన్ని ఆ సంస్థ నేతలు ఇప్పటికీ అడపా దడపా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రపంచీకరణ విధానాల వల్ల అనేక పరిశ్రమలు మూతపడడం, విదేశీ పెట్టుబడులను అనుమతించడంపై నేటి బిజెపి నేత, నాటి స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్ మురళీధర్ రావు నేతృత్వంలో అనేక నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కనీస మద్దతు ధర మూలంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడొకరు ప్రకటన చేసినందుకు గత ఏడాది స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధానమంత్రికి లేఖ రాసింది, సాగు చట్టాల విషయంలో కూడా ఈ సంస్థ తన అభిప్రాయాన్ని దాచుకోలేదు. ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్ కమిటీల మండీలను అంగీకరించబోరని, రైతులు మండీలకు వెలుపల అమ్మకతప్పని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. కనీస మద్దతు ధరపై రైతులకు కచ్చితమైన హామీ ఇవ్వాలని, ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ వ్యాపారులు కూడా రైతుల నుంచి కనీస మధ్దతు ధర కంటే తక్కువ ధరకు కొనడం చట్టవ్యతిరేకం చేయాలని డిమాండ్ చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి దారులు, సూపర్ మార్కెట్లు, బడా టోకు వ్యాపారులు నిల్వచేయడంపై ఆంక్షలు ఎత్తివేసినందుకు మంచ్ నిరసన వ్యక్తం చేసింది. ఇదే మోదీ ప్రభుత్వం 22 వేల మండీలను ఏర్పాటు చేస్తామని చెప్పిందని, దాన్ని సత్వరమే అమలు చేయాలని తెలిపింది, లబ్ధిదారులను సంప్రదించకుండా చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ వ్యతిరేకించే హక్కు ఉంటుందని మంచ్ ప్రస్తుత జాతీయ కన్వీనర్ డా. అశ్వినీ మహాజన్ అన్నారు.


క్రోనీ కేపిటలిస్ట్(ఆశ్రిత పెట్టుబడిదారు)లను తాము పెంచి పోషించడం లేదని నిర్మలా సీతారామన్ అంటున్నారు. అయితే టెలికామ్, ఈ కామర్స్, రిటైల్, గోదాములు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పునరుత్పాదక ఇంధనం, సౌర శక్తి, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, గ్యాసు పంపిణీ, రక్షణ, వంటనూనెలు, ఆహార పదార్థాలు, పళ్లు, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, గృహరుణాలు, మెట్రో, రైల్వే, డాటా కేంద్రాలు, థర్మల్ విద్యుత్, బొగ్గు వంటి సహజ వనరులు మొదలైన అనేక రంగాలకు చెందిన కంపెనీలు ఇవాళ దేశంలో రెండు మూడు బలమైన వ్యాపార సంస్థల చేతుల్లో ఉన్నాయి. గత ఆరేళ్లలో ఆ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా బలోపేతం అయ్యాయి. వాటికి, విదేశీ సంస్థలకూ ఉన్న సంబంధాల వల్ల వాటిని బహుళ జాతి గుత్త పెట్టుబడిదారీ సంస్థలుగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. వీటి వల్ల దేశంలో చిన్న, మధ్యతరహా సంస్థలు, అసంఘటిత కిరాణాషాపులు, మెడికల్ హాల్స్, వినియోగదారులు, రైతులకు జరిగే నష్టాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ రెండు మూడు సంస్థల ప్రాబల్యం దేశ భద్రతకు ముప్పుగా కూడా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు లాంటి ఘన చరిత్ర, ప్రజల రక్తస్వేదాలతో తడిసిన సంస్థల అమ్మకం గురించి నిరసనలు తెలిపితే అది అరణ్య రోదన కాక మరేమవుతుంది? ఎవర్ని మభ్యపెట్టేందుకు రకరకాల పార్టీలు ఇచ్చిన వినతిపత్రాలను హోంమంత్రి, ఆర్థికమంత్రి తీసుకుంటున్నారు? ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కార్పొరేట్ ఏజెంట్ల మంత్రివర్గంగా కనిపిస్తుందని ఒక నాయకుడు వ్యాఖ్యానిస్తే ఆశ్చర్యం కలగలేదు. సమాజంలో చివరన ఉన్నవారికి మేలు చేయాలనే అంత్యోదయ సిద్ధాంతాన్నే తాము అమలు చేస్తున్నాం అని నిర్మలా సీతారామన్ అంటున్నారు కానీ ప్రస్తుతం మొదట, చివర పంక్తిలో కార్పొరేట్లే నిలుచున్నట్లు అర్థమవుతోంది.


వాజపేయి, ఆడ్వాణీ లాంటి నేతలు కింది స్థాయి నుంచి వచ్చారు కనుక సంఘ్ పరివార్‌కు చెందిన ఆర్థిక నిపుణులు, థేంగడీ లాంటి నేతల మాటలకు ఏదో ఒక స్థాయిలో తల ఒగ్గారు. ఆడ్వాణీ కూడా ఒకప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి వచ్చిన వారే. అప్పుడంటే బిజెపి మొత్తం సంఘ్ పరివార్‌లో ఒక అనుబంధ సంస్థగా ఉండేది. ఇప్పుడు బిజెపికి మోదీ వంటి బలాఢ్యుడైన నాయకుడు లభించడంతో సంఘ్ పరివార్‌లో ఉన్న మిగతా సంస్థలు ఆ పార్టీకి అనుబంధంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-02-17T06:24:49+05:30 IST