Abn logo
Mar 2 2020 @ 02:37AM

‘‘ఏది సాహిత్యమన్నది డెమాక్రటిక్‌ పద్ధతిలో నిర్ణయించకూడదు’’

‘‘ఏది సాహిత్యమన్నది డెమాక్రటిక్‌ పద్ధతిలో నిర్ణయించకూడదు’’

వేలూరి వెంకటేశ్వరరావు


మన పుస్తకాలను వేరే భాషలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్లని బయటి పుస్తకాలకి అనువాదాలు చేసుకుంటూ కూర్చుంటాం. అట్నించి ఇటు తీసుకురావటమేగాక, ఇట్నించి అటు కూడా రచనలను పంపాలన్న అభిప్రాయం మనకు స్థిరంగా నాటుకునేవారకూ- మనం గొప్పవాళ్ళమని మనం అనుకోవచ్చుగానీ అది ఎవరికీ తెలీదు.


వేలూరి వెంకటేశ్వరరావు అమెరికా వెళ్ళిన తెలుగువాళ్ళలో తొలితరానికి చెందిన వారు. 1938లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టిన వేలూరి 1967లో అమెరికా వెళ్ళారు. అట్లాంటా ఎమరీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం చదువు కున్నారు. అక్కడే కొన్నాళ్ళు భౌతిక శాస్త్రాన్ని బోధించారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమెరికాలో ఉన్న తెలుగు సాహిత్యకారుల్లో ముఖ్యులు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. ఈమాట వెబ్‌ మేగజైన్‌కు పదకొండేళ్ళ పాటు సంపాదకునిగా ఉన్నారు. ‘మెటమార్ఫసిస్‌’, ‘ఆ నేల, ఆ నీరు, ఆ గాలి’ ఈయన కథా సంపుటాలు. ఒరియా కవి సౌభాగ్య కుమార్‌ మిశ్రా కవితలకు ఈయన చేసిన తెలుగు అనువాదాలతో ‘అవ్యయ’, ‘ద్వాసుపర్ణా’ కవితా సంపుటాలు వెలువరించారు. ఇటీవల ‘కావ్యదహనోత్సవం’ అనే పుస్తకం తెచ్చారు. దీనికి మూలం 1960లో ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో జరిపిన కార్యక్రమం.  దీని వెనుక ఉన్న ఆలోచన: ‘ఎడాపెడా చెత్త కవిత్వం వచ్చేస్తుంది, కొంత చెత్తని కాల్చిపారేస్తే మంచిది’ అన్నది. ఈ దహన కార్యక్రమాన్ని ఉపన్యాసాలతో ఒక సభలా జరపాలని తలపెట్టారు. దహన కార్యక్రమం కోసం ‘అగ్నిశంఖం’ పేరిట కావ్యం కూడా రాశారు. నిజంగా కావ్యాన్ని దహించటం జరగలేదు కానీ, సభ మాత్రం జరిగింది. సభికులుగా మేడేపల్లి వరాహనరసింహ స్వామి, ఎ. సత్యమూర్తి, బండి గోపాలరెడ్డి, చేకూరి రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ ఉపన్యాసాలతో కూడిన సంపుటే ‘కావ్యదహనోత్సవం’. ఇటీవల వేలూరి భారత దేశం వచ్చిన సందర్భంగా ‘వివిధ’ ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ఇది: 

అమెరికాలోని తెలుగువారు రాసే రచనలకు ‘తెలుగు డయాస్పోరా సా   హిత్యం’ అన్న పేరు తొలిసారిగా ప్రతిపాదిం చింది మీరు (1998లో). తెలుగు డయాస్పోరా సాహిత్యం ఇప్పటి పరిస్థితి గురించి చెప్పండి?
వలసకు వెళ్ళిన వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటాయి. వీరు ఎంత కష్టపడ్డా ఆ కల్చర్‌లో భాగం కాలేరు. యాభై రెండేళ్ళ నుంచి ఉన్నా నేను ఇంకా అమెరికన్‌ కల్చర్‌ లోకి ఇమడలేదు. నేను 1967లో అమెరికా వెళ్ళాను. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. 1960 నుంచి 70 వరకు రాసినవాళ్ళు ఏం రాసినా నిజంగా వాళ్ళ బాధలు రాశారు, అవి డయాస్పోరా కథలనవచ్చును. 70 నుంచి 90 మధ్య వచ్చినవాళ్ళు రాసిన కథలు అవన్నీ డయాస్పొరా కథలు కావు; అవన్నీ నొస్టాల్జియా కథలు. అక్కడేదో పోగొట్టు కున్నాం... ఇలా సాగుతాయవి. ఇక తర్వాత వచ్చినవాళ్ళు, ఒక కాలు అమెరికాలోనూ ఒక కాలు ఇండియాలోనూ ఉంచి జీవిస్తున్నారు. ఇక్కడ వచ్చిన సినిమాలన్నీ మరుసటి రోజే అమెరికాలో వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు నిజానికి తెలుగు దేశంలో ఉన్న తెలుగువాళ్ళ కిందే లెక్క. వాళ్ళల్లో ఎవరన్నా తెలుగు కథలు రాస్తే తెలుగు దేశంలో ఉన్నట్టే రాస్తారు. అదీ వారి మీద నా కంప్లయింటు: మీరు నిజంగా ఇక్కడా లేరు, అక్కడా లేరు, ఎక్కడున్నారూ? అని. 

ఇక మున్ముందు డయాస్పోరా అని మీరంటున్న కథ ఆగిపోతుందని అనుకోవచ్చా? అక్కడ ఉండి తెలుగులో రచనలు చేసేవాళ్ళ సంఖ్య రాన్రానూ తగ్గుతుందేమో?
ఖండితంగా చెప్పలేం. సంవత్సరానికి అరవై వేల మంది వస్తున్నారు. అందులో పదిమంది సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళైతే చాలదూ! ఇక్కడ మాత్రం ఎంతమందున్నారు?

మీరు అమెరికా వెళ్ళిన తొలి రోజుల్లో అక్కడి తెలుగు వాళ్ళ మధ్య సాహిత్య వాతావరణం గురించి చెప్పండి?
అమెరికా వెళ్ళనంత కాలం నాకు ఇంగ్లీషు వచ్చునని అనుకునేవాడ్ని. వెళ్ళాక తెలిసింది అది ఇంగ్లీషు కాదు, నాకు వచ్చిందల్లా తెలుగేనని. కాబట్టి ఏమైనా చేస్తే తెలుగులోనే చేస్తేనే మంచిదని. అక్కడ స్థానికంగా ఆర్గనైజేషన్స్‌ పెట్టుకు న్నాకా, చేతిరాత పత్రికలు వచ్చేవి. అందులోనే ఒక కథో కవితో రాస్తూండేవాణ్ణి. అలా  సాహిత్యాభివృద్ధి చేద్దామన్న ఆలోచన కలిగింది. 1972లో పెమ్మరాజు వేణుగోపాలరావు గారు మొట్టమొదట ‘తెలుగు భాషా పత్రిక’ అని పెట్టారు. అందులో చాలా ఏక్టివ్‌గా పనిచేసేవాడిని. చేత్తో రాసి, జిరాక్స్‌ చేసి, 32 పేజీల జర్నల్‌లా తయారు చేసేవాళ్ళం. వేమూరి వెంకటేశ్వరరావు, తాతా ప్రకాశం, నేనూ సైన్స్‌ వ్యాసాలు రాసేవాళ్ళం. తర్వాత ఇక్కడ ప్రింటు కూడా చేయటం మొదలుపెట్టాం. పాపులర్‌ సైన్స్‌ జర్నల్‌లాగా మొదలుపెట్టిందల్లా తర్వాత కార్టున్లు అవీ వచ్చి చేరాయి అందులో. ఆ వ్యాసాలను తర్వాత భారతి పత్రిక వాళ్ళు తీసుకుని అచ్చువేసుకున్నారు. అలా మొదలైన ప్రయాణం తర్వాత 1998లో ఈమాట వెబ్‌ పత్రిక ఏర్పాటు దాకా కొనసాగింది.

మీ ‘కావ్యదహనోత్సవం’ పుస్తకంలో- మేడిపల్లి వరాహనరసింహస్వామిగారి ప్రసంగంలో ‘‘ఈ కావ్యదహనోత్సవం ఎందుకంటే- పూర్వం తాటాకుల మీద రాసుకునే వాళ్ళు మళ్ళీ తిరగరాసుకునేటప్పుడు బాగుంటేనే తిరగ రాసుకునేవాళ్ళు, అలా బాలేనివి ఫిల్టర్‌ అయ్యేవి. కానీ అచ్చు వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు పుస్త కాలు వేస్తున్నారు’’ అన్నారు. ఇవాళ డిజిటల్‌ ఏజ్‌లో ఇదింకా పెరిగిందిగా? 
అందుకే విమర్శ లేకపో వటం పెద్ద సమస్యయింది. మనకి ఒక అభిప్రాయం ఉంది, లిటరేచర్‌ డెమాక్రటైజ్‌ అయిం దని. అంటే దానర్థం- అన్ని వర్గాల నుంచీ చాలామంది రాయటం డెమాక్రటైజ్‌ అవ టమా? లేక ఏది సాహిత్య మనేదాన్ని డెమాక్రటిక్‌గా డిసైడ్‌ చేయటమా? ఏది సాహిత్య మన్నది డెమాక్రటిక్‌ పద్ధతిలో నిర్ణయించకూడదు. 

ఏది పడితే అది వస్తుంది, ఎవరు పడితే వారు రాస్తు న్నారు అనేది ఒక ఎలిటిస్ట్‌ దృక్పథం లాగా లేదూ? 
నేనంటున్నదల్లా విమర్శ చేసి నిగ్గు తేల్చే ఒక వ్యవస్థ ఉండాలీ అని. ఏటా ఇన్ని కవిత్వ సంపుటాలు వెల్లువలా వస్తున్నప్పుడు అందులో ఏది మంచిదో తేల్చాల్సిన వ్యవస్థ ఒకటి ఉండాలి కదా. అలాగే కొన్ని కవితలో, కథలో బాగా రాస్తే, ఆ రచయితకు అంతో ఇంతో పేరు వస్తే- ఇక ఆ రచ యిత రాసినవ్వన్నీ ఎలా వున్నా పత్రికలు ఆదరించి వేసే పద్ధతి ఒకటి ఇక్కడ నడుస్తోంది. వెస్ట్‌లో ఇలా ఎన్నడూ జరగదు. ఇక్కడే కాదు, అక్కడ అమెరికా నుంచి తెలుగులో రాస్తున్నవాళ్ళకు కూడా కొంత ఈ ధోరణి ఉంది. నేను పదకొండేళ్ళ సంపాదకత్వం తర్వాత ఈమాట వెబ్‌ మేగజైన్‌ విడిచి వచ్చేయటానికి కారణం ఇదే. ఒకాయనవి అన్ని పద్యాలూ ఒకే ధోరణిలో ఉంటున్నాయన్నాను. ఆయన పద్యాలు మనం ఇదివరకే చాలా వేశాం అన్నారు కో ఎడిటర్లు. అదే మనం చేసిన తప్పేమో అన్నాను. అలాగే సాగే పళమైతే ఈ పత్రిక మీరే చూసుకోండీ అని బైటకు వచ్చేశాను. 

‘కావ్యదహనోత్సవం’ పుస్తకం ముందుమాటలో మీరు ‘‘మనకి సాహిత్య చరిత్రలో శిక్షణ లేదు’’ అన్నారు? అంటే ఎలాంటి శిక్షణ?
మనకి, ఈ చాటు పద్యాల వెనుక ఉన్న కథలని చెప్పి, ఆ కథలనే చరిత్రగా చూపించే పద్ధతి ఒకటుంది. అవి చరిత్ర కావూ అని వెల్చేరు నారాయణరావు చెప్పాడు. నిజంగా ఒక కవిమీద లిటరరీ హిస్టరీ తెలుగులో సరిగా వచ్చింది శ్రీనాథుడి మీద వెల్చేరు నారాయణ రావు రాసిన పుస్తకమే ("Srinatha: The Poet who Made Gods and Kings'). అలాంటివి రావాలి తెలుగులో. విశ్వనాథ మీద, శ్రీశ్రీ మీద రావాల్సింది, కానీ రాలేదు. రావిశాస్త్రి మీద కూడా రావొచ్చు. రావిశాస్త్రి ఒక పద్ధతిలోకి రాకముందు తొలిరోజుల్లో ఎలాంటి కథలు రాశారు? ఎవరన్నా ఆలో చించారా? దాని మీద ఎప్పుడన్నా రివ్యూ రాశారా? ఈ అవగాహన మనకి రావా లంటే ఎవరో ఒకరు శిక్షణ ఇవ్వాలి. ఎవరివ్వగలరూ? యూనివర్శిటీలు ఇవ్వగలవు. ఆయన ఆదివారం ఉల్లిపాయ తినరు, సోమవారం గుడికెళ్తారు... ఇలాంటివి లిటరరీ హిస్టరీలు కావు. 

అలాగే పాత పుస్తకాలు పున ర్ముద్రిస్తున్నప్పుడు వాటికి సరైన సంపాదకత్వం వహించటం లేదు. ఉదాహరణకి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి రాసిన ‘కథలు గాథలు’ పుస్తకాన్ని తీసు కుంటే- అందులో మూడేసి పేజీలకి ఆరేసిమంది ఆనాటి ప్రముఖుల, పండితుల ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు వారెవ్వరూ లేరు. కానీ వాళ్ళ పిల్లలో మనవలో ఉంటారు. ఆ ప్రాంతాలకు ఎవరైనా వెళ్ళి, వారి గురించి పరిశోధన చేసి, ఆ పుస్తకాన్ని మంచి ఫుట్‌నోట్సుతో ప్రచురించవచ్చు. అలాగే ఆ పుస్తకంలో వచ్చే సంస్కృత శ్లోకాలకు తెలుగు అనువా దాలను చేర్చి ప్రచురించవచ్చు. మేము తానా సహకారంతో ఆ ప్రయత్నంకోసం ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారిని అడిగాం. కానీ ఆయన ఆరోగ్యం బాలేదు, చేయలేను అన్నారు. ఇప్పటికీ ఆ పుస్తకం మలి ముద్రణలతో వస్తూనే ఉంది, ఏ ఫుట్‌ నోట్సూ లేకుండా. 

అదంతా చేయాలంటే ఆ పుస్తక ప్రచురణకర్తలకు గిట్టుబాటు కాకపోవచ్చు కదా?
ఇవేవీ గిట్టుబాటయ్యే పనులు కావండి. కానీ తప్పక చేయాల్సిన పనులు. కాపిటలిస్ట్‌ దేశం నుంచి వచ్చినవాణ్ణి మాట్లాడుతున్నాను. అక్కడ ఇప్పటికీ ‘ది నేషన్‌’ అని ఒక వారపత్రిక వస్తోంది. దగ్గర దగ్గర 150 ఏళ్ళ నుంచి వస్తున్న లెఫ్ట్‌వింగ్‌ పేపర్‌ అది. మరి వాళ్ళకీ గిట్టుబాటు లేదు. ఐనా ఎంతోమంది ఎన్నో రకాలుగా చందాలిచ్చి దాన్ని బతికిస్తున్నారు. అది అవసరం కనుక.
ముందు మనం సాహిత్యం మనుగడకు సక్రమైన వ్యవస్థలను నిర్మించుకోవాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తిగారు తన డబ్బులు ఇక్కడ సెంట్రల్‌ యూనివర్సిటీకో, ఆంధ్రా యూనివర్సిటీకో ఇవ్వచ్చు, పుస్తకాలు వేయ మని; కానీ వెళ్ళి యేల్‌ యూనివర్సిటీలో ఎందుకి చ్చారు? వాళ్ళు నమ్మకంగా పుస్తకాలు వేస్తారు గనుక. ఇప్పటికే నాలుగు వేశారు కూడా. అందులో రెండు వెల్చేరు, డేవిడ్‌ షుల్మన్‌ కలిసి రాసిన పుస్తకాలే. అలాంటి వ్యవస్థలు ముందు నిర్మాణం కావాలి. డబ్బు లేదంటే నేను నమ్మను. చాలా డబ్బు ఉంది. దాన్ని దేనికోసం ఖర్చుపెట్టాలీ అన్నది తేల్చు కోవాలి. అలాగే గిట్టుబాటు అవుతుందా లేదా అని ఆలోచిం చటం గాక, ఈ పని చేయటం వల్ల మన సాహిత్యానికి సంస్కృతికీ ఏమి చేయగలం అన్న ఆలోచన రావాలి. 

అలాగే మన పుస్తకాలను వేరే భాషలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్లని బయటి పుస్తకాలకి అను వాదాలు చేసుకుంటూ కూర్చుంటాం. ‘వార్‌ అండ్‌ పీస్‌’ని ఎన్నిసార్లని అనువాదం చేస్తాం. అట్నించి ఇటు తీసుకు రావటమేగాక, ఇట్నించి అటు కూడా రచనలను పంపా లన్న అభిప్రాయం మనకు స్థిరంగా నాటుకునేవారకూ- మనం గొప్పవాళ్ళమని మనం అనుకోవచ్చుగానీ అది ఎవరికీ తెలీదు. ఒక యాభై కథల్ని తీసుకుని ఇంగ్లీషులోకి అను వాదం చేయించి ప్రచురించవచ్చు. అది గిట్టుబాటయ్యే పని కూడా నిజానికి. ఈ పని బెంగాలీవాళ్ళు బాగా చేస్తున్నారు. 

అలాగే ఇలాంటి అనువాదాలను అక్కడివాళ్ళ చేత ఎడిట్‌ చేయించుకోవాలి. మనకి ఇంగ్లీషులో ఎమ్మే ఉన్నంత మాత్రాన అనువాదాలు చేసేయగలమనీ, అవి వెస్ట్‌లో చెల్లుబాటవు తాయనీ అనుకోవటం పొరబాటు. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడే చదువుకున్న తెలుగువాళ్ళెవ రైనా చదివితే, వాళ్ళు వెంటనే ‘‘ఇది ఇంగ్లీషు వాక్యంలా లేదు’’ అని కరెక్ట్‌ చేయగలుగుతారు.

ఒరియా కవి సౌభాగ్య కుమార మిశ్రా కవితల్ని తెలుగులోనికి అనువదించి సంపుటాలుగా ప్రచురించారు (‘అవ్యయ’, ‘ద్వాసుపర్ణ’). కవిగా అతనిలో మిమ్మల్ని ఆకర్షించింది ఏమిటి?
అతను నా స్నేహితుడు, చాలా ఏళ్ళుగా కలిసి తిరిగాం. కవిగా అతను ఏ వర్గానికి చెందడు. అలాగని సంప్రదాయ కవి కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. తిలక్‌ లాంటి రివల్యూ షనరీ. అసలు తిలక్‌ రివల్యూషనరీనా కాదా అన్నది వివా దాంశం. అందుకనే అలా అంటున్నాను. అతని ‘శకుంతల’ కవితనే తీసుకుంటే, అందరికీ తెలిసిన శకుంతల కథనే ఆఖర్న మార్చేస్తాడు. ‘‘నాకేమీ అక్కర్లేదు, నీ ఉంగరం నాకివ్వు అది చాలు’’ అంటుంది దుష్యంతునితో శకుంతల. కవి చాలా సటిల్‌గా, సంప్రదాయ సాహిత్యాన్ని ఏమీ విమర్శించకుండా, తను చెప్పదల్చుకున్నది చెబుతున్నాడు. 

సాహిత్యంలో ప్రొగ్రెసివ్‌ ధోరణుల పట్ల మీ స్టాండ్‌ పాయింట్‌ ఏమిటి?
వెస్ట్‌లో లెఫ్ట్‌ భావజాలానికి చెందిన లిటరరీ స్కాలర్స్‌-- టెర్రీ ఈగల్టన్‌ (ఇంగ్లండ్‌) వంటివాళ్ళు తమ క్లాసిక్స్‌ని వేళాకోళం చేసుకోరు. ఇక్కడ మాత్రం, మనం లెఫ్ట్‌లో ఉన్నామంటే చాలు, క్లాసిక్స్‌ని వేళాకోళం చేయాలి. వాటిల్లో ఏమీ లేదూ అని చెప్పాలి. వెస్ట్‌ వాళ్ళు అలా చెప్పరు. భయపడి కాదు, It's not their purview. ప్రజలు దాన్నే ఏకైక సాహిత్యం అని నమ్మదల్చుకుంటే, నమ్మనీయండి అని వదిలేశారు. చాలా జాగ్రత్తగా బైబిల్‌ని విమర్శించారు వాళ్ళు. మనం అలాగ కాదు. ప్రొగ్రెసివ్‌ సాహిత్యం ఇక్కడ ఏమి వచ్చినా నేను చదువుతాను. కానీ ఆ పేరు మీద ఎక్కడ బాంబులు పడ్డా ఇక్కడే పడ్డట్టు పద్యాలు రాస్తే కొంచెం చిరాకు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బాంబు పడుతూనే ఉంటుంది. ఎక్కడో బాంబు పడగానే ఇక్కడ పద్యం రాయనవసరం లేదు. దాన్ని ప్రోగ్రెసివ్‌ అనుకోను. ఊరికే సరదాగా పద్యం రాసినట్టుగా ఉంటుంది. 
ఇంటర్వ్యూ:  వివిధ


Advertisement
Advertisement
Advertisement