Advertisement
Advertisement
Abn logo
Advertisement

CM KCR సడన్ టూర్ వెనుక ప్లాన్ ఇదేనా.. రికార్డులు తీయండి.. అక్కడ కాలుపెట్టక ముందే..!?

చెప్పేటోడు ఎన్నైనా చెబుతాడు వినేటోడుకి వివేకం ఉండాలిగా అనే సామెతకు కొంచెం మసాలా దట్టించి చెప్పడం కేసీఆర్‌ స్టైల్‌. ఆయితే ఆయన అనుకున్నది సాధించుకునేందుకు ఎన్నో  సార్లు, ఎన్నో చెప్పారు. అవన్నీ నెరవేర్చాడా అనే చర్చ ప్రతిపక్షాలు ప్రజల మనసుల్లో నాటుతున్నాయట. ఈ విషయం ఇంటెలిజెన్స్‌ పసిగట్టి పెద్దాయన చెవిలో వేశాయట. దీంతో ఎప్పుడేం మాట్లాడామో రికార్డులు తీయండి అంటున్నాడట కేసీఆర్‌. ఇంతకీ ప్రతిపక్షాలు కేసీఆర్‌ ఎప్పుడేం చెప్పాడో ఇప్పుడే ఎందుకు ప్రజలకు గుర్తుచేస్తున్నాయి? సర్కార్‌ సార్‌ తన మాట వినోటోళ్లకు మళ్లీ ఇప్పుడేం చెప్పదలిచారు? అనే విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

తిమ్మిని బమ్మిని చేస్తాడంటే ఇదేనేమో!

దుబ్బాక బైపోల్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో దెబ్బతిన్న పులిలా వ్యూహం పన్నిన కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ ఎన్నికలు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తు చేశారు. దుబ్బాకలో గెలిచి ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకున్న బీజేపీని పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి పగ తీర్చుకున్నారు. సాగర సమరంలో కాంగ్రెస్‌ కురవృద్దుడు జానారెడ్డిని ఊహించని రీతిలో ఓడించారు. ఈ రెండు ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ప్రతిపక్షాలను ఖంగు తినిపించారు. ఈ రెండు ఎన్నికల వరకు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే భావనలో ఉన్న ప్రతిపక్షాలు ప్రజలిచ్చిన తీర్పుతో పరేషాన్‌ కాకతప్పలేదు. కేసీఆర్‌ తిమ్మిని బమ్మిని చేస్తాడంటే ఇదేనేమో అని అనుకోకతప్పలేదు ప్రతిపక్షాలకు.

ఇంకా అలాగే హామీలు!

ఈ రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  ఘన విజయానికి ప్రధాన కారణం  కేసీఆర్‌ ప్రచారం. ఆయనిచ్చిన హామీలు. నాగార్జున సాగర్‌  ఉప ఎన్నిక సందర్భంగా స్వయంగా  సీఎం కేసీఆర్ అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి వరాల జల్లు కురిపించారు. జానారెడ్డి ఏళ్ల తరబడి ప్రాతినిధ్యం వహించి  ఏం చేశారో ...టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక సాగర్‌లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో స్థానిక ప్రజలు గ్రహించాలని కోరుతూ అనేక హామీలు గుప్పించారు. సరిగ్గా నాగార్జున సాగర్ ఉప ఏన్నికను దృష్టిలోఉంచుకొని హాలియాలో 2021 ఏప్రిల్ 14న నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. కోదాడ నుంచి హుజూర్‌నగర్ మీదుగా నాగార్జునసాగర్ వరకు పర్యటిస్తానన్నారు, ప్రజలను, రైతులను నేరుగా కలుస్తానని హామీ ఇచ్చారు. వారి సమస్యలను తెలుసుకుని కుర్చీ వేసుకుని ఇక్కడే పరిష్కరిస్తానని కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ ఆ పర్యటన జరగలేదు. ఆ హమీలు అలాగే ఉన్నాయి.

ఏమేం హామీలు ఇచ్చారు..!?

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018 నవంబరు 27న హాలియాలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. ఇక  హుజూర్‌నగర్‌లో గత ఏడాది సెప్టెంబరు 23న నిర్వహించిన కృతజ్ఞతాసభలో మొత్తం 134 గ్రామ పంచాయతీలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 20 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒక్కో మండలానికి 30 లక్షల చొప్పున, నేరేడుచర్ల మునిసిపాలిటీకి 15 కోట్లు, హుజూర్‌నగర్ మునిసిపాలిటీకి 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తానని అన్నారు. జీవోలైతే వచ్చాయిగానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. నాగార్జునసాగర్‌లోని ఇరిగేషన్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని, ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తామని తెలిపారు. నందికొండలోని బీసీ డిగ్రీ కళాశాల, హాలియాలో షాదీఖానా, ఖబరిస్తాన్ నిర్మాణం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, పింఛన్లు ఇస్తామన్నారు. వీటితోపాటు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినా సాకారం కాలేదు.

మూడు నెలలైనా అటు వెళ్లనే లేదు..!

గతంలో సాగర్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో దాని  ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పడే అవకాశం ఉందని గ్రహించిన సీఎం కేసీఆర్‌  వచ్చేనెల మొదటివారంలో మరోసారి హాలియ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్‌లో దళిత బంధు ప్రాజెక్టు సందర్భంగా సాగర్ ఎన్నికల హామీల మాదిరిగానే ఈ హామీలు మిగిలిపోతాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ హాలియా టూర్‌కు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన 15 రోజుల్లోగా వస్తానని హామీ ఇచ్చిన సీఎం మూడు నెలలు దాటినా అటు వైపు వెళ్ళలేదు.

హాలియా టూర్‌ వెనుక..!

సరిగ్గా ఇవే అంశాలను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రిపేరవుతున్నాయట. ఎన్నికలు అంటేనే కేసీఆర్‌ హామీలిస్తారని, ప్రజలు ఓటేశాక మోసం చేయడం కేసీఆర్‌కు మాములు విషయమేనని ప్రతిపక్షాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పటి హామీలో కాదు  ఈమధ్య జరిగిన నాగార్జున సాగర్‌, పట్టభద్రుల ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీలనే సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ ట్రోల్‌ చేస్తున్నాయట ప్రతిపక్షాలు. ఈ విషయంపై కేసీఆర్‌కు ఉప్పందటంతో ఉన్నఫలంగా హాలియా టూర్‌ పెట్టుకున్నట్లు టాక్‌ వస్తోంది.

మాట తప్పని మనిషి, మడమ తిప్పని నేత అని..! 

కేసీఆర్‌ మాట ఇచ్చాడంటే తిరుగుండదని, హామీ ఇచ్చారంటే అమలు అయితీరాల్సిందేనని చెప్పుకునేందుకు హాలియా టూర్‌ను వాడేసుకోవాలని చూస్తున్నారట. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అక్కడ కాలుపెట్టేకంటే ముందే గత ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాడనే విషయాన్ని హైలెట్ అయ్యేలా చేసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారట. కేసీఆర్‌ మాట తప్పని మనిషి, మడమ తిప్పని నేత అని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మార్మోగించాలని చూస్తున్నాయట గులాబీ శ్రేణులు.

డిమాండ్స్ ఇవీ..

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళితబంధు డ్రామా ఆడుతున్నారని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దమ్ముంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడే దళితబంధును అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇతర హామీల మాదిరిగానే దళిత బంధును కూడా సీరియస్‌గా తీసుకుని అమలుపర్చుతామనే ఆలోచనను కలిగించే ప్రయత్నం చేస్తోంది టీఆర్‌ఎస్ పార్టీ.


Advertisement
Advertisement