రేవంత్ వ్యూహమేంటి..? పార్టీ పగ్గాలు చేపట్టినా హుజూరాబాద్‌పై దృష్టి పెట్టకపోవడం వెనుక..

ABN , First Publish Date - 2021-11-03T01:29:43+05:30 IST

హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనింపించకుండా పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో ఒక్కసారిగా

రేవంత్ వ్యూహమేంటి..? పార్టీ పగ్గాలు చేపట్టినా హుజూరాబాద్‌పై దృష్టి పెట్టకపోవడం వెనుక..

హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనింపించకుండా పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఒక్కసారిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చర్చ నడుస్తోంది. టీపీసీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో జోష్ నింపుతూ వచ్చిన రేవంత్.. హుజూరాబాద్ ఎన్నికల విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారు అనే విషయంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  కాంగ్రెస్ ఓటమి ఊహించిందేనని చెప్పారు.  పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారని, దీంతో పార్టీకి నష్టం జరిగిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారంటూ విమర్శించారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ తరపున ఒక్క సభ కూడా పెట్టలేదని విమర్శించారు. దుబ్బాక, నాగార్జున సాగర్‌లో పని చేసినట్లుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో గట్టి క్యాడర్ ఉన్నా.. తమవైపు తిప్పుకోవడంలో మాత్రం విఫలమయ్యారని పేర్కొన్నారు.


టీపీసీసీ రేవంత్ వ్యూహమేంటి..? 

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి జోరు పెంచారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేడర్‌ను యువకులతో నింపుతున్నారు. గ్రామ స్థాయి వరకు కేడర్‌ను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ జన జాగరణ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలను నమోదు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెల 9వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో రాహుల్ గాంధీతో కలిసి ఓ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.


కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన కాంగ్రెస్..

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ.. రేవంత్ నిత్యం జనాల్లో ఉంటూ పార్టీని పటిష్టం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వచ్చింది. కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన వారెవరైనా అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సత్తా చాటాలని చూస్తారు. అయితే ఇందుకు భిన్నంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం.. కనీసం సోదిలో లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు సాధించిన చోట, ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.


 బీజేపీకి పరోక్షంగా సహకరించారా..?

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం ప్రకారమే సైలెంట్ అయిపోయిందని అర్థమవుతోంది. తమకు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీకి పరోక్షంగా సహాయపడింది. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే ఈటెల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతుగా నిలిచింది. ఈటెల వర్సెస్ కేసీఆర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలో.. ఈటెలకు రేవంత్ సహాయపడ్డారు. త్రిముఖ పోరులో ఓట్ల చీలిక వల్ల టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందనే అభిప్రాయంతోనే రేవంత్ సైలెంట్ అయిపోయారు. ఈ ఎన్నికలో తలపడి కేసీఆర్‌కు లాభం చేకూర్చడం కంటే మొత్తం రాష్ట్రంపై దృష్టి సారించడమే మంచిదని భావిస్తున్నారు. ఆ దిశగానే ప్రణాళికలు రచిస్తున్నారు.


అభిమానులు ఏమంటున్నారంటే..

హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ప్రకారమే సైలెంట్‌గా ఉందని రేవంత్ రెడ్డి సన్నిహితులు, పార్టీ అభిమానులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు తమకు ముఖ్యం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యమని చెప్పుకొస్తున్నారు. ఇందుకోసమే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించడం, నాయకత్వ బలం తక్కువగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. ఇంచార్జ్‌లను నియమించడం, యువతరాన్ని ప్రోత్సహించడం వంటి వాటిపై దృష్టిసారించడం వంటి కార్యక్రమాలపై రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలన్నదే రేవంత్ వ్యూహమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Updated Date - 2021-11-03T01:29:43+05:30 IST