రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కుంది?

ABN , First Publish Date - 2021-04-28T09:12:36+05:30 IST

సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కుందని జగన్‌ సర్కారును టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు

రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కుంది?

సంగం డెయిరీ స్వాధీన జీవోపై టీడీపీ ప్రశ్న

భూమి ప్రభుత్వానిది కాదు.. వాటా కూడా లేదు

డెయిరీ కబ్జాకు అడ్డు రాకూడదనే ధూళిపాళ్ల అరెస్టు: పట్టాభి 


అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కుందని జగన్‌ సర్కారును టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు. ఈ డెయిరీని కబ్జా చేయడానికి సీఎం జగన్‌రెడ్డి కుటిలయత్నాలు చేస్తున్నారని, దీనిలో భాగంగానే డెయిరీని స్వాధీనం చేసుకొంటున్నామని జీవో జారీ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘సంగం డెయిరీకి ఉన్న భూమి ప్రభుత్వానిది కాదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పాడి రైతులు ఒక రోజు తాము పోసిన పాలు విరాళంగా ఇస్తే ఆ డబ్బుతో డెయిరీ కొనుక్కుంది. దానిలో ఇప్పుడు ప్రభుత్వానికి ఏ వాటా లేదు. ప్రభుత్వ వాటాగా ఉన్న రూ.81 లక్షలను డెయిరీ యాజమాన్యం చాలాకాలం కిందటే తిరిగి చెల్లించేసింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఒకదానిని.. కంపెనీ చట్టం కింద ఏర్పాటుచేసి దాని కిందకు ఈ డెయిరీని తీసుకువచ్చారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జాతీ య డెయిరీ అభివృద్ధి సంస్థ మార్గదర్శకత్వంలో ఈ మార్పు చేశారు. సంగం డెయిరీ ఒక వ్యక్తిది కాదు. దీనిలో 1.20లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. 300కు పైగా ఉన్న పాల సొసైటీల అధ్యక్షులు 15మంది డైరెక్టర్లను ఎన్నుకొంటారు. ఆ డైరెక్టర్లు తమ అధ్యక్షునిగా ధూళిపాళ్ల నరేంద్రను ఎన్నుకొన్నారు. ఆయన ఎన్నికైన అధ్యక్షుడు. దీనిని కప్పిపుచ్చి ఈ డెయిరీ నరేంద్ర సొంతమైనట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దానిని కబ్జా చేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని పట్టాభి విమర్శించారు. 


జగన్‌రెడ్డి ప్రభుత్వం అసలు అజెండా సంగం డెయిరీని కబ్జా చేయడమేనని, దానికి అడ్డురాకుండా చూడటానికే ముందు తప్పుడు ఆరోపణలతో నరేంద్రను అరెస్టు చేశారని పట్టాభి ఆరోపించారు. ‘‘నరేంద్ర కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఇచ్చిన జీవోలో వేర్వేరు ఆరోపణలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సంగం డెయిరీకి సంబంధించిన 10ఎకరాల భూమిని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టుకు బదలాయించడాన్ని నేరంగా చూపించారు. ఆ భూమిలో నరేంద్ర సొంతంగా ఇల్లు కట్టుకొన్నారా? లేక ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకొన్నారా? ట్రస్టు తరఫున ఆస్పత్రి నిర్మించి పాడిరైతులకు, పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్‌ కుటుంబం తమ జీవితంలో ఎక్కడైనా ఒకచోటైనా ఒక ఆస్పత్రి నిర్మించిందా? పేదలకు సేవచేసిందా? నరేంద్ర ఆ పని చేస్తుంటే భరించలేకపోతున్నారు. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి జారీ చేసిన జీవోలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌డీడీబీ నుంచి రుణం తీసుకోవడం నేరంగా చూపించారు. తప్పుడు మార్గంలో రుణం తీసుకోవాలంటే కేంద్ర సంస్థ ఇస్తుందా? తప్పు చేసిందని కేంద్ర సంస్థపై కూడా కేసు పెట్టగలరా?’’ అని పట్టాభి ప్రశ్నించారు. నరేంద్ర చైర్మన్‌ కాకముందు డెయిరీ టర్నోవర్‌ రూ.200కోట్లు అని, ఇప్పుడు రూ.1000కోట్లు దాటిందని చెప్పారు.

Updated Date - 2021-04-28T09:12:36+05:30 IST