ఇదేం తిరకాసు!

ABN , First Publish Date - 2021-06-20T03:46:20+05:30 IST

ఇదేం తిరకాసు!

ఇదేం తిరకాసు!

15రోజుల్లో కొత్త రేషన్‌ కార్డులిస్తామన్న ముఖ్యమంత్రి

ప్రకటన తరువాత నిలిచిపోయిన ‘ఫుడ్‌ సెక్యూరిటీ’ వెబ్‌సైట్‌ 

కొత్త దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు 

పాతవారికే అవకాశం

ఇల్లెందు, జూన్‌ 19: అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు 15రోజుల్లో పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించగానే ‘హమ్మయ్య’ అంటూ ఆశల్లో తెలియాడిన కొత్త దరఖాస్తుదారులుకు నిరాశే మిగి లింది. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కొత్త దరఖాస్తులు నమోదు చేసు కోకుండా వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. ఈ పరి ణామంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌ 7న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అర్హులం దరికీ 15 రోజుల్లో రేషన్‌కార్డులు ఇవ్వాలని, ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. గతంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో సైతం త్వరలో రేషన్‌కార్డులు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటన చేయడంతో వేలాదిమంది రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేయడం ప్రారంభించారు. కేబినెట్‌ సమావేశంలో ప్రకటన చేసిన తరువాత మీ-సేవా కేంద్రాలకు కొత్త దరఖాస్తుదారులు బారులు తీరారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నాలుగు రోజుల నుంచి ఫుడ్‌ సెక్యూరిటీ వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఆశగా కొత్తకార్డుల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నారు. అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు ప్రభుత్వం రేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పి వెబ్‌సైట్‌ నిలిపివేయడం ఏంటని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కొత్తరేషన్‌కార్డుల జారీపై ప్రకటన చేయకముం దు పని చేసిన వెబ్‌సైట్‌ 15 రోజుల్లో కార్డులు ఇస్తామని చెప్పిన తరువాత మూడు రోజుల్లో మూసివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో చాలామంది కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోలేకుండా పోయారు.

పెండింగ్‌ దరఖాస్తులకే రేషన్‌కార్డులు 

గత మూడు, నాలుగేళ్లగా రాష్ట్రంలో పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సీఎం ప్రకటన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమందికి తోడు కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులకు కార్డులు ఇస్తారా.. లేదా అన్న విషయం రెవెన్యూ అధికారులకు సైతం స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రజలకు గతంలో కార్డులకోసం సమర్పించిన దరఖాస్తుల్లో మూడం చెల విచారణలే పూర్తి చేసుకుని సివిల్‌ సప్లయిస్‌ విభాగం డైనమిక్‌ కో రిజిష్టర్‌లో నమోదైనవారు 4,46,169 మంది ఉన్నారు. గతంలో డైనమిక్‌ రిజిస్టర్‌లో నమోదైన వారికి మాత్రమే కొత్త రేషన్‌కార్డులు మంజురవుతాయని, కొత్త దరఖాస్తుదారులకు రేషన్‌కార్డు జారీ కష్టమేనని కొందరు అధికారులు అనధికారిక సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు. అయితే హూజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ముంచుకు రావడం వల్ల ఓట్లకోసం కొత్త దర ఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని హమీ లభించవచ్చునని భావిస్తున్నారు. మొత్తం మీద రేషన్‌ కార్డుల కోసం కొత్తగా చేసిన చేస్తున్న అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల దరఖాస్తులకు మోక్షం లభిస్తుందో లేదో వేచిచూడాల్సి ఉంది. ఏకంగా కొత్త దరఖాస్తులు చేయ కుండా వెబ్‌సైట్‌ని నిలిపివేయడంతో రెషన్‌కార్డులు అందని ద్రాక్షగానే మారే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-20T03:46:20+05:30 IST